త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amit Shah | కాంగ్రెస్ పార్టీ మ‌రో 30 ఏళ్ల వ‌ర‌కూ అధికారంలోకి రాదు : అమిత్ షా

Amit Shah | ఎన్నికల్లో ఓటములను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ (Congress) పార్టీ ఓట్ చోరీ (vote chori) పేరుతో కొత్త సాకు వెతుకుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) మండిపడ్డారు.

D

National | Published On Oct 22, 2026, 2.31 pm IST

Amit Shah | కాంగ్రెస్ పార్టీ మ‌రో 30 ఏళ్ల వ‌ర‌కూ అధికారంలోకి రాదు : అమిత్ షా
Advertisement

Amit Shah | త్రినేత్ర న్యూస్ :కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎన్నికల్లో ఓటములను కప్పిపుచ్చుకునేందుకే హ‌స్తం పార్టీ ఓట్ చోరీ (vote chori) పేరుతో కొత్త సాకు వెతుకుతోందని మండిపడ్డారు. నేడు త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్య‌క్ర‌మంలో షా పాల్గొన్నారు. యమునా నదిని శుభ్రపరిచేందుకు చేపట్టిన రూ. 8,941 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్ ప్ర‌భుత్వం, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

ఓటములను జీర్ణించుకోలేకపోతున్నారు

"బీజేపీ వరుసగా ఎన్నికల్లో గెలుస్తుండటంతో ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. అందుకే కాంగ్రెస్ దాని మిత్ర‌ప‌క్షాలు బీజేపీపై ఓట్ చోరీ ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. రాహుల్ (Rahul Gandhi) జీ ఎప్పుడూ ఓట్ల దొంగ‌త‌నం గురించే మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఆయ‌న చొర‌బాటుదారుల ఓట్ల‌ను కాపాడుకోవాల‌నుకుంటున్నారు కాబ‌ట్టి. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాకముందే బీజేపీ అనేక రాష్ట్రాల్లో గెలుస్తూ వస్తోంది. అయితే దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో అధికారానికి దూరంగానే ఉంది. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాతే ఆ పార్టీ ఎన్నికల పరాజయాలు మొదలయ్యాయా..?" అని షా ఘాటుగా స్పందించారు. ఆందోళ‌న‌ల‌తో ప్ర‌జాభీష్టాన్నిమార్చ‌లేర‌ని షా వ్యాఖ్యానించారు. కేవ‌లం ఆందోళ‌న‌లు, ధ‌ర్నాలు చేయ‌డం వ‌ల్ల ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేర‌ని రాహుల్ గాంధీని ఉద్దేశించి అమిత్ షా విమర్శించారు. దేశంలో కాంగ్రెస్​ అనుసరిస్తున్న ప్రతికూల రాజకీయాల కారణంగా ఆ పార్టీ మ‌రో 30 ఏళ్ల వ‌ర‌కూ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు.

బీజేపీ 30 ఏళ్లపాటు అధికారంలో ఉంటుంది

బీజేపీ 30 ఏళ్ల పాటూ అధికారంలో ఉంటుందని నేను చెబితే.. ఓట్లు దొంగ‌లించారంటూ మాపై ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు అమిత్ షాకు ముందే ఎలా తెలుస్తాయ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అమిత్ షా ఇక్క‌డే పుట్టారు. ఇక్క‌డే నివ‌సిస్తున్నారు.. ఇక్క‌డే మ‌ర‌ణిస్తారు. నేను ప్ర‌తి ఆరు నెల‌ల‌కోసారి విదేశాల‌కు వెళ్ల‌ను. దేశ ప్ర‌జ‌ల మ‌ధ్యే జీవిస్తున్నాను అంటూ రాహుల్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

2029 మే నాటికి యమునా నదిని శుభ్రం చేస్తాం

యమునా న‌దిలోకి మురుగునీరు చేర‌కుండా నివారించ‌డంలో ఢిల్లీలోని గ‌త ఆప్ ప్ర‌భుత్వం తీవ్రంగా విఫ‌ల‌మైంద‌ని షా విమ‌ర్శించారు. న‌దిని ప్ర‌క్షాళ‌న చేసేందుకు బీజేపీ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. "కాంగ్రెస్, ఆప్ ప్రభుత్వాలు యమునా నదిలో మురుగునీరు కలిసేలా చేశాయి. కానీ మేం 2029 మే నాటికి నదిని పూర్తిగా శుభ్రం చేస్తాం" అని అమిత్ షా ఈ సంద‌ర్భంగా ప్రకటించారు.

పంజాబ్‌లో ఆప్ ఓట‌మి ఖాయం

మ‌రోవైపు త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గనున్న నేప‌థ్యంలో పంజాబ్‌లో భ‌గ‌వంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్ర‌భుత్వంపై కూడా షా తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. రాష్ట్రంలో డ్రగ్స్ బెడద పెరిగిపోయిందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో పంజాబ్‌లో ఎన్డీయే (NDA) ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఆ త‌ర్వాత రాష్ట్రంలో డ్ర‌గ్స్ అక్ర‌మ ర‌వాణాను పూర్తిగా అంతం చేస్తామ‌ని షా హామీ ఇచ్చారు.

Also Read..

దావూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడు.. ఐరాస‌లో భార‌త్‌

భార్య‌కు హ‌గ్ ఇచ్చాడు.. 5 ప‌క్క‌టెముక‌లు విర‌గ్గొట్టాడు

రామాయ‌ణపై మ‌రో ట్విస్ట్ - ఓటీటీలో డ‌బ్బులు పెట్టి చూడాల్సిందే - బ‌డ్జెట్ క‌ష్టాలే కార‌ణ‌మా?

Advertisement
Advertisement