త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Silver Import Restrictions India | వెండి దిగుమతులపై కేంద్రం సంచలన నిర్ణయం: ‘ఫ్రీ’ నుంచి ‘రెస్ట్రిక్టెడ్’ జాబితాలోకి.. పెరిగిన కస్టమ్స్ డ్యూటీ!

దేశంలోకి వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆంక్షలు విధించింది. 99.9% స్వచ్ఛత ఉన్న వెండిని విదేశాల నుంచి తెచ్చుకోవాలంటే ఇకపై 'పర్మిట్' తప్పనిసరి.

J

Business | Published On May 16, 2026, 10.30 pm IST

Silver Import Restrictions India | వెండి దిగుమతులపై కేంద్రం సంచలన నిర్ణయం: ‘ఫ్రీ’ నుంచి ‘రెస్ట్రిక్టెడ్’ జాబితాలోకి.. పెరిగిన కస్టమ్స్ డ్యూటీ!
Advertisement
  • పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో వెండి దిగుమతులపై కేంద్రం కఠిన ఆంక్షలు
  • 99.9 శాతం స్వచ్ఛత ఉన్న వెండి బార్లను 'ఫ్రీ' (Free) కేటగిరీ నుంచి 'రెస్ట్రిక్టెడ్' (Restricted) జాబితాలోకి మార్పు
  • విదేశీ మారక ద్రవ్య వ్యయాన్ని తగ్గించుకునేందుకు బంగారం, వెండిపై దిగుమతి సుంకం 6% నుంచి 15 శాతానికి అమాంతం పెంపు
  • ట్యాక్స్ లేకుండా బంగారం తెచ్చుకునే 'అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్' కింద కూడా 100 కిలోల గరిష్ట పరిమితి విధింపు

Silver Import Restrictions India | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమ ఆసియాలో (West Asia) కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో అనవసర విదేశీ మారక ద్రవ్య వ్యయాన్ని (Foreign Exchange Expenditure) తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా కొన్ని రకాల వెండి బార్ల (Silver bars) దిగుమతులపై తక్షణమే ఆంక్షలు విధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) సంచలన నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇకపై పర్మిట్ తప్పనిసరి

వాణిజ్య మంత్రిత్వ శాఖ (Commerce Ministry) సవరించిన తాజా పాలసీ ప్రకారం.. 99.9 శాతం స్వచ్ఛత (99.9% purity) ఉన్న వెండి బార్లను దిగుమతి విధానంలోని "ఫ్రీ" (Free) కేటగిరీ నుంచి తొలగించి, "రెస్ట్రిక్టెడ్" (Restricted) కేటగిరీలోకి మార్చారు. అంటే ఇకపై వీటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేదా పర్మిట్ (Permit) తీసుకోవడం తప్పనిసరి. దేశంలోకి వస్తున్న వెండి దిగుమతులను పర్యవేక్షించడం, వాటిని మరింత పకడ్బందీగా నియంత్రించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కొత్త రూల్స్ తక్షణమే అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

బంగారం దిగుమతులపైనా ఆంక్షలు

కేవలం వెండిపైనే కాదు, బంగారం దిగుమతులపైనా (Gold imports) కేంద్రం ఆంక్షలు కఠినతరం చేసింది. జ్యువెలరీ ఎగుమతిదారులు ఎలాంటి పన్ను లేకుండా ముడిసరుకును దిగుమతి చేసుకునే 'అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్' (Advance Authorisation Scheme) నిబంధనలను కూడా మార్చింది. గతంలో ఈ స్కీమ్ కింద ఎంతైనా బంగారం తెచ్చుకునే అవకాశం ఉండగా, ఇప్పుడు దానికి 100 కిలోల గరిష్ట పరిమితిని విధించింది. అలాగే ఈ పర్మిట్ల జారీ, పర్యవేక్షణకు సంబంధించిన నిబంధనలను కూడా ప్రభుత్వం మరింత టైట్ చేసింది.

అమాంతం పెరిగిన 'ఇంపోర్ట్ డ్యూటీ'

విదేశాల నుంచి వచ్చే అనవసరపు కొనుగోళ్లను తగ్గించి, భారీగా పెరుగుతున్న దిగుమతి బిల్లులకు బ్రేక్ వేసేందుకు కస్టమ్స్ డ్యూటీని (Import duty) ప్రభుత్వం అమాంతం పెంచేసింది. మే 13 నుంచి అమల్లోకి వచ్చేలా బంగారం, వెండిపై ఉన్న 6 శాతం దిగుమతి సుంకాన్ని ఏకంగా 15 శాతానికి పెంచింది. అలాగే ప్లాటినం (Platinum) పై ఉన్న 6.4 శాతం సుంకాన్ని 15.4 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. వీటికి అనుగుణంగా గోల్డ్/సిల్వర్ కాయిన్స్ (Coins), ఇతర వస్తువులపైనా పన్నుల్లో మార్పులు చేసింది.

అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని, ముఖ్యంగా బంగారం కొనుగోళ్లపై నియంత్రణ పాటించాలని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన చేసిన ఈ ప్రకటన వెలువడిన కొద్ది రోజులకే ఈ కఠిన నిర్ణయాలు, ఆంక్షలు అమల్లోకి రావడం గమనార్హం.

Advertisement
Advertisement