త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Madhya Pradesh Train Accident | రైలులో మంటలని పుకారు.. ప్రాణభయంతో ట్రాక్‌పైకి దూకిన జనం.. నలుగురిని బలితీసుకున్న మరో ఎక్స్‌ప్రెస్

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రైలులో మంటలు చెలరేగాయన్న పుకారుతో ప్రాణభయంతో పక్క ట్రాక్‌పైకి దూకిన ప్రయాణికులను మరో ఎక్స్‌ప్రెస్ రైలు బలితీసుకుంది.

J

Crime | Published On Jun 14, 2026, 7.31 pm IST

Madhya Pradesh Train Accident | రైలులో మంటలని పుకారు.. ప్రాణభయంతో ట్రాక్‌పైకి దూకిన జనం.. నలుగురిని బలితీసుకున్న మరో ఎక్స్‌ప్రెస్
Advertisement

Madhya Pradesh Train Accident | మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) మోరెనా సమీపంలో ఒక చిన్న పుకారు పెను విషాదాన్ని మిగిల్చింది. రైలులో మంటలు చెలరేగాయన్న వదంతులతో ప్రాణభయంతో పక్క ట్రాక్‌పైకి దూకిన ప్రయాణికులను మరో ఎక్స్‌ప్రెస్ రైలు అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఒక చిన్నారి సహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

అసలేం జరిగిందంటే

ఆదివారం సాయంత్రం 4:15 గంటల సమయంలో ఖజురహో–ఉదయ్‌పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (Train No. 19665) నార్త్ సెంట్రల్ రైల్వే పరిధిలోని ఝాన్సీ డివిజన్‌లోని హేతంపూర్ - ధోల్పూర్ స్టేషన్ల మధ్య ప్రయాణిస్తోంది. ఆ సమయంలో ఇంజిన్ తర్వాతి రెండో జనరల్ కోచ్‌లో ఉన్న ప్రయాణికుల్లో ఒకరు అకస్మాత్తుగా అలారం చైన్ (Alarm Chain) లాగడంతో రైలు ఒక్కసారిగా నిలిచిపోయింది. మంటలు వస్తున్నాయనే పుకారుతో భయాందోళన చెందిన ప్రయాణికులు హడావుడిగా రైలు దిగి పక్కనే ఉన్న ట్రాక్‌పైకి చేరుకున్నారు.

మృత్యువులా దూసుకొచ్చిన పాతాళ్‌కోట్ ఎక్స్‌ప్రెస్

అందరూ ప్రాణాలు దక్కించుకున్నామనుకునే లోపే.. అదే సమయంలో అప్ లైన్ (Up line) లో ఫిరోజ్‌పూర్-సియోనీ పాతాళ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ (Train No. 20424) వేగంగా దూసుకొచ్చింది. ట్రాక్‌పై ఉన్న జనాలను ఆ రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ఊహించని ప్రమాదంలో చిన్నారితో కలుపుకుని నలుగురు మృత్యువాత పడ్డారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.

సహాయక చర్యలు ముమ్మరం

సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అడ్మినిస్ట్రేషన్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP), స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ (Rescue operations) చేపట్టారు. "బాధితులకు అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నాం. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై పూర్తిస్థాయి విచారణ (Investigation) జరుపుతున్నాం" అని నార్త్ సెంట్రల్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ విభాగం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

రైల్వే శాఖ విజ్ఞప్తి

ఈ ఘటన నేపథ్యంలో రైల్వే శాఖ ప్రయాణికులకు ఒక కీలక సూచన చేసింది. కదులుతున్న లేదా ఆగి ఉన్న రైలు నుంచి ఎలాంటి అనధికారిక కారణాలతో కిందకు దిగొద్దని, రైల్వే భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేసింది. అనవసరమైన పుకార్లను నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించింది.

Advertisement
Advertisement