త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

WhatsApp | ఇక వాట్సాప్‌లో ఫోన్ నంబ‌ర్ లేకుండానే చాట్‌.. యూజ‌ర్‌నేమ్ ఫీచ‌ర్ వ‌స్తోంది..

WhatsApp | ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ త‌న యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక‌పై యూజ‌ర్లు ఫోన్ నంబ‌ర్‌తో ప‌నిలేకుండా కేవ‌లం యూజ‌ర్‌నేమ్‌ల‌ను ఉప‌యోగించి సంభాష‌ణ‌ల‌ను కొన‌సాగించ‌వ‌చ్చు. యూజ‌ర్లకు మ‌రింత మెరుగైన ప్రైవ‌సీని అందించ‌డంతోపాటు స్పామ్‌, స్కామ్‌ల‌ను అరిక‌ట్టేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వాట్సాప్ వెల్ల‌డించింది.

S

Technology | Published On Jun 30, 2026, 10.27 am IST

WhatsApp | ఇక వాట్సాప్‌లో ఫోన్ నంబ‌ర్ లేకుండానే చాట్‌.. యూజ‌ర్‌నేమ్ ఫీచ‌ర్ వ‌స్తోంది..
Advertisement

WhatsApp | ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ త‌న యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక‌పై యూజ‌ర్లు ఫోన్ నంబ‌ర్‌తో ప‌నిలేకుండా కేవ‌లం యూజ‌ర్‌నేమ్‌ల‌ను ఉప‌యోగించి సంభాష‌ణ‌ల‌ను కొన‌సాగించ‌వ‌చ్చు. యూజ‌ర్లకు మ‌రింత మెరుగైన ప్రైవ‌సీని అందించ‌డంతోపాటు స్పామ్‌, స్కామ్‌ల‌ను అరిక‌ట్టేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వాట్సాప్ వెల్ల‌డించింది. యూజ‌ర్లు ప్ర‌స్తుతం త‌మ వాట్సాప్‌ను కొత్త వెర్ష‌న్‌కు అప్‌డేట్ చేసుకుని అందులో క‌నిపించే యూజ‌ర్‌నేమ్ రిజ‌ర్వేష‌న్ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు. అయితే యూజ‌ర్‌నేమ్‌ను ప్ర‌స్తుతం రిజ‌ర్వ్ చేసుకుంటానికి మాత్ర‌మే అవ‌కాశం కల్పించారు. అంటే యూజ‌ర్లు త‌మ‌కు కావ‌ల్సిన యూజ‌ర్‌నేమ్‌ను ముందుగానే రిజ‌ర్వ్ చేసుకోవ‌చ్చ‌న్న‌మాట‌. ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చిన వెంట‌నే ఆ యూజ‌ర్ నేమ్‌ను ఉప‌యోగించుకునే అవ‌కాశం ఉంటుంది. అయితే ఇది ప్రపంచ వ్యాప్తంగా యూజ‌ర్లంద‌రికీ ద‌శ‌ల‌వారీగా అందుబాటులోకి వ‌స్తుంద‌ని వాట్సాప్ వెల్ల‌డించింది.

ఫోన్ నంబ‌ర్‌ను ఇవ్వ‌న‌క్క‌ర్లేదు..

యూజ‌ర్‌నేమ్ ఫీచ‌ర్ ద్వారా యూజ‌ర్లు త‌మ ఫోన్ నంబ‌ర్‌ను ఇత‌రుల‌కు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. కేవ‌లం యూజ‌ర్ నేమ్ ఇస్తే స‌రిపోతుంది. దాంతో చాటింగ్ కొన‌సాగించ‌వ‌చ్చు. అలాగే ఫోన్ నంబ‌ర్‌ను సేవ్ చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. కేవ‌లం యూజ‌ర్‌నేమ్‌ను ఎంటర్ చేసి చాటింగ్ చేయ‌వ‌చ్చు. ఇక యూజ‌ర్‌నేమ్ కేవ‌లం ప‌రిచ‌యం ఉన్న వ్యక్తుల‌కు లేదా రిక్వెస్ట్ పంపితేనే ఇత‌రుల‌కు తెలుస్తుంది క‌నుక పూర్తి స్థాయిలో ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. అలాగే ఫోన్ నంబ‌ర్ తెలియ‌దు క‌నుక స్పామ్‌, స్కామ్‌ల‌కు అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చు.

సెక్యూరిటీ, ప్రైవ‌సీ కోస‌మే..

యూజ‌ర్ల గోప్య‌త‌, సెక్యూరిటీని మ‌రింత బ‌లోపేతం చేసేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వాట్సాప్ వెల్ల‌డించింది. యూజ‌ర్లు ప్లాట్‌ఫామ్‌లో త‌మ‌కు కావ‌ల్సిన యూజ‌ర్ నేమ్‌ను ఇప్పుడే రిజ‌ర్వ్ చేసుకోవ‌చ్చ‌ని, ఫీచ‌ర్ మాత్రం త్వ‌ర‌లో అందుబాటులోకి వ‌స్తుంద‌ని తెలిపింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల‌లో వెరిఫైడ్ యూజ‌ర్లు త‌మ యూజ‌ర్‌నేమ్ అదే పేరుతో వాట్సాప్‌లోనూ కావాల‌నుకుంటే ఆయా అకౌంట్లతో వాట్సాప్‌ను లింక్ చేసి అనంత‌రం యూజ‌ర్‌నేమ్‌ను రిజ‌ర్వ్ చేసుకోవ‌చ్చు. దీంతో ఒక యూజ‌ర్ ఎంచుకునే యూజ‌ర్‌నేమ్ త‌రువాత ఇత‌రుల‌కు సెట్ చేసుకోవ‌డానికి వీలు కాదు. ఇది ఒక్కో యూజ‌ర్‌కు యూనిక్‌గా ఉంటుంది క‌నుక ఒక యూజ‌ర్ నేమ్‌ను ఇద్ద‌రికి ఇవ్వ‌డం కుద‌ర‌దు. అందువ‌ల్ల యూజ‌ర్లు త‌మ‌కు కావ‌ల్సిన యూజ‌ర్‌నేమ్‌ను ఎంచుకునేందుకు ఇది మంచి స‌మ‌య‌మ‌ని వాట్సాప్ తెలిపింది.

ప‌బ్లిక్ డిస్క‌వ‌రీ ఉండ‌దు..

ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఉండే యూజర్‌నేమ్‌ల మాదిరిగా వాట్సాప్ ఈ ఫీచ‌ర్‌ను పబ్లిక్ డిస్కవరీ కోసం రూపొందించలేదు. వాట్సాప్‌లో ఎలాంటి పబ్లిక్ డైరెక్టరీ ఉండదు. అలాగే యూజర్‌నేమ్‌లకు సంబంధించిన అల్గోరిథమిక్ సజెషన్‌లను కూడా ప్లాట్‌ఫామ్ అందించదు. ఒక వ్యక్తితో యూజర్‌నేమ్ ద్వారా చాట్ ప్రారంభించాలంటే, అవతలి వ్యక్తికి ఆ యూజర్‌నేమ్ కచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత యూజర్లకు యాప్‌లోనే నోటిఫికేషన్ కనిపిస్తుంది. తాజా వెర్షన్‌లోని వాట్సాప్‌లో సెట్టింగ్స్ విభాగంలోకి వెళ్లి అకౌంట్ అనే సెక్ష‌న్‌లో ఉండే యూజర్‌నేమ్ విభాగానికి వెళ్లి యూజర్‌నేమ్‌ను రిజర్వ్ చేసుకోవచ్చు. క్రియేటర్లు, పబ్లిక్ ఫిగర్లు, వ్యాపార సంస్థలు తమ బ్రాండ్ గుర్తింపును ఒకేలా కొనసాగించేందుకు ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్‌లో ఉపయోగిస్తున్న హ్యాండిల్‌కు సరిపోయే యూజర్‌నేమ్‌ను క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా వాట్సాప్ కల్పిస్తోంది.

భ‌ద్ర‌త కోసం యూజ‌ర్‌నేమ్ కీ..

సాధారణ యూజర్ల కోసం ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ యూజర్‌నేమ్ జనరేటర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది వ్యక్తిగత వివరాలను గుర్తించలేని విధంగా ప్రత్యేకమైన యూజర్‌నేమ్‌లను సూచించడంలో సహాయపడుతుంది. భద్రతను మరింత పెంచేందుకు వాట్సాప్ యూజర్‌నేమ్ కీ అనే ఐచ్ఛిక సెక్యూరిటీ ఫీచర్‌ను కూడా ప్రవేశపెడుతోంది. ఈ ఫీచర్‌ను ఆన్ చేసిన తర్వాత, యూజర్‌నేమ్ ద్వారా మొదటిసారి సందేశం పంపాలనుకునే వ్యక్తి వద్ద ఆ ప్రత్యేక కీ ఉండాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు అకౌంట్ యజమాని ఈ కీని మార్చుకోవచ్చు లేదా రీసెట్ చేసుకోవచ్చు. దీంతో ఇన్‌బాక్స్‌పై పూర్తి నియంత్రణ యూజర్ చేతిలోనే ఉంటుంది. ఫోన్ నంబర్‌ను వెంటనే పంచుకోవాలనిపించని అనేక సామాజిక, వృత్తిపరమైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఫీచర్‌ను రూపొందించారు. ఉదాహరణకు స్కూల్ పేరెంట్ గ్రూపులు, కాలనీ లేదా పరిసరాల కార్యక్రమాల సమన్వయం, కొత్త వ్యక్తులతో పరిచయం వంటి సందర్భాల్లో యూజర్‌నేమ్ ద్వారా కమ్యూనికేషన్ మరింత సురక్షితంగా ఉంటుంది.

యూజ‌ర్‌నేమ్‌ను రిజ‌ర్వ్ చేసుకోవ‌చ్చు..

ఈ ఏడాది చివరినాటికి ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత, యూజర్‌నేమ్ ద్వారా తొలిసారి చాట్ ప్రారంభించినప్పుడు గ్రహీతకు యూజర్ ఫోన్ నంబర్ ను పూర్తిగా క‌నిపించ‌కుండా చేస్తారు. ఈ ఫీచర్‌పై అవగాహన పెంచేందుకు భారత్‌లో నటుడు ఆమిర్ ఖాన్ తో వాట్సాప్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. రోజువారీ జీవితంలో ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్‌ను పంచుకోవడం ఎంత ఉపయోగకరమో తెలియజేసే ప్రచార కార్యక్రమాలను చేపట్టనుంది. ప్రస్తుతం యూజర్‌నేమ్ రిజర్వేషన్ ప్రక్రియ ఇప్ప‌టికే ప్రారంభం కాగా వారాంతం వ‌ర‌కు యూజ‌ర్లంద‌రికీ అందుబాటులో ఉంటుంద‌ని వాట్సాప్ ప్ర‌క‌టించింది.

Advertisement
Advertisement