KTR | మూడు తరాలను ముంచిందే కాంగ్రెస్సని సార్ చెప్పేవారు.. అందుకే ఎట్టికైనా, మట్టికైనా మనోడే ఉండాలనేవారు
KTR | మూడు తరాలను ముంచిందే ఈ కాంగ్రెస్ పార్టీ అని దివంగత జయశంకర్ సార్ చెప్పేవారని.. అందుకే ఎట్టికైనా, మట్టికైనా మనోడే ఉండాలనేవారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. ఢిల్లీ చెప్పినట్టు తలాడించేవాడు మనకు వద్దనేవారని పేర్కొన్నారు.
- తెలంగాణను మళ్లీ కేసీఆర్ చేతిలో పెడుతం
- అదే మనం జయశంకర్ సారుకు ఇచ్చే నిజమైన నివాళి
- జయశంకర్ సార్ జయంతి సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
KTR | త్రినేత్ర.న్యూస్: మూడు తరాలను ముంచిందే ఈ కాంగ్రెస్ పార్టీ అని దివంగత జయశంకర్ సార్ చెప్పేవారని.. అందుకే ఎట్టికైనా, మట్టికైనా మనోడే ఉండాలనేవారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. ఢిల్లీ చెప్పినట్టు తలాడించేవాడు మనకు వద్దనేవారని పేర్కొన్నారు. సార్ జయంతి సందర్భంగా గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన కేటీఆర్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
జయశంకర్ సార్ గురించి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. కేసీఆర్‌ను ఎట్లయితే మనం జాతిపితగా భావిస్తున్నమో ఆనాడు తనకు గాడ్ ఫాదర్‌గా జయశంకర్‌ను చూసుకున్నరు కేసీఆర్. పదేండ్లు జయశంకర్ సారుతో పనిచేసిన అదృష్టం నాకు కలిగింది. చివరి దశ వరకు వారితో ఎన్నో గంటలు గడిపే అవకాశం దక్కింది. జయశంకర్ సార్ ఒక ఎన్ సైక్లోపీడియా.. ఆయన టీచర్.. ఏం అడిగినా ఓపిగ్గా చెప్పేవారు. ఉమ్మడి ఏపీలో పాలమూరు జిల్లా దగా పడింది. ప్రతీ మనిషికి స్వయం సమృద్ధి అనేది ముఖ్యం. జీవన పరిణామ క్రమంలో తర్వాత వచ్చేది ఆత్మగౌరవం. మూడో దశ.. సెల్ఫ్ రూల్, స్వయం పాలన. ఈ మూడు దశల్లో కరీంనగర్ లాంటి జిల్లాలు ముందుండేవి. పాలమూరు ఇంకా స్వయం సమృద్ధి కోసమే తండ్లాదేది. ఆకలి కేకల పాలమూరు అందుకే పోరాటంలో వెనక ఉందని చెప్పారు అని కేటీఆర్ గుర్తు చేశారు.

ఉద్యమానికి మూడు పార్శ్వాలు ఉంటాయని చెప్పారు..
2006, 2008లో రాజీనామాలతో ఉప ఎన్నికలు వచ్చాయి. మళ్లీ మళ్లీ ఎందుకు రాజీనామాలు చేయాలని సారును అడిగిన. అప్పుడు జయశంకర్ గొప్ప మాట చెప్పారు. ఉద్యమానికి మూడు పార్శ్వాలు ఉంటాయని చెప్పారు. మొదటి పార్శ్వం భావజాల వ్యాప్తి అని చెప్పారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై చర్చ జరుగుతూ ఉండాలి. రెండో పార్శ్వం ఆందోళనాపథం. అన్యాయం జరుగుతున్నప్పుడు ఆందోళనలు చేయాలని చెప్పారు.
మూడో పార్శ్వం డెమోక్రటైజేషన్. ఆందోళనను రాజకీయ శక్తిగా మలచడమే డెమోక్రటైజేషన్ అని అన్నారు.
రేవంత్ ఢిల్లీ వెళ్లి యాచిస్తడు..
యాచించి కాదు, శాసించి తెలంగాణ తెచ్చుకోవాలని చెప్పేవారు. జయశంకర్ సార్ కేసీఆర్‌కు నూతన పంథాను నూరిపోశారు. ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ 75వ సారి ఢిల్లీ పోయిండు. 32 నెలల్లో 75 సార్లు ఢిల్లీకి పోయాడు. 13 రోజులకోసారి ఢిల్లీ వెళ్లి.. దేహీ అని యాచిస్తడు. యాచిస్తున్నడో.. వాళ్లకు ఇచ్చి వస్తున్నడో గానీ.. మొత్తానికి పోతున్నడు. ఢిల్లీ ముందు యాచించి, గులాంగిరీ చేస్తున్నడు రేవంత్. ఢిల్లీకి సామంతులు ఉండొద్దు, స్వతంత్రులు ఉండాలని జయశంకర్ చెప్పారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని చెప్పేవారు. ఎలాంటి రాజీ లేకుండా కేసీఆర్‌లా గర్జించాలని చెప్పేవారు.
తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్..
నీళ్లలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై హరీశ్ రావు ప్రెస్ మీట్ పెట్టారు. ఎట్ల అన్యాయం జరుగుతున్నదో ప్రజలకు వివరించారు. తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టులు రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం. జీఆర్ఎంబీని ఎట్ల ఆడిస్తున్నదో హరీశ్ రావు వివరించారు. ఢిల్లీ పార్టీల చేతుల్లో తెలంగాణ మళ్లీ తల్లడిల్లుతున్నది. తెలంగాణ కోసమే పుట్టిన నిఖార్సయిన పార్టీ బీఆర్ఎస్. ప్రాణాలు పణంగా పెట్టడానికి సైతం వెనకాడని నాయకుడు కావాలి. ఒక బీజేపీ ఎంపీ పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్‌తో పోల్చిండు. ఒక్క బీజేపీ ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ అయినా మాట్లాడిండా? అదే మనోడు సభలో ఉంటే.. గల్లా పట్టి నిలదీయకపోవునా? ఇంత సాధించుకుని తిరిగి మళ్లీ ఢిల్లీకి సామంతులుగా మారిన పరిస్థితి ఉంది.
ఆనాటి ఫొటో ఇవాళ పోస్ట్ చేసిన..
2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ ఆమరణ దీక్షకు బయల్దేరిండు. కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని తెగించి అడుగులేసిండు. తెలంగాణ సమాజమంతా బరిగీసి నిలబడింది. ఆ రోజు కేసీఆర్ వెంట జయశంకర్ సార్, కెప్టెన్ లక్ష్మీకాంత రావు, నాయిని నర్సింహారెడ్డి అందరూ కలిసి పోతున్నారు. అల్గనూరు చౌరస్తా దగ్గర మా కార్లను పోలీసులు ఆపారు. మేం వచ్చేలోగానే కేసీఆర్‌ను అరెస్ట్ చేసి వరంగల్ తీసుకెళ్లారు. సారును వెంటబెట్టుకుని మేం హన్మకొండ పోయినం. అప్పటికే మా విద్యార్థి నాయకులు అక్కడ ధర్నాకు దిగారు. సారును పంపి, నేను ధర్నాలో కూర్చున్నా. కొద్దిసేపటికే మమ్మల్ని అరెస్ట్ చేసి వ్యాన్లో ఎక్కించారు. మేం పోలీసు వాహనాల్లోంచి దుంకి.. జయశంకర్ సారు ఇంటికి పోయినం. ఆ సందర్భంలో దిగిన ఫొటోను ఇవాళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన. అది నాకు ఒక భావోద్వేగ సందర్భం.
ఉద్యమం భాస్వరం లెక్క మండుద్దని సారు ఆనాడు ధైర్యం చెప్పారు. ఎందుకు తెలంగాణ రాదో చూస్తమని మాకు ధైర్యం చెప్పారు. ఉద్యమం భగ్గునమండి శ్రీకాంతచారి లాంటి ఎందరో ప్రాణత్యాగం చేశారు. వరుస సంఘటనలతో రాజ్యం మొత్తం ఉలికిపడింది. ఢిల్లీలో ఇంగ్లీష్ జర్నలిస్టులు అనేక ప్రశ్నలు అడిగేవారు. జయశంకర్ సారు వారికి చక్కగా జవాబు చెప్పేవారు. "We are not fighting for a new State... We are fighting to restore a State" అనేవారు. ఒక ధనిక రాష్ట్రంగా తెలంగాణను పునరుద్ధరించుకుంటామని చెప్పేవారు. 1948-56 వరకు తెలంగాణ హైదరాబాద్ స్టేట్ రూపంలో ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న విషయం ఢిల్లీ జర్నలిస్టులకు తెలియదు. హైదరాబాద్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగానే ఉంచాలని ఫజల్ అలీ కమిషన్ రిపోర్టు ఇచ్చిన సంగతిని కూడా జయశంకర్ సారు వివరించేవారు. ఇన్ని చెప్పినా.. ఢిల్లీ జర్నలిస్టులకు, నేతలకు అర్థమయ్యేది కాదు.
డాక్యుమెంటేషన్‌తో సహా జయశంకర్ సారు వివరించేవారు. ఏ కారణంతో ఆంధ్రా-తెలంగాణను కలిపారో చక్కగా చెప్పేవారు. కమ్యూనిస్టుల ప్రభావం పెరగొద్దని కాంగ్రెస్ కక్షగట్టింది. అందుకే ఆంధ్రా తెలంగాణను కలిపారని జయశంకర్ సారు చెప్పేవారు. చెన్నారెడ్డి తప్పేం లేదని సారు మాకు చెప్పేవారు. వాస్తవానికి చెన్నారెడ్డి ఆలస్యంగా ఉద్యమంలోకి వచ్చారని చెప్పారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని తొక్కేసింది. మనోళ్లను చిన్నగ చేయనివ్వొద్దని జయశంకర్ తపనపడేవారు. కేసీఆర్‌ను మించిన దక్షత, కమిట్‌మెంట్, పోరాట పటిమ ఎవరిలో ఉందో చూపెట్టాలని సారు అనేవారు. కేసీఆర్‌తోనే తెలంగాణ సాధ్యమని బలంగా నమ్మేవారు.
సార్ తిరిగొచ్చి ఈ సన్నాసులకు ట్యూషన్ చెప్తే బాగుండు..
చాలా మంది పార్టీలు పెట్టినా నిలువలేదు. తెలంగాణ మిగులు రాష్ట్రమని ఆర్థికవేత్త బీపీఆర్ విఠల్ 1969, 2001లో కేస్ స్టడీ రాశారు. నీళ్లు, నిధులు పుష్కలంగా ఉన్న రాష్ట్రం మనది. నీళ్లున్నా ముఖ్యమంత్రి పంపులు ఆన్ చెయ్యడు. మనకేమో గురువు జయశంకర్, ఆయనకేమో గురువు పక్క రాష్ట్ర సీఎం. కనీసం జై తెలంగాణ అనడానికి కూడా ఈ ముఖ్యమంత్రికి మనసొప్పదు. అలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో తెలంగాణ ఉంది. నిధులు మొత్తం ఢిల్లీకి ఇచ్చి వస్తున్నడు. 75 సార్లు ఢిల్లీకి వెళ్లి తెలంగాణకు తెచ్చిందేముంది? జయశంకర్ సారు తిరిగివచ్చి ఇలాంటి సన్నాసులకు పాఠాలు చెప్తే బాగుండు.
అప్పులపై కాంగ్రెస్ నాయకుల తప్పుడు లెక్కలు. ఆర్బీఐ చెప్పినా వారికి చెవికెక్కడం లేదు. ఇలాంటి సన్నాసులకు జయశంకర్ సార్ ట్యూషన్ చెప్తే బాగుండేది. జీవితంలో జై తెలంగాణ అనని జైపాల్ రెడ్డి మేధావా? కేశవరావు మేధావి అని రేవంత్ అంటున్నడు. మావొళ్ల పేర్లంటే చెప్పకపోతివి.. నీ పక్కకున్న కోదండరాం పేరు కూడా చెప్పవా? ఉద్యోగాల కోసం పిల్లలు కొట్లాడుతుంటే ప్రభుత్వానికి పట్టదు. మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ఆశ పెట్టారు. రేవంత్, రాహుల్ గాంధీ చెప్పాలి.. ఎందుకిస్తలేరు ఉద్యోగాలు? మీ అన్యాయాలను జయశంకర్ సార్ చూస్తున్నరు. దేశమంతా వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్. తెలంగాణకు శాశ్వత శత్రువు కాంగ్రెస్ అని జయశంకర్ చెప్పేవారు. మూడు తరాలను ముంచిన పార్టీ కాంగ్రెస్ అని పదేపదే చెప్పేది. జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం పనిచేస్తం. తెలంగాణను మళ్లీ కేసీఆర్ చేతిలో పెడుతం. అదే మనం జయశంకర్ సారుకు ఇచ్చే నిజమైన నివాళి అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Khammam | గోపాలపురం పాఠశాల గదుల నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు
- ●LPG | ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంపు..? కేంద్రం కొత్త ప్లాన్‌తో వినియోగదారులపై భారం..?
- ●HJHSJAC | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియను పూర్తి చేయండి
- ●URBN | ఒకేసారి 6 డివైస్‌లకు ఫాస్ట్ ఛార్జింగ్.. యూఆర్బీఎన్ 200 వాట్ల గ్యాన్ పవర్ హబ్ లాంచ్..
- ●స్ట్రాంగ్ విస్కీ వర్సెస్ వార్మ్ బ్రాందీ: మీ సోల్ మేట్ ఏది? ఈ రెండింటి అసలు తేడా ఇదే!
- ●FGG | ఉపాధ్యాయ సంఘాలను తగ్గించండి.. సీఎంకు ఎఫ్‌జీజీ విజ్ఞప్తి

Khammam | గోపాలపురం పాఠశాల గదుల నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు

LPG | ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంపు..? కేంద్రం కొత్త ప్లాన్‌తో వినియోగదారులపై భారం..?

HJHSJAC | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియను పూర్తి చేయండి

URBN | ఒకేసారి 6 డివైస్‌లకు ఫాస్ట్ ఛార్జింగ్.. యూఆర్బీఎన్ 200 వాట్ల గ్యాన్ పవర్ హబ్ లాంచ్..




