Raksha Bandhan | అనుబంధాల పండుగ.. రక్షాబంధన్..! రాఖీ వెనుక.. ఎన్నో కథలు..!
Raksha Bandhan | చేతికి కట్టే దారం చిన్నదే.. అది మోసుకొచ్చే బంధం మాత్రం ఎంతో పెద్దది! బాల్యపు అల్లరి నుంచి జీవితంలోని బాధ్యతల వరకు కలిసి నడిచిన అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి రాఖీ ఓ మధుర జ్ఞాపకం. మణికట్టుపై మెరిసే ఆ చిన్న సూత్రంలో ప్రేమ ఉంది. ఆప్యాయత ఉంది. కష్టకాలంలో ‘నేనున్నా’ అనే భరోసా ఉంది. అదే రక్షాబంధన్.
Devotional | Published On Aug 28, 2026, 6.10 am IST
Raksha Bandhan | చేతికి కట్టే దారం చిన్నదే.. అది మోసుకొచ్చే బంధం మాత్రం ఎంతో పెద్దది! బాల్యపు అల్లరి నుంచి జీవితంలోని బాధ్యతల వరకు కలిసి నడిచిన అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి రాఖీ ఓ మధుర జ్ఞాపకం. మణికట్టుపై మెరిసే ఆ చిన్న సూత్రంలో ప్రేమ ఉంది. ఆప్యాయత ఉంది. కష్టకాలంలో ‘నేనున్నా’ అనే భరోసా ఉంది. అదే రక్షాబంధన్. శ్రావణమాసం అనగానే పూజలు, వ్రతాలు, నోములు, పేరంటాలతో ఆధ్యాత్మిక సందడి కనిపిస్తుంది. ముత్తైదువుల పట్టుచీరల మెరుపులు, పసుపు పాదాల పరిమళం, పట్టు పావడాలతో తిరిగే చిన్నారుల సందడి.. ఇలా శ్రావణ మాసానికి ప్రత్యేకమైన వాతావరణం ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక సందడికి మరింత శోభను తెచ్చేది శ్రావణ పౌర్ణమి. అదే రాఖీ పౌర్ణమి. రక్షికా పూర్ణిమ, నారికేళ పూర్ణిమ, జంధ్యాల పౌర్ణమి, సారవీ పూర్ణిమ వంటి పేర్లతోనూ ఈ పర్వాన్ని పిలుస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో భిన్నమైన ఆచారాలతో నిర్వహించే ఈ వేడుకలో సోదర సోదరీమణులే ప్రధాన పాత్రధారులు. హిందువులతో పాటు జైన, సిక్కు, బౌద్ధ సంప్రదాయాల్లోనూ రక్షాబంధన్‌కు ప్రాధాన్యం కనిపిస్తుంది.
చెదరని బంధానికి గుర్తుగా..
పౌర్ణమికి కొద్ది రోజుల ముందే మార్కెట్లలో రాఖీల సందడి మొదలవుతుంది. అన్న, తమ్ముడి మణికట్టుకు కట్టేందుకు అక్కాచెల్లెళ్లు తమకు నచ్చిన రాఖీలను ఎంపిక చేసుకుంటారు. సాధారణ నూలు రాఖీల నుంచి వెండి, బంగారు కంకణాల తరహా రాఖీల వరకు నేడు ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. ముత్యాలు, జరీ దారాలు, పెండెంట్లు, రంగురంగుల అలంకరణలతో తయారయ్యే రాఖీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సోదరుడు ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సోదరి రాఖీ కడుతుంది. అనంతరం తిలకం దిద్ది, హారతి ఇచ్చి, తీపి తినిపించడం సంప్రదాయం. సోదరులు సైతం తమ సోదరికి కానుక అందించి ఆమెకు అండగా ఉంటామని భరోసా ఇస్తారు. సొంత అన్నదమ్ములు లేనివారు తమకు ఆత్మీయులైన వారిని సోదరులుగా భావించి రాఖీ కట్టడం కూడా ఈ పండుగ ప్రత్యేకత.
పురాణాల్లో రాఖీ ప్రస్తావన..
రక్షాబంధనానికి సంబంధించిన అనేక కథలు పురాణాల్లో కనిపిస్తాయి. భవిష్య పురాణం ప్రకారం దేవతలు, దానవుల మధ్య జరిగిన యుద్ధంలో ఇంద్రుడి విజయాన్ని ఆకాంక్షిస్తూ శచీదేవి తన భర్తకు రక్ష కట్టింది. ఆ రక్షతో ఇంద్రుడికి విజయప్రాప్తి కలిగిందని కథనం. అలాగే శ్రీమహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు పాతాళంలో ఉండగా.. తన భర్తను తిరిగి వైకుంఠానికి తీసుకెళ్లేందుకు మహాలక్ష్మి బలి వద్దకు వెళ్లి రక్షాబంధనం కట్టిందని మరో పురాణగాథ చెబుతుంది. తాను సోదరి సమానురాలినని తెలిపిన ఆమెను సంతోషంతో ఆదరించిన బలి వరం కోరుకోమన్నాడు. తన భర్తను తనతో పంపించాలని లక్ష్మీదేవి కోరడంతో బలి అంగీకరించాడని కథనం. రాఖీ కట్టే సమయంలో చదివే ‘యేన బద్ధో బలీ రాజా...’ అనే శ్లోకానికి ఈ గాథతో సంబంధం ఉందని భావిస్తారు. ద్వాపరయుగంలోనూ రక్షాబంధనం ప్రస్తావన ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ధర్మరాజుకు శ్రీకృష్ణుడు రక్షాబంధనం విశిష్టతను వివరించాడని కథనం. ధర్మం, సంస్కృతి, సమాజ పరిరక్షణకు పరస్పర అండగా నిలవాలనే భావన ఇందులో అంతర్లీనంగా ఉందని విశ్వసిస్తారు.
సంతోషిమాత కథ..
వినాయకుడి కుమారులుగా క్షేముడు, లాభుడిని పేర్కొంటారు. వీరికి సోదరి లేకపోవడంతో రక్షాబంధనం సందర్భంగా ఒక సోదరి కావాలని గణపతిని కోరారని కథనం. వారి కోరికకు సంతోషించిన వినాయకుడి ఆనందబాష్పాల నుంచి సంతోషిమాత అవతరించిందని పురాణగాథ. సోదరి అనుబంధం ఎంతటి ఆనందాన్ని ఇస్తుందో తెలియజేసే కథగా దీన్ని చెబుతారు.
చరిత్రలోనూ రాఖీ..
రక్షాబంధనం కేవలం కుటుంబ పండుగగానే కాకుండా సామాజిక ఐక్యతకు ప్రతీకగా మారిన సందర్భాలు చరిత్రలోనూ కనిపిస్తాయి. అలెగ్జాండర్ భారత దండయాత్ర సమయంలో అతని భార్య పురుషోత్తముడికి రాఖీ పంపి తన భర్తకు హాని చేయవద్దని కోరిన కథ ప్రచారంలో ఉంది. యుద్ధంలో అలెగ్జాండర్ ప్రాణాలకు ముప్పు ఏర్పడినప్పటికీ పురుషోత్తముడు రాఖీకి ఇచ్చిన గౌరవంతో తన మాట నిలబెట్టుకున్నాడని చెబుతారు. భారతీయ రాజ్యాల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు రక్షాసూత్రాన్ని ఉపయోగించినట్లు కూడా చారిత్రక కథనాలు ఉన్నాయి. స్వాతంత్ర్యోద్యమ కాలంలో రాఖీ సామాజిక చైతన్యానికి వేదికగా మారింది. లోకమాన్య తిలక్ మహారాష్ట్రలో రాఖీ వేడుకలను నిర్వహించి ప్రజల్లో ఐక్యతా భావాన్ని పెంపొందించేందుకు కృషి చేసినట్లు చరిత్ర చెబుతోంది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ సైతం రక్షాబంధనాన్ని సామాజిక ఐక్యతకు ఉపయోగించారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా హిందూ, ముస్లింల మధ్య సోదరభావాన్ని బలపరిచేందుకు రాఖీ వేడుకలను నిర్వహించారు. ఒకరిపై ఒకరు నమ్మకం, గౌరవం, రక్షణ కల్పించుకోవాలనే సందేశాన్ని ఈ సందర్భంగా చాటారు.
అందరి పండుగగా..
ప్రస్తుతం రక్షాబంధనం కుటుంబాలను దాటి సామాజిక వేడుకగా మారింది. పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంస్థలు, వివిధ సామాజిక వర్గాలు రాఖీ వేడుకలను నిర్వహిస్తున్నాయి. కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ఒకరికి ఒకరు రాఖీ కట్టుకోవడం ద్వారా సోదరభావాన్ని చాటుతున్నారు. అందుకే రక్షాబంధనం ఇప్పుడు ఒక కుటుంబానికో, ఒక ప్రాంతానికో పరిమితమైన పండుగ కాకుండా విశ్వసోదర భావాన్ని చాటే వేడుకగా రూపుదిద్దుకుంది.
రాఖీ పేరు వెనుక..
‘రక్ష’ నుంచి ‘రాఖీ’ అనే పదం వచ్చిందని సాధారణంగా భావిస్తారు. రక్షణ కల్పించే పవిత్ర సూత్రాన్నే రక్షికగా పేర్కొంటారు. సోదరి తన సోదరుడి మణికట్టుకు ఈ సూత్రాన్ని కడుతూ అతడి క్షేమాన్ని కోరుతుంది. సోదరుడు కూడా ఆమెకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తాననే బాధ్యతను స్వీకరిస్తాడు. అందుకే రాఖీ ఒక సాధారణ దారం కాదు.. బంధాన్ని గుర్తు చేసే ఆత్మీయ ప్రతీక.
ప్రాంతానికో ప్రత్యేకత
దేశంలోని వివిధ ప్రాంతాల్లో రక్షాబంధనం వేర్వేరు పేర్లతో, ప్రత్యేక ఆచారాలతో జరుగుతుంది. ఉత్తర భారతంలో రాఖీ పూర్ణిమను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో దీనిని కజరీ పౌర్ణమిగా పిలుస్తారు. గుజరాత్‌లో పవిత్రోపనగా జరుపుకొనే సంప్రదాయం ఉంది. పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో ఝులన్ పూర్ణిమ పేరుతో రాధాకృష్ణుల ఆరాధనకు ప్రాధాన్యం ఇస్తారు. మహారాష్ట్రలో నారళీ పౌర్ణిమగా జరుపుతారు. తీర ప్రాంత మత్స్యకారులు సముద్రదేవుడైన వరుణుడిని పూజించి కొబ్బరికాయలను సముద్రంలో సమర్పిస్తారు. నేపాల్‌లో జనై పూర్ణిమ, రిషితర్పణి పేర్లతో ఈ పర్వదినాన్ని నిర్వహిస్తారు. ప్రాంతాలు మారినా.. ఆచారాలు వేరైనా.. రక్షాబంధనం చెప్పే సందేశం మాత్రం ఒక్కటే. అనుబంధాలను కాపాడుకుందాం.. ఆప్యాయతలను పంచుకుందాం.. ఒకరికి ఒకరం అండగా నిలుద్దాం. ఇదే రాఖీ పౌర్ణమి సారాంశం.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●SIR | ఇంటి పేరుతో ఎన్యుమరేషన్ ఫారం.. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌కి SIR నోటీసులు
- ●కాంగ్రెస్ డిసిప్లిన్ చక్రం: మంత్రులపై చర్యలు ఎలా తీసుకుంటారు? కొండా సురేఖ ఎపిసోడ్‌తో పూర్తి వివరాలు
- ●Horoscope | ఆగస్టు 28 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఖర్చులు అధికం!
- ●Bhatti Vikramarka | దేవదుర్గ గనిలో పెద్ద ఎత్తున బంగారం.. వెలికి తీయాలని డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
- ●CM Revanth Reddy | అక్కాచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు : సీఎం రేవంత్ రెడ్డి
- ●TGSRTC | రాఖీ పండుగకు 5,000 ఆర్టీసీ బస్సులు..

SIR | ఇంటి పేరుతో ఎన్యుమరేషన్ ఫారం.. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌కి SIR నోటీసులు

కాంగ్రెస్ డిసిప్లిన్ చక్రం: మంత్రులపై చర్యలు ఎలా తీసుకుంటారు? కొండా సురేఖ ఎపిసోడ్‌తో పూర్తి వివరాలు

Horoscope | ఆగస్టు 28 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఖర్చులు అధికం!

Bhatti Vikramarka | దేవదుర్గ గనిలో పెద్ద ఎత్తున బంగారం.. వెలికి తీయాలని డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం





