త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Binance Hack | క్రిప్టో చ‌రిత్ర‌లోనే అతి పెద్ద సైబ‌ర్ దాడి.. 5.8 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన క్రిప్టో చోరీ.. క్రిప్టో క‌రెన్సీలు భారీగా ప‌త‌నం..

Binance Hack | త్రినేత్ర‌.న్యూస్‌: క్రిప్టో చ‌రిత్ర‌లోనే అతి పెద్ద సైబ‌ర్ దాడి చోటు చేసుకుంది. క్రిప్టో క‌రెన్సీల్లో వినియోగ‌దారులు పెట్టుబ‌డిగా పెట్టిన సుమారు 5.8 బిలియన్ డాల‌ర్ల విలువైన క్రిప్టో క‌రెన్సీల‌ను హ్యాక‌ర్లు విడ‌త‌ల‌వారీగా చోరీ చేశారు. ప్ర‌ముఖ క్రిప్టోక‌రెన్సీ ఎక్స్‌ఛేంజ్ బైనాన్స్ (Binance)పై హ్యాక‌ర్లు పంజా విసిరారు. ఈ మేర‌కు అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌లు క‌థ‌నాల‌ను వెలువ‌రించాయి.

S

Business | Published On Oct 30, 2026, 7.24 am IST

Binance Hack | క్రిప్టో చ‌రిత్ర‌లోనే అతి పెద్ద సైబ‌ర్ దాడి.. 5.8 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన క్రిప్టో చోరీ.. క్రిప్టో క‌రెన్సీలు భారీగా ప‌త‌నం..
Advertisement

Binance Hack | త్రినేత్ర‌.న్యూస్‌: క్రిప్టో చ‌రిత్ర‌లోనే అతి పెద్ద సైబ‌ర్ దాడి చోటు చేసుకుంది. క్రిప్టో క‌రెన్సీల్లో వినియోగ‌దారులు పెట్టుబ‌డిగా పెట్టిన సుమారు 5.8 బిలియన్ డాల‌ర్ల విలువైన క్రిప్టో క‌రెన్సీల‌ను హ్యాక‌ర్లు విడ‌త‌ల‌వారీగా చోరీ చేశారు. ప్ర‌ముఖ క్రిప్టోక‌రెన్సీ ఎక్స్‌ఛేంజ్ బైనాన్స్ (Binance)పై హ్యాక‌ర్లు పంజా విసిరారు. ఈ మేర‌కు అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌లు క‌థ‌నాల‌ను వెలువ‌రించాయి. ఈ విష‌యాన్ని బైనాన్స్ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ సీఈవో చాంగ్‌పెంగ్ జావో ధ్రువీక‌రించారు. బ్లాక్ చెయిన్ సంస్థ‌ల నిఘాతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అయితే ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన బైనాన్స్ అసాధార‌ణ, అనుమానాస్ప‌ద లావాదేవీలు జ‌రిగిన‌ విష‌యం వాస్త‌వ‌మేన‌ని అంగీక‌రించింది. దీనిపై లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని, ప్ర‌స్తుతానికి త‌మ ప్లాట్‌ఫాం నుంచి విత్‌డ్రాల‌ను నిలిపివేసిన‌ట్లు తెలిపింది. అయితే వినియోగ‌దారుల నిధులు సుర‌క్షితంగానే ఉన్నాయ‌ని హామీ ఇచ్చింది. కాగా ఈ వార్త‌లు వెలువ‌డిన మ‌రుక్ష‌ణ‌మే క్రిప్టో క‌రెన్సీలు భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. బిట్‌కాయిన్ కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే 3.2 శాతానికి పైగా క్షీణించింది.

బ్లాక్ చెయిన్ ప‌రిశోధ‌న‌ల్లో గుర్తింపు..

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన బైనాన్స్ భారీ సైబర్ భద్రతా సమస్యను ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. భార‌త కాల‌మానం ప్ర‌కారం శుక్ర‌వారం అర్ధ‌రాత్రి నుంచి ఈ వార్త‌లు వెలువ‌డుతున్నాయి. బైనాన్స్ కు చెందిన పలు క్రిప్టోకరెన్సీ హాట్ వాలెట్ల నుంచి బిలియన్ల డాలర్ల విలువైన డిజిటల్ ఆస్తులు అనుమానాస్పద వాలెట్లకు బదిలీ అయినట్లు బ్లాక్‌చెయిన్ పరిశోధకులు గుర్తించారు. ఈ ఘటనపై బైనాన్స్ స్పందిస్తూ తమకు భద్రతా సమస్యకు సంబంధించిన సమాచారం అందిందని, దానిపై అత్యవసరంగా దర్యాప్తు చేస్తున్నామని ప్రకటించింది. అయితే, వినియోగదారుల నిధులు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని సంస్థ స్పష్టం చేసింది.

అసలు ఏం జరిగింది?

అక్టోబర్ 29న బైనాన్స్ కు చెందిన పలు హాట్ వాలెట్ల నుంచి భారీ మొత్తంలో క్రిప్టోకరెన్సీ ఇతర వాలెట్లకు బదిలీ అయినట్లు బ్లాక్‌చెయిన్ లావాదేవీలను పర్యవేక్షించే పరిశోధకులు గుర్తించారు. ప్రాథమిక బ్లాక్‌చెయిన్ విశ్లేషణ ప్రకారం బైనాన్స్ కు చెందిన బైనాన్స్ 14 గా గుర్తించిన హాట్ వాలెట్ నుంచి సుమారు 2.53 బిలియన్ డాలర్ల విలువైన 64 రకాల క్రిప్టో ఆస్తులు ఒక కొత్త ఎథిరియం (Ethereum) అడ్రస్‌కు బదిలీ అయ్యాయి. ఆ తర్వాత మరో బైనాన్స్ వాలెట్ నుంచి సుమారు 174.4 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు అదే అడ్రస్‌కు చేరినట్లు నివేదికలు పేర్కొన్నాయి. తదుపరి లావాదేవీలతో అనుమానాస్పద బదిలీల మొత్తం సుమారు 3.3 నుంచి 3.55 బిలియన్ డాలర్లకు చేరినట్లు బ్లాక్ ఎయిడ్‌, ది బ్లాక్ నివేదికలు వెల్లడించాయి. మరోవైపు, బ్లాక్‌చెయిన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆర్కం ఇంటెలిజెన్స్ పర్యవేక్షణలో ఉన్న అనుమానాస్పద వాలెట్లలో మొత్తం ఆస్తుల విలువ సుమారు 5.8 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. అయితే ఈ 5.8 బిలియన్ డాలర్లు పూర్తిగా చోరీకి గురైన మొత్తం కాదు. అనుమానాస్పదంగా గుర్తించిన పలు వాలెట్లలో ఉన్న ఆస్తుల మొత్తం విలువ మాత్రమే. వాస్తవంగా ఎంతమొత్తం చోరీకి గురైందనేది ఇంకా నిర్ధారణ కాలేదు.

టెథ‌ర్ (Tether), స‌ర్కిల్ (Circle) కీలక చర్యలు.. 2.3 బిలియన్ల డాలర్ల‌కు పైగా ఆస్తులు ఫ్రీజ్..

ఈ ఘటనలో అత్యంత కీలక పరిణామం ప్రముఖ స్టేబుల్‌కాయిన్ సంస్థలు టెథ‌ర్‌, స‌ర్కిల్ తీసుకున్న చర్యలు. అనుమానాస్పద లావాదేవీలతో సంబంధం ఉన్న క్రిప్టో ఆస్తులను గుర్తించిన ఈ రెండు సంస్థలు వాటిని ఫ్రీజ్ చేసినట్లు ప్రకటించాయి. టెథ‌ర్ సుమారు 1.567 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా విలువైన యూఎస్‌డీటీ (USDT)ని ఫ్రీజ్ చేసిన‌ట్లు సీఈవో పాలో ఆల్డోయినో తెలిపారు. 800 మిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా యూఎస్‌డీసీ (USDC)ని ఫ్రీజ్ చేసిన‌ట్లు స‌ర్కిల్ సీఈవో జెరెమీ అలెయిర్ తెలిపారు. ఈ రెండు సంస్థలు తీసుకున్న చర్యలతో కలిపి సుమారు 2.3 బిలియన్ డాలర్లకు పైగా స్టేబుల్‌కాయిన్ ఆస్తుల‌ను నిలిపివేశారు. కాగా ఈ చర్యలు సంబంధిత వాలెట్లలోని ఆస్తులను ఇతరులకు బదిలీ చేయకుండా నిరోధించేందుకు ఉపయోగపడతాయి. అయితే అన్ని రకాల క్రిప్టోకరెన్సీలను ఇదే విధంగా ఫ్రీజ్ చేయడం సాధ్యం కాదు. ఈ దర్యాప్తులో సంబంధిత అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు స‌ర్కిల్ వెల్లడించింది.

బైనాన్స్ వ్య‌వ‌స్థాప‌కుడు ఏమ‌న్నారు ?

కాగా ఈ ఘ‌ట‌న‌పై బైనాన్స్ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ సీఈవో చాంగ్‌పెంగ్ జావో త‌న అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు. ఇది హ్యాకింగ్ అయి ఉంటుంద‌ని తాము అనుమానిస్తున్నామ‌ని, పూర్తి వివ‌రాలు విచార‌ణ త‌రువాత తెలుస్తాయ‌ని అన్నారు. అయితే వినియోగదారుల నిధులు సురక్షితంగా ఉన్నాయని, అవసరమైతే వారి నష్టాలను పూర్తిగా భర్తీ చేస్తారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బైనాన్స్ రోజువారీ కార్యకలాపాలను తాను నిర్వహించడం లేదని, అయినప్పటికీ వినియోగదారుల నిధుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

బైనాన్స్ ఎందుకు విత్‌డ్రాయల్స్ నిలిపివేసింది?

ఈ భద్రతా ఘటన నేపథ్యంలో బైనాన్స్ పలు బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్‌లలో క్రిప్టోకరెన్సీ విత్‌డ్రాయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు టెక్ క్రంచ్ నివేదించింది. భద్రతా సమస్యపై దర్యాప్తు జరుగుతున్న సమయంలో మరిన్ని అనుమానాస్పద లావాదేవీలు జరగకుండా నిరోధించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బైనాన్స్ ప్రతినిధి వెల్లడించారు. ఇలాంటి సందర్భాల్లో క్రిప్టో ఎక్స్ఛేంజీలు విత్‌డ్రాయల్స్ నిలిపివేయడం సాధారణ భద్రతా చర్య. అయితే అన్ని నెట్‌వర్క్‌లలో విత్‌డ్రాయల్స్ పూర్తిగా నిలిచిపోయాయని చెప్పడానికి ఆధారాలు లేవు. నివేదిక ప్రకారం పలు నెట్‌వర్క్‌లలో మాత్రమే తాత్కాలికంగా నిలిపివేశారు.

హ్యాకర్లు ఎలా దాడి చేశారు?

ఈ ఘటనలో అసలు హ్యాకింగ్ పద్ధతి ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే పరిశోధకులు ప్రధానంగా హాట్ వాలెట్ల నుంచి జరిగిన అనుమానాస్పద లావాదేవీలను పరిశీలిస్తున్నారు.

హాట్ వాలెట్ అంటే ఏమిటి?

క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలు వినియోగదారుల ట్రేడింగ్, డిపాజిట్, విత్‌డ్రాయల్ అవసరాల కోసం ఇంటర్నెట్‌కు అనుసంధానమైన డిజిటల్ వాలెట్లను ఉపయోగిస్తాయి. వీటినే హాట్ వాలెట్లు అంటారు. వీటికి నిరంతరం ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండడం వల్ల లావాదేవీలు వేగంగా నిర్వహించవచ్చు. అయితే ప్రైవేట్ కీలు లేదా ట్రాన్సాక్షన్ సంతకాలకు సంబంధించిన భద్రతా వ్యవస్థల్లో లోపాలు తలెత్తితే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ ఘటనలో హ్యాకర్లు ఏదైనా ప్రైవేట్ కీని దొంగిలించారా? ట్రాన్సాక్షన్ సంతకాల వ్యవస్థలో లోపాన్ని ఉపయోగించుకున్నారా? లేక ఇతర భద్రతా వ్యవస్థలపై దాడి చేశారా? అనే విషయాలపై ఇంకా అధికారిక సమాచారం లేదు. అందువల్ల దాడి జరిగిన విధానంపై ఇప్పుడే ఒక నిర్దిష్ట నిర్ణయానికి రావడం సరికాద‌ని నిపుణులు చెబుతున్నారు.

క్రిప్టో చరిత్రలోనే అతిపెద్ద హ్యాకింగ్ ఘటన..

ఈ ఘటనలో చోరీకి గురైన మొత్తం నిజంగా బిలియన్ల డాలర్లకు చేరితే క్రిప్టోకరెన్సీ చరిత్రలోనే అతిపెద్ద ఎక్స్ఛేంజ్ హ్యాకింగ్ ఘటనగా నిలిచే అవకాశం ఉంది. గ‌తంలోనూ ఇలాంటి హ్యాకింగ్ ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్న‌ప్ప‌టికీ భారీ ఎత్తున న‌ష్టం వాటిల్ల‌లేదు. కానీ ప్ర‌స్తుతం జ‌రిగిన దాడిని అత్యంత పెద్ద‌దిగా నిపుణులు అభివ‌ర్ణిస్తున్నారు. గ‌తంలో 2019లోనూ ఇదే బైనాన్స్ ప్లాట్‌ఫామ్‌లో హ్యాకింగ్ చోటు చేసుకోగా అప్ప‌ట్లో 7వేల బిట్‌కాయిన్ల‌ను చోరీ చేశారు. త‌రువాత 2018లో కాయిన్ చెక్ నుంచి సుమారు 530 మిలియ‌న్ డాల‌ర్ల క్రిప్టో ఆస్తులు చోరీకి గుర‌య్యాయి. 2021లో పాలీ నెట్‌వ‌ర్క్ నుంచి సుమారు 610 మిలియ‌న్లు, 2022లో రోనిన్ నెట్‌వ‌ర్క్ నుంచి సుమారు 620 మిలియ‌న్ డాల‌ర్లు, 2025లో బైబిట్ నుంచి సుమారు 1.5 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన క్రిప్టో క‌రెన్సీల‌ను చోరీ చేశారు. ప్ర‌స్తుత ఘ‌ట‌న‌లో విలువ ఇంకా నిర్దార‌ణ జ‌ర‌గ‌క‌పోయినా న‌ష్టం భారీ ఎత్తునే ఉంటుంద‌ని, గ‌త చోరీల‌ను ఇది మించిపోయింద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. దీంతో క్రిప్టో చ‌రిత్ర‌లోనే అతి పెద్ద హ్యాకింగ్ ఘ‌ట‌న‌గా ఇది నిలుస్తుంద‌ని పేర్కొంటున్నారు. అయితే బైబిట్‌పై ఉత్త‌ర కొరియాకు చెందిన హ్యాక‌ర్లు దాడుల‌కు పాల్ప‌డిన‌ట్లుగా గ‌తంలో ఎఫ్‌బీఐ పేర్కొంది. కానీ ప్ర‌స్తుత ఘ‌ట‌న‌న‌కు బాధ్యులు ఎవ‌ర‌న్న విష‌యం ఇంకా నిర్దార‌ణ కాలేదు.

భారీగా ప‌త‌న‌మైన క్రిప్టో క‌రెన్సీలు..

బైనాన్ప్‌పై హ్యాకింగ్ వార్త‌ల నేప‌థ్యంలో క్రిప్టో మార్కెట్ల‌లో అల‌జ‌డి మొద‌లైంది. అన్ని క్రిప్టో క‌రెన్సీలు భారీగా ప‌త‌న‌మయ్యాయి. అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్ర‌కారం బిట్‌కాయిన్ ధ‌ర కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే సుమారు 3.2 శాతం ప‌డిపోయి 77,000 డాల‌ర్ల దిగువ‌కు చేరింది. గ‌త సెష‌న్‌లో బిట్‌కాయిన్ 82,000 డాల‌ర్ల గ‌రిష్ట స్థాయిని తాకింది. అనంత‌రం భారీగా క్షీణించింది. అలాగే బైనాన్స్‌కు చెందిన బీఎన్‌బీ టోకెన్ ధ‌ర కూడా భారీగా త‌గ్గింది. ది బ్లాక్ అందించిన నివేదిక ప్ర‌కారం ఒక ద‌శ‌లో బీఎన్‌బీ టోకెన్ ధ‌ర 5.5 శాతానికి పైగా క్షీణించింది. కాగా ప్ర‌పంచంలోని అది పెద్ద క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల‌లో ఒక‌టైన బైనాన్స్‌పై ఇలా జ‌ర‌గ‌డం ఇది రెండో సారి. దీంతో భ‌ద్ర‌తా స‌మ‌స్య‌ల‌పై పెట్టుబ‌డిదారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ పెట్టుబ‌డుల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతుంద‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో క్రిప్టో ఎక్స్ఛేంజీలలో వినియోగ‌దారులు పెట్టుబ‌డులు పెట్టేందుకు మ‌రోమారు ఆలోచించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

బైనాన్స్ వినియోగ‌దారులు ఆందోళ‌న చెందాలా?

వినియోగ‌దారుల నిధులు సుర‌క్షితంగానే ఉన్నాయ‌ని బైనాన్స్ చెప్పిన‌ప్ప‌టికీ వారిలో ఆందోళ‌న త‌గ్గ‌డం లేదు. క్రిప్టో ఒక డిజిట‌ల్ క‌రెన్సీ కావ‌డంతో వారు పెద్ద ఎత్తున ఆందోళ‌న చెందుతున్న‌ట్లు క్రిప్టో క‌రెన్సీల ప‌త‌నాన్ని చూస్తే స్ప‌ష్ట‌మ‌వుతోంది. క్రిప్టో క‌రెన్సీల‌ను సాధార‌ణంగా అత్యంత ప‌క‌డ్బందీ సెక్యూరిటీతో నిల్వ చేస్తారు. అందుకు ప్ర‌త్యేక ప్రైవేట్ కీస్‌, ఎన్‌క్రిప్టెడ్ పాస్‌వ‌ర్డ్‌లు, లాక్‌లు, భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌లు ఉంటాయి. అందువ‌ల్ల ఒక హాట్ వాలెట్‌లో ఉండే క్రిప్టో క‌రెన్సీని చోరీ చేయ‌డం అంత ఆషామాషీ కాదు. కానీ భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌ల్లో లోపాలు ఏర్ప‌డ‌డం, ప్రైవేట్ కీస్ లేదా పాస్‌వ‌ర్డ్‌లు త‌స్క‌ర‌ణ‌కు గురి కావ‌డం, క్రిప్టో ఎక్స్ఛేంజీ ప్లాట్‌ఫామ్‌ల‌లో ఉండే సెక్యూరిటీ స‌మ‌స్య‌ల‌తో హాట్ వాలెట్లు కూడా ప్ర‌భావితం అయ్యే అవ‌కాశాలు ఉంటాయి. కానీ ఇది అత్యంత అరుదుగా జ‌రిగే విష‌యం. అందువ‌ల్ల పెట్టుబ‌డిదారులు న‌మ్మ‌కంగానే క్రిప్టోల‌ను కొనుగోలు చేస్తుంటారు. కానీ ప్ర‌స్తుతం జ‌రిగిన ఘ‌ట‌న‌తో వారు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. ఇక‌పై క్రిప్టోల్లో పెట్టుబ‌డులు పెట్టాలంటేనే జంకే ప‌రిస్థితి నెలకొంది.

వినియోగ‌దారుల‌కు బైనాన్స్ సూచ‌న‌లు..

బైనాన్స్ అధికారిక ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. త‌మ భ‌ద్ర‌తా బృందాలు సంబంధిత స‌మాచారాన్ని ప‌రిశీలిస్తున్నాయ‌ని చెప్పారు. ధ్రువీక‌రించిన వివ‌రాల‌ను అధికారిక మార్గాల ద్వారా వెల్ల‌డిస్తామ‌ని సంస్థ తెలిపింది. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో వినియోగదారులు కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించింది. బైనాన్స్ పేరుతో వ‌చ్చే అనుమానాస్ప‌ద లింకుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ క్లిక్ చేయ‌వ‌ద్ద‌ని, ఓటీపీలు, పాస్‌వ‌ర్డ్‌లు లేదా ఏపీఐ కీల‌ను ఎవ‌రికీ ఇవ్వొద్ద‌ని, టెలిగ్రాం, వాట్సాప్ ద్వారా వ‌చ్చే న‌కిలీ బైనాన్స్ స‌పోర్ట్ సందేశాల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరింది. అలాగే అధికారిక బైనాన్స్ వెబ్‌సైట్‌, యాప్‌లో మాత్ర‌మే ఖాతా స‌మాచారాన్ని ప‌రిశీలించాల‌ని, టూ ఫ్యాక్ట‌ర్ ఆథెంటికేష‌న్ (2ఎఫ్ఏ) స‌దుపాయాన్ని ఉప‌యోగించాల‌ని, అన‌ధికారికంగా వ‌చ్చే ఫండ్ రిక‌వ‌రీ సేవ‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని తెలిపింది.

క్రిప్టో మార్కెట్‌లో తీవ్ర చ‌ర్చ‌..

కాగా బైనాన్స్‌పై వెలుగులోకి వ‌చ్చిన ఈ భ‌ద్ర‌తా ఘ‌ట‌న ప్ర‌పంచ క్రిప్టో క‌రెన్సీ మార్కెట్‌లో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. బిలియ‌న్ డాల‌ర్ల విలువైన అనుమానాస్ప‌ద లావాదేవీలు, టెథ‌ర్‌, స‌ర్కిల్ తీసుకున్న ఫ్రీజింగ్ చ‌ర్య‌లు, బైనాన్స్ విత్‌డ్రాయ‌ల్స్‌పై విధించిన తాత్కాలిక ఆంక్ష‌లు ఈ ఘ‌ట‌న తీవ్ర‌త‌ను స్ప‌ష్టం చేస్తున్నాయి. అయితే అనుమానాస్ప‌దంగా బ‌దిలీ అయిన మొత్తం, వాస్తవంగా చోరీకి గురైన మొత్తం ఒక‌టే కాద‌ని, త‌మ సంస్థ ఈ విష‌యంపై లోతుగా ద‌ర్యాప్తు చేస్తుంద‌ని, న‌ష్టం మొత్తాన్ని అంచనా వేస్తామ‌ని తెలిపింది. పెట్టుబ‌డిదారుల నిధులు సుర‌క్షిత‌మేన‌ని, దీన్ని పూర్తిస్థాయి హ్యాకింగ్‌గా ఇంకా నిర్దారించ‌లేమ‌ని, కానీ అనుమానాస్ప‌ద లావాదేవీలు జ‌రిగిన మాట వాస్త‌వ‌మేన‌ని స్ప‌ష్టం చేసింది. కాగా వినియోగదారుల నిధుల భద్రతపై సంస్థ ఇచ్చిన హామీ, దర్యాప్తు ఫలితాలు, ఫ్రీజ్ చేసిన నిధుల రికవరీ ఈ ఘటనలో కీలకంగా మారనున్నాయి.

Advertisement
Advertisement