త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ChatGPT Work | చాట్ జీపీటీ వ‌ర్క్ మోడ‌ల్ వ‌చ్చేసింది.. ఇక గంట‌ల త‌ర‌బ‌డి ఏఐని వాడ‌వ‌చ్చు..

ChatGPT Work | ప్ర‌ముఖ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్లాట్‌ఫామ్ ఓపెన్ఏఐ త‌న ఏఐ పోర్ట్‌ఫోలియోను మ‌రింత విస్త‌రించింది. ప్రొఫెషనల్స్ కు ఎక్కువ సమయం పట్టే క్లిష్టమైన పనులను పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ఏఐ ఏజెంట్ చాట్‌జీపీటీ వర్క్ ని కంపెనీ లాంచ్ చేసింది.

S

Technology | Published On Jul 10, 2026, 2.43 pm IST

ChatGPT Work | చాట్ జీపీటీ వ‌ర్క్ మోడ‌ల్ వ‌చ్చేసింది.. ఇక గంట‌ల త‌ర‌బ‌డి ఏఐని వాడ‌వ‌చ్చు..
Advertisement

ChatGPT Work | ప్ర‌ముఖ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్లాట్‌ఫామ్ ఓపెన్ఏఐ త‌న ఏఐ పోర్ట్‌ఫోలియోను మ‌రింత విస్త‌రించింది. ప్రొఫెషనల్స్ కు ఎక్కువ సమయం పట్టే క్లిష్టమైన పనులను పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ఏఐ ఏజెంట్ చాట్‌జీపీటీ వర్క్ ని కంపెనీ లాంచ్ చేసింది. ఈ ప్లాట్‌ఫామ్ డాక్యుమెంట్లు, స్ప్రెడ్‌షీట్లు, ప్రజెంటేషన్లు, వెబ్ అప్లికేషన్లు వంటి కార్యాలయ అవసరాలకు సంబంధించిన అనేక రకాల అవుట్‌పుట్‌లను రూపొందిస్తుంది. ఈ మోడ‌ల్ ఓపెన్ఏఐకి చెందిన తాజా ఏఐ మోడ‌ల్ జీపీటీ 5.6 ఆధారంగా ప‌నిచేస్తుంది. జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనల నేపథ్యంలో ట్రంప్ పరిపాలన సమయంలో విడుదల ఆలస్యమైన తర్వాత ఈ మోడల్ తాజాగా అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. చాట్‌జీపీటీ వర్క్ యాప్‌లు, ఫైళ్లలో నేరుగా చర్యలు తీసుకుంటుంద‌ని, అవసరమైతే గంటల తరబడి ఒకే ప్రాజెక్ట్‌పై పనిచేస్తుంద‌ని సంస్థ వెల్ల‌డించింది. యూజ‌ర్ ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి స్థాయి పనిగా మార్చి అందిస్తుంద‌ని, పని చేసే విధానాన్నే మార్చే కొత్త అనుభవం ఇద‌ని ఓపెన్‌ఏఐ సంస్థ త‌న‌ ఎక్స్ ఖాతా పోస్టులో తెలిపింది.

క్లాడ్ కోవ‌ర్క్‌కు పోటీగా..

ఈ విడుదలతో ప్రొఫెషనల్ ఏఐ విభాగంలో ఓపెన్‌ఏఐ సంస్థ‌ ఆంత్రోపిక్ కంపెనీ అభివృద్ధి చేసిన క్లాడ్ కోవర్క్ కు నేరుగా పోటీ ఇస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన క్లాడ్ కోవర్క్ బహుళ దశల్లో జరిగే పనులను ఆటోమేటిగ్గా నిర్వహించే సామర్థ్యంతో గుర్తింపు పొందింది. సంస్థలు తక్కువ మానవ జోక్యంతో క్లిష్టమైన పనులు పూర్తి చేసే సాఫ్ట్‌వేర్‌లపై ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో టెక్నాలజీ సంస్థలు ఆటోమేటిక్ ఏఐ ఏజెంట్ల అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఐపీఓలకు అవకాశమున్న కంపెనీలుగా భావిస్తున్న ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్ సంస్థలు ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లను ఆకర్షించేందుకు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. వినియోగదారుల విభాగంతో పోలిస్తే ఎంటర్‌ప్రైజ్ మార్కెట్‌లో వాణిజ్య అవకాశాలు ఎంతో ఎక్కువగా ఉన్నాయని పరిశ్రమ భావిస్తోంది.

ప‌నిని అప్ప‌గించ‌డం సుల‌భం..

చాట్ జీపీటీకి పనిని అప్ప‌గించ‌డం చాలా సుల‌భ‌మ‌ని ఓపెన్ఏఐ స్ప‌ష్టం చేసింది. ఉదాహరణకు నెలాఖరు బడ్జెట్ వ్యత్యాసాల విశ్లేషణ, సోర్స్ మెటీరియల్‌ను మార్కెటింగ్ క్యాంపెయిన్ బ్రీఫ్‌గా మార్చడం లేదా సేల్స్ సమావేశానికి సిద్ధం చేయడం వంటి పనులు చేయ‌మ‌ని చెప్పొచ్చ‌ని, ఇది ఎలా పనిచేస్తుందో గమనించవచ్చ‌ని తెలిపింది. మధ్యలో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వొచ్చ‌ని, అవసరమైతే దిశను మార్చొచ్చ‌ని, కీలక చర్యలకు ఆమోదం తెలపొచ్చ‌ని ఓపెన్‌ఏఐ తన బ్లాగ్‌లో పేర్కొంది. చాట్‌జీపీటీ వర్క్‌ను ఉపయోగించాలంటే ముందుగా యూజ‌ర్ కార్యాలయంలో ఉపయోగించే అప్లికేషన్లను ప్లగిన్ల ద్వారా కనెక్ట్ చేయాలి. స్లాక్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, గూగుల్ డ్రైవ్, షేర్‌పాయింట్, ఈ-మెయిల్ ఖాతాలు, క్యాలెండర్లు, సీఎఆర్ఎం వ్యవస్థలు, ప్రాజెక్ట్ ట్రాకర్లు తదితర వ్యాపార సాధనాలను అనుసంధానం చేసుకోవచ్చు.

యూజ‌ర్ ప‌నిని అర్థం చేసుకుంటుంది..

వినియోగదారు ఇచ్చిన ప్రాంప్ట్ ఆధారంగా చాట్‌జీపీటీ సాధారణంగా అవసరమైన ప్లగిన్‌ను స్వయంగా ఎంపిక చేస్తుంది. అయితే అవసరమైతే సంబంధిత అప్లికేషన్ పేరుకు ముందు @ గుర్తును టైప్ చేసి నిర్దిష్ట సేవను ఎంచుకోవచ్చు. అన్ని ఇంటిగ్రేషన్లు ఒకే ప్లగిన్స్ డైరెక్టరీలో అందుబాటులో ఉంటాయి. సంభాషణ జరుగుతున్న సమయంలో అవసరానికి అనుగుణంగా ఉపయోగకరమైన ప్లగిన్లను కూడా చాట్‌జీపీటీ సూచిస్తుంది. సెటప్ పూర్తయిన తర్వాత కనెక్ట్ చేసిన సేవల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించడం, యూజ‌ర్ పని విధానాన్ని అర్థం చేసుకోవడం, నివేదికలు, ప్రజెంటేషన్లు తదితర కంటెంట్‌ను సిద్ధం చేయడం, యూజ‌ర్ పర్యవేక్షిస్తున్న సమయంలోనే డ్రాఫ్ట్‌లను బ్యాక్‌గ్రౌండ్‌లో మెరుగుపరుస్తూ కొనసాగించడం వంటి పనులను చాట్‌జీపీటీ వర్క్ నిర్వహిస్తుంది.

Advertisement
Advertisement