త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajasthan Dust Storm | రాజస్థాన్‌ను కమ్మేసిన భారీ ఇసుక తుఫాను: మధ్యాహ్నం 2 గంటలకే అంధకారం.. వణికిపోయిన జనం

రాజస్థాన్‌లోని చురు, బికనీర్ జిల్లాలను భారీ ఇసుక తుఫాను వణికించింది. మధ్యాహ్నం 2 గంటలకే చీకటి కమ్ముకోవడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

J

National | Published On May 30, 2026, 4.25 pm IST

Rajasthan Dust Storm | రాజస్థాన్‌ను కమ్మేసిన భారీ ఇసుక తుఫాను: మధ్యాహ్నం 2 గంటలకే అంధకారం.. వణికిపోయిన జనం
Advertisement
  • రాజస్థాన్‌లోని చురు, బికనీర్ తదితర జిల్లాల్లో శనివారం భారీ ఇసుక తుఫాను బీభత్సం సృష్టించింది.
  • మధ్యాహ్నం 2 గంటలకే ఆకాశాన్ని దట్టమైన ఇసుక కమ్ముకోవడంతో రాత్రిని తలపించేలా చీకటి పడింది, విజిబిలిటీ జీరోకి పడిపోయింది.
  • అరగంట పాటు సాగిన ఈ భయానక తుఫాను దెబ్బకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఆ వెంటనే భారీ వర్షం కురిసింది.
  • కొద్ది రోజుల క్రితమే ఈ ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలతో వడగాలులు వీయడం గమనార్హం.

Rajasthan Dust Storm | త్రినేత్ర.న్యూస్ : రాజస్థాన్‌ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భయంకరమైన ఎండలతో అల్లాడుతున్న ప్రజలపై ప్రకృతి పంజా విసిరింది. శనివారం మధ్యాహ్నం చురు (Churu), బికనీర్ (Bikaner) జిల్లాల్లో ఊహించని రీతిలో భారీ ఇసుక తుఫాను (Sandstorm) విరుచుకుపడింది. దీంతో పట్టపగలే దట్టమైన చీకటి కమ్ముకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆ తర్వాత కురిసిన భారీ వర్షంతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.

అరగంట పాటు నరకం.. జీరో విజిబిలిటీ

మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో ఈ డస్ట్ స్టార్మ్ (Dust storm) మొదలైంది. చూస్తుండగానే ఆకాశం మొత్తం ఇసుకతో నిండిపోయి, రాత్రిని తలపించేలా అంధకారం అలుముకుంది. గాలిలో భారీగా ఇసుక చేరడంతో విజిబిలిటీ (Visibility) పూర్తిగా జీరోకి పడిపోయింది. దీంతో రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దారి కనిపించకపోవడంతో డే టైమ్‌లోనే హెడ్‌లైట్లు ఆన్ చేసుకుని మరీ వాహనాలు నడపాల్సి వచ్చింది. భద్రత దృష్ట్యా చాలా మంది తమ కార్లు, బైకులను ఎక్కడికక్కడే ఆపేశారు.

కూలిన చెట్లు.. ఇళ్లలోకి చేరిన ఇసుక

ఈ భయానక వాతావరణం సుమారు 30 నిమిషాల పాటు కొనసాగింది. బలమైన ఈదురు గాలుల ధాటికి పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. వీధుల్లో ఉన్న ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి ఇళ్లు, దుకాణాల్లోకి పరుగులు తీశారు. ఇసుక తుఫాను తగ్గుముఖం పట్టిన వెంటనే భారీ వర్షం కురవడంతో నివాస ప్రాంతాలన్నీ ఇసుక, బురదతో నిండిపోయాయి. చురు, బికనీర్‌తో పాటు శ్రీ గంగానగర్, జైపూర్ వంటి ఇతర నగరాల్లోనూ ఇలాంటి ప్రతికూల పరిస్థితులే నెలకొన్నాయి.

నిన్నటిదాకా భగభగలు.. ఈరోజు వణుకు

ఇదిలా ఉంటే, కేవలం కొద్ది రోజుల క్రితమే చురు జిల్లాలో తీవ్రమైన వడగాలులు (Heatwave) వీచాయి. ప్రాంతీయ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఇక్కడ ఉష్ణోగ్రతలు ఏకంగా 44°C దాటాయి. ఎండల దెబ్బకు ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా, మార్కెట్లు, రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర పనుల మీద బయటకు వచ్చిన వారు చల్లని పానీయాలతో దాహం తీర్చుకున్నారు. అంతలోనే వాతావరణం ఇలా పూర్తిగా విరుద్ధంగా, భయంకరంగా మారడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Advertisement
Advertisement