త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Passport Mela | తెలంగాణలో ప్రత్యేక పాస్‌పోర్ట్ మేళా.. ఒక్కరోజే 3,300 మందికి సేవలు

Passport Mela | పాస్‌పోర్ట్‌ కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రజలకు ఊరట లభించింది. దరఖాస్తుదారుల రద్దీ, అపాయింట్‌మెంట్ల నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయం (ఆర్‌పీవో) రాష్ట్రవ్యాప్తంగా శనివారం ప్రత్యేక పాస్‌పోర్ట్‌ మేళా నిర్వహించింది.

P

Telangana | Published On Nov 21, 2026, 9.43 pm IST

Passport Mela | తెలంగాణలో ప్రత్యేక పాస్‌పోర్ట్ మేళా.. ఒక్కరోజే 3,300 మందికి సేవలు
Advertisement

Passport Mela | పాస్‌పోర్ట్‌ కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రజలకు ఊరట లభించింది. దరఖాస్తుదారుల రద్దీ, అపాయింట్‌మెంట్ల నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయం (ఆర్‌పీవో) రాష్ట్రవ్యాప్తంగా శనివారం ప్రత్యేక పాస్‌పోర్ట్‌ మేళా నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా ఒక్కరోజులోనే సుమారు 3,300 మంది దరఖాస్తుదారులు పాస్‌పోర్ట్‌, ఇతర సంబంధిత సేవలు పొందారు.

రాష్ట్రంలోని ఐదు పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలతో పాటు అన్ని పోస్టాఫీస్‌ పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల్లో ఈ మేళా నిర్వహించారు. సాధారణ పాస్‌పోర్ట్‌, తత్కాల్‌ పాస్‌పోర్ట్‌, పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ (పీసీసీ) కోసం ప్రత్యేక అపాయింట్‌మెంట్లు కేటాయించారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా వారాంతంలో అదనపు స్లాట్లు అందుబాటులోకి తీసుకురావడంతో దరఖాస్తుదారులకు త్వరితగతిన సేవలు అందాయి.

పాస్‌పోర్ట్‌ దరఖాస్తుల పరిశీలన, బయోమెట్రిక్‌ నమోదు తదితర ప్రక్రియలను సులభతరం చేయడంలో ఈ మేళా దోహదపడింది. ప్రజలకు పారదర్శకంగా, వేగంగా, సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు హైదరాబాద్‌ ఆర్‌పీవో కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు. ప్రత్యేక మేళాలతో పాటు సాధారణ అపాయింట్‌మెంట్ల ద్వారా కూడా పాస్‌పోర్ట్‌, పీసీసీ సేవలు పొందవచ్చని సూచించారు. పాస్‌పోర్ట్‌ సేవలు పొందాలనుకునే వారు అధికారిక వెబ్‌సైట్‌ www.passportindia.gov.in లేదంటే ఎం-పాస్‌పోర్ట్‌ సేవా మొబైల్‌ యాప్‌ ద్వారా అపాయింట్‌మెంట్లు బుక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Advertisement
Advertisement