త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Special Parliament Session | నెలాఖ‌రులో పార్ల‌మెంటు ప్ర‌త్యేక స‌మావేశాలు..? మ‌ళ్లీ తెర‌పైకి డీలిమిటేష‌న్‌, మ‌హిళా బిల్లులు

Special Parliament Session | కేంద్రం (Modi government) పార్ల‌మెంటు ప్రత్యేక‌ స‌మావేశాల‌కు (Special Parliament Session) సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నెలాఖ‌రులో పార్ల‌మెంటును స‌మావేశ‌ప‌రిచే అవ‌కాశం ఉంద‌ని సంబంధిత వ‌ర్గాల ద్వారా తెలిసింది. డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌కు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లులను ప్ర‌వేశ‌పెట్టేందుకు కేంద్రం ఈ స‌మావేశాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు స‌ద‌రు వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వ‌రుస క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

D

National | Published On Oct 16, 2026, 11.58 am IST

Special Parliament Session | నెలాఖ‌రులో పార్ల‌మెంటు ప్ర‌త్యేక స‌మావేశాలు..? మ‌ళ్లీ తెర‌పైకి డీలిమిటేష‌న్‌, మ‌హిళా బిల్లులు
Advertisement

Special Parliament Session | త్రినేత్ర న్యూస్ : ఈసీ నిర్ణ‌యాలు, స‌ర్ వివాదం, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌పై విప‌క్షాల నుంచి తీవ్ర నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో కేంద్రం పార్ల‌మెంటు ప్ర‌త్యేక స‌మావేశాల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు (Special Parliament Session) తెలుస్తోంది. ఈ నెలాఖ‌రులో పార్ల‌మెంటును స‌మావేశ‌ప‌రిచే అవ‌కాశం ఉంద‌ని సంబంధిత వ‌ర్గాల ద్వారా తెలిసింది. డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌కు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లులను ప్ర‌వేశ‌పెట్టేందుకు కేంద్రం ఈ స‌మావేశాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు స‌ద‌రు వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వ‌రుస క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

డీఎంకేతో చ‌ర్చ‌లు

నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు మార్గం సుగమం చేసే ఉద్దేశంతో తీసుకొచ్చిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో జ‌రిగిన స‌మావేశాల స‌మ‌యంలో వీగిపోయిన విష‌యం తెలిసిందే. అయితే ఈ బిల్లుల‌ను ఎలాగైనా ఆమోదింప‌జేసేందుకు కేంద్రం పావులు క‌దుపుతోంది. ఇప్ప‌టికే ప‌లు పార్టీల‌తో కూడా సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డీఎంకే (DMK) పార్టీతో కేంద్రం చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. డీలిమిటేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న డీఎంకే.. త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత‌ కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకుని ఇండీ కూట‌మి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ పార్టీతో ఎన్డీయే స‌ర్కార్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌ద‌రు వ‌ర్గాల ద్వారా తెలిసింది.

సంఖ్యా బ‌లంపై ధీమా

స‌భ‌లో సంఖ్యాబ‌లాన్ని మ‌రింత పెంచుకునేందుకు డీఎంకేతోపాటూ చిన్న చిన్న పార్టీలతో కూడా సంప్రదింపులు జరుపుతున్న‌ట్లు ప్ర‌భుత్వ‌ వర్గాలు పేర్కొన్నాయి. సభలో ఈ బిల్లులను ఆమోదింపజేసేందుకు అవసరమైన మద్దతు తమకు ఉందని ప్ర‌భుత్వం ధీమాగా ఉన్న‌ట్లు స‌మాచారం. అందుకే ప్ర‌త్యేక స‌మావేశాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంద‌ని స‌ద‌రు వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అక్టోబర్‌ 26, 27 తేదీల్లో సంవిధాన్‌ సదన్‌లో జరగనున్న 12వ బ్రిక్స్‌ పార్లమెంటరీ ఫోరమ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. సమావేశాల నిర్వ‌హ‌ణ‌కు వారం రోజుల ముందుగా నోటీసు ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ప్ర‌భుత్వానికి పెరిగిన మ‌ద్ద‌తు..

రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి పార్లమెంట్‌లో ప్రత్యేక మెజారిటీ అవసరం. లోక్‌సభలో ప్రస్తుతం 540 మంది సభ్యులుండగా మొత్తం సభ్యుల్లో మూడింట రెండొంతుల మద్దతు కీలకం. ఈ లెక్కన సుమారు 360 మంది సభ్యుల మద్దతు అవసరం. లోక్‌సభలో ఎన్డీఏ (NDA) కు మెజారిటీ ఉన్నప్పటికీ.. రాజ్యాంగ సవరణకు అవసరమైన (మూడింట రెండు వంతుల) సంఖ్యాబలం మాత్రం లేదు. అయితే, ఇటీవ‌లే చోటుచేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల‌తో పార్ల‌మెంటులో ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు పెరిగింది. తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన 20 మంది ఎంపీలు, శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు అధికార పక్షం వైపు ఉన్నాయి. డీఎంకే స‌హా చిన్న పార్టీల మ‌ద్ద‌తు కూడా కూడ‌గ‌ట్ట‌గ‌లిగితే ప్ర‌భుత్వం ఈ స‌మ‌స్య నుంచి గ‌ట్టెక్క‌గల‌దు.

కాంగ్రెస్ డిమాండ్ ఇదే..

ఈ బిల్లుల విష‌యంలో కాంగ్రెస్ పార్టీ త‌మ వైఖ‌రిని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది. లోక్‌స‌భ‌లోని ప్ర‌స్తుత 543 స్థానాల‌ను మ‌రో 25 ఏళ్ల‌పాటూ కొన‌సాగించాల‌ని, రాష్ట్రాల వారీగా ప్ర‌స్తుత సీట్ల కేటాయింపును య‌థాత‌థంగా ఉంచాల‌ని, 2029 లోక్‌స‌భ ఎన్నిక‌ల నుంచే మ‌హిళ‌ల‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లో 33 శాతం రిజ‌ర్వేష‌న్లను అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తోంది. ఈ మూడు అంశాల‌పై కాంగ్రెస్ పార్టీ వైఖ‌రి స్ప‌ష్టంగా ఉంద‌ని మ‌ల్లికార్జున‌ ఖ‌ర్గే ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. ఇండీ కూట‌మి ప‌క్షాలు కూడా ఇదే డిమాండ్‌తో ఉన్నాయి.

వర్షాకాల సమావేశాలు ముగియలేదు

పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు జులై 20న ప్రారంభ‌మై ఆగ‌స్టు 13న ముగిశాయి. సమావేశాలు నిరవధికంగా వాయిదా (Adjourned sine die) పడినప్పటికీ.. అధికారికంగా ముగియలేదు. ఉన్న సెష‌న్‌ను అధికారికంగా ముగించ‌క‌పోవ‌డంతో స‌భ‌ను మ‌ళ్లీ స‌మావేశ ప‌రిచే అవ‌కాశం ఉంద‌ని గ‌త కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే విష‌య‌మై పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజుజు సైతం క్లారిటీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. లోక్‌సభ, రాజ్యసభలు నిరవధిక వాయిదా పడినప్పటికీ, సెషన్‌ను రాష్ట్రపతి ఇంకా అధికారికంగా ముగించలేదని స్ప‌ష్టం చేశారు. ఉన్న సెష‌న్‌ను అధికారికంగా ముగించ‌కుండానే స‌భ‌ను మ‌ళ్లీ స‌మావేశ‌ప‌ర్చొచ్చ‌ని తెలిపారు. అయితే, ప్ర‌త్యేక సమావేశాల‌పై స్ప‌ష్ట‌త మాత్రం ఇవ్వ‌లేదు.

ఉభ‌య స‌భ‌లు నిర‌వ‌ధిక వాయిదా

గ‌త సెష‌న్‌లో రామమందిర విరాళాల చోరీ, నీట్ పేప‌ర్ లీక్ ఆందోళ‌న‌ల సంద‌ర్భంగా నిర‌స‌న తెలుపుతున్న విద్యార్థుల‌పై పోలీసుల లాఠీఛార్జ్‌, పెల్లెట్ గ‌న్స్ వాడ‌టంపై విప‌క్షాలు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఆయా అంశాల‌పై ప్ర‌తిప‌క్ష ఎంపీలంతా పార్ల‌మెంట్ లోప‌లా, బ‌య‌ట త‌మ నిర‌స‌న‌ల‌ను కొన‌సాగించారు. విప‌క్షాల నిర‌స‌ల‌న‌తో 19 రోజుల పాటు సాగిన ఈ సమావేశాలు ఎలాంటి అర్థవంతమైన చర్చలూ లేకుండా ఉభ‌య స‌భ‌లు నిర‌వ‌ధిక వాయిదా ప‌డ్డాయి. ఇక ఈ స‌మావేశాల్లో మొత్తం 12 బిల్లులకు ఆమోదం ల‌భించింది. పరీక్షల్లో పేపర్ లీక్‌లు, అక్రమాలకు పాల్పడే వారిని కట్టడి చేసేందుకు తెచ్చిన 'యాంటీ పేపర్ లీక్ బిల్లు'పైనే (Public Examinations Amendment Bill 2026) మాత్ర‌మే చ‌ర్చ జ‌రిగింది.

Also Read..

సీఏఎస్‌పై సెబీ కొత్త రూల్స్‌.. వారంలోగా మార్గ‌ద‌ర్శ‌కాలు..

రూ.425.50 కోట్ల వ్య‌యంతో రాష్ట్రంలో 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు

పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై బీభత్సం.. ఒక‌దానికొక‌టి ఢీకొట్టిన 6 కార్లు.. భారీగా ట్రాఫిక్ జామ్‌

Advertisement
Advertisement