త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalvakuntla Kavitha New Party | ఢిల్లీ హైకోర్టులో కవితకు భారీ షాక్.. ‘టీఆర్ఎస్’ పార్టీకి బ్రేక్

కొత్త పార్టీ పేరు విషయంలో న్యాయపోరాటానికి దిగిన కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఈసీ నోటీసుల వ్యవహారంపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

J

Telangana | Published On Jul 7, 2026, 7.20 pm IST

Kalvakuntla Kavitha New Party | ఢిల్లీ హైకోర్టులో కవితకు భారీ షాక్.. ‘టీఆర్ఎస్’ పార్టీకి బ్రేక్
Advertisement
  • 'తెలంగాణ రక్షణ సమితి' (టీఆర్ఎస్) పేరు వివాదంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవితకు నిరాశ
  • ఈసీ విధుల్లో తాము జోక్యం చేసుకోలేమని, ముందు వాళ్ల నోటీసులకు లీగల్‌గా సమాధానం ఇవ్వాలని కోర్టు సూచన
  • పాత 'టీఆర్ఎస్' పేరును పోలి ఉందంటూ కవిత దరఖాస్తును తిరస్కరించి, ప్రత్యామ్నాయ పేర్లు అడిగిన ఎన్నికల సంఘం
  • వేరే పేర్లు ఇచ్చే ప్రసక్తే లేదని, పార్టీ పేరు కోసం న్యాయపోరాటం చేస్తానన్న కవిత

Kalvakuntla Kavitha New Party | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ స్థాపనతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిన కల్వకుంట్ల కవితకు న్యాయస్థానంలో తొలి ఎదురుదెబ్బ తగిలింది. తన కొత్త పార్టీకి 'తెలంగాణ రక్షణ సమితి' (TRS) అనే పేరును కేటాయించాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఎన్నికల సంఘం (Election Commission) విధుల్లో తాము తలదూర్చలేమని తేల్చిచెప్పింది.

ముందు ఈసీకి సమాధానం చెప్పండి

ఎన్నికల సంఘం లేవనెత్తిన అభ్యంతరాలకు సరైన రీతిలో, లీగల్‌గా సమాధానం ఇచ్చిన తర్వాతే కోర్టుకు రావాలని హైకోర్టు ధర్మాసనం కవితకు సూచించింది. కవిత ప్రతిపాదించిన పేరు పాత పార్టీ (తెలంగాణ రాష్ట్ర సమితి) కి దగ్గరగా ఉందంటూ ఈసీ (EC) వ్యక్తం చేసిన అభ్యంతరాల్లో హేతుబద్ధత ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఈసీ ఒక తుది నిర్ణయం తీసుకోకముందే కోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తే.. అది నేరుగా రాజ్యాంగ సంస్థ అధికారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని స్పష్టం చేసింది. వివాదాన్ని ముందు ఈసీ పరిధిలోనే తేల్చుకోవాలని దిశానిర్దేశం చేసింది.

అసలేంటి ఈ వివాదం?

తన కొత్త పార్టీ పేరు 'తెలంగాణ రక్షణ సమితి' లేదా 'తెలంగాణ రక్షణ సేన' గా రిజిస్ట్రేషన్ (Registration) చేయాలని కోరుతూ కవిత గతంలో కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఈ పేరు బీఆర్ఎస్ పాత పేరైన 'టీఆర్ఎస్'ను పోలి ఉందంటూ, అదే అర్థం వచ్చేలా ఉందంటూ ఈసీ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు జూన్ 23న కవితకు ఒక లేఖ రాస్తూ.. 15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయ (Alternative) పేర్లు సూచించాలని, లేదంటే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అప్లికేషన్ రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.

వెనక్కి తగ్గేదే లేదన్న కవిత

ఈసీ నిర్ణయంపై కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త పేర్లు ఇచ్చే ప్రసక్తే లేదని, 'తెలంగాణ రక్షణ సమితి' పేరు దక్కించుకునేందుకు ఎంతటి న్యాయపోరాటానికైనా (Legal fight) సిద్ధమని ఆమె ప్రకటించారు. అందులో భాగంగానే తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, కోర్టు సైతం ఈసీ అభ్యంతరాలను సమర్థించి, కవిత పిటిషన్‌ను తోసిపుచ్చడంతో.. ఆమె తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement