త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mumbai Concert Drug Overdose | మ్యూజిక్ కన్సర్ట్‌లో తీవ్ర విషాదం: డ్రగ్స్ ఓవర్‌డోస్‌తో ఇద్దరు ఎంబీఏ విద్యార్థులు మృతి

ముంబైలోని గోరేగావ్‌లో జరిగిన ఓ మ్యూజిక్ కన్సర్ట్‌లో డ్రగ్స్ ఓవర్‌డోస్ కారణంగా ఇద్దరు ఎంబీఏ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. ఈ కేసులో ఈవెంట్ ఆర్గనైజర్లతో సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

J

Crime | Published On Apr 14, 2026, 3.52 pm IST

Mumbai Concert Drug Overdose | మ్యూజిక్ కన్సర్ట్‌లో తీవ్ర విషాదం: డ్రగ్స్ ఓవర్‌డోస్‌తో ఇద్దరు ఎంబీఏ విద్యార్థులు మృతి
Advertisement

Mumbai Concert Drug Overdose | త్రినేత్ర.న్యూస్ : ముంబై నగరంలో జరిగిన ఓ మ్యూజిక్ ఈవెంట్ తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ కన్సర్ట్‌లో పాల్గొన్న ఇద్దరు ఎంబీఏ (MBA) విద్యార్థులు డ్రగ్స్ ఓవర్‌డోస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మరో విద్యార్థిని పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. సరదాగా గడుపుదామని వెళ్లిన విద్యార్థులు విగతజీవులుగా మారడం స్థానికంగా కలకలం రేపింది.

అసలేం జరిగిందంటే..

ఏప్రిల్ 11వ తేదీ రాత్రి గోరేగావ్‌లోని నెస్కో సెంటర్ (NESCO Centre)లో ఓ భారీ మ్యూజిక్ కన్సర్ట్ జరిగింది. తలా రూ.2,000 ఎంట్రీ ఫీజు చెల్లించి సుమారు 4,000 మందికి పైగా యువత ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. అయితే, ఈ కన్సర్ట్‌లో కొందరు నిషేధిత 'ఎండీఎంఏ' (MDMA) డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

రాత్రి 12 గంటల సమయంలో ముగ్గురు విద్యార్థులు తీవ్ర శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడటంతో వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 24 ఏళ్ల యువతి, 28 ఏళ్ల యువకుడు మృతి చెందారు. మరో 25 ఏళ్ల యువతి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

క్యాబ్‌లో ఒకటి.. ఈవెంట్‌లో మరొకటి

ముంబై పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. మృతి చెందిన యువకుడు ఈవెంట్‌కు వచ్చే ముందు క్యాబ్‌లో ఒక డ్రగ్ పిల్ వేసుకోగా, ఈవెంట్‌లోకి వెళ్లిన తర్వాత మరో పిల్ తీసుకున్నాడు. తక్కువ వ్యవధిలోనే రెండు డ్రగ్స్ తీసుకోవడంతో ఓవర్‌డోస్ అయిందని, డ్రగ్స్ ఓవర్‌డోస్ వల్లే వాళ్లు మరణించారని వైద్యులు సైతం ధృవీకరించారు.

నిర్వాహకులు, విద్యార్థుల అరెస్ట్

ఈ కేసులో డ్రగ్స్ సరఫరా చేసిన విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి ఆరేడు మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ముంబై వెలుపలి ప్రాంతాల నుంచి ఈ డ్రగ్స్‌ను నగరంలోకి తీసుకొచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

డ్రగ్స్ వ్యవహారంతో ఈవెంట్ ఆర్గనైజర్ విహాన్ అలియాస్ ఆకాష్ సమాల్, నెస్కో ఈవెంట్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్‌మెంట్‌కు చెందిన సన్నీ వినోద్ జైన్, ఇంటర్నల్ సెక్యూరిటీ టీమ్ సభ్యుడు బాలకృష్ణన్ బలరామ్‌లతో పాటు మరో ఇద్దరు విద్యార్థులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ కన్సర్ట్‌లో యువత డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దర్యాప్తుకు సహకరిస్తున్నాం: నెస్కో సెంటర్

ఈ ఘటనపై నెస్కో సెంటర్ యాజమాన్యం స్పందించింది. "పరిస్థితి తీవ్రతను మేము అర్థం చేసుకున్నాము. సంబంధిత అధికారుల విచారణకు మా వంతు పూర్తి సహకారం అందిస్తున్నాము. వాస్తవాలను వీలైనంత త్వరగా వెలికితీసేందుకు అవసరమైన అన్ని వివరాలను పోలీసులకు అందజేస్తున్నాము" అని సంస్థ ప్రతినిధి తెలిపారు.

Advertisement
Advertisement