త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Saurabh Bothra | ఐఐటీ జాబ్ వద్దనుకుని ‘యోగా’ గురువయ్యాడు.. 169 దేశాల్లో 1.5 కోట్ల మందికి ‘యోగా’ నేర్పుతున్న యువకుడు!

లక్షల జీతం వచ్చే ఐఐటీ కెరీర్‌ను వదులుకుని యోగా టీచర్‌గా మారాడు. నేడు 169 దేశాల్లోని 1.5 కోట్ల మంది చేత యోగా చేయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

J

Lifestyle | Published On Jun 21, 2026, 11.55 pm IST

Saurabh Bothra | ఐఐటీ జాబ్ వద్దనుకుని ‘యోగా’ గురువయ్యాడు.. 169 దేశాల్లో 1.5 కోట్ల మందికి ‘యోగా’ నేర్పుతున్న యువకుడు!
Advertisement
  • ఐఐటీ-బీహెచ్‌యూ (IIT-BHU) లో చదివిన 32 ఏళ్ల సౌరభ్ బోత్రా.. ఇంజనీరింగ్ కెరీర్ వదిలేసి 'హాబిల్డ్' (Habuild) అనే స్టార్టప్‌ను ప్రారంభించారు
  • కరోనా లాక్‌డౌన్ సమయంలో మొదలైన ఈ ఆన్‌లైన్ యోగా ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రస్తుతం 169 దేశాల్లోని 1.5 కోట్ల మంది యోగా నేర్చుకుంటున్నారు
  • ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన మహిళల్లో ఫిట్‌నెస్ అలవాటును పెంపొందిస్తూ, వారి ఇళ్లల్లో ఒక 'సొంత కొడుకు'లా అభిమానం సంపాదించుకున్నారు
  • ఫిట్‌నెస్ మాత్రమే కాకుండా.. ఆరోగ్యాన్ని ఒక మంచి అలవాటుగా (Habit building) మార్చడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు

Saurabh Bothra | త్రినేత్ర.న్యూస్ : అత్యున్నత విద్యాసంస్థ ఐఐటీలో (IIT) చదివితే లక్షల ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడొచ్చు. కానీ మహారాష్ట్రకు చెందిన 32 ఏళ్ల సౌరభ్ బోత్రా (Saurabh Bothra) ఆలోచన మరోలా ఉంది. ఇంజనీరింగ్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పి.. ఆరేళ్ల పాటు ఎన్నో కష్టాలు పడి 'హాబిల్డ్' (Habuild) అనే హెల్త్ స్టార్టప్‌ను స్థాపించాడు. నేడు ఏకంగా 169 దేశాల్లోని 1.5 కోట్ల మందికి ఆన్‌లైన్‌లో యోగా నేర్పుతూ గ్లోబల్ ఫిట్‌నెస్ ఐకాన్‌గా మారాడు.

40 ప్లస్ మహిళల 'యోగా' కొడుకు

సౌరభ్ స్టార్టప్ 'హాబిల్డ్' సాధించిన విజయం కేవలం సంఖ్యల్లో మాత్రమే లేదు. ఇందులో యోగా చేసేవారిలో సగానికి పైగా 40 ఏళ్లు పైబడిన మహిళలే ఉండటం విశేషం. అంతకు ముందు ఎలాంటి ఫిట్‌నెస్ రొటీన్ లేని వీరంతా.. ఇప్పుడు రోజూ ఉదయాన్నే ఆన్‌లైన్‌లో సౌరభ్ క్లాస్ కోసం ఎదురుచూస్తుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునేలా ప్రతిరోజూ మోటివేట్ చేసే సౌరభ్‌ను ఆ మహిళలంతా తమ సొంత కొడుకులా భావిస్తుంటారు.

ఒక్క రైలు ప్రయాణం.. మార్చేసిన జీవితం

మహారాష్ట్రలో పుట్టి పెరిగిన సౌరభ్‌కు చిన్నప్పటి నుంచే సేవాభావం ఎక్కువ. సిటీ లైఫ్‌ను వదిలేసి మారుమూల గ్రామంలో వైద్య సేవలు అందించిన తన తాతయ్య, అలాగే స్వామి వివేకానంద ఆలోచనలు అతడిని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఐఐటీ-బీహెచ్‌యూ (IIT-BHU) లో అడ్మిషన్ వచ్చిన తర్వాత అందరిలాగే సెటిల్ అయిపోతాడు అనుకున్నారు. కానీ ఓసారి రైలు ప్రయాణంలో యోగా, ధ్యానం (Meditation) గురించి తెలుసుకోవడం అతని జీవితాన్నే మార్చేసింది. అప్పటి నుంచి సాఫ్ట్‌వేర్ రూట్ వదిలేసి యోగా టీచర్‌గా మారాడు.

IIT Grad Saurabh Bothra Teaches Yoga to 1.5 Crore People Globally

లాక్‌డౌన్ కష్టాల్లో మొదలై.. గ్లోబల్ స్థాయికి

ఎంతో మందికి క్లాసులు చెప్పిన సౌరభ్ ఒక విషయాన్ని గమనించాడు. 'ఆరోగ్యంగా ఉండాలని అందరికీ ఉంటుంది, కానీ రోజూ యోగా చేయడం కష్టం' అని అర్థం చేసుకున్నాడు. ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే హాబిల్డ్. 2020 మార్చిలో కరోనా లాక్‌డౌన్‌కు కొద్దిరోజుల ముందు ఎలాంటి ఫండింగ్ లేకుండా, కొద్ది మందితో దీన్ని ప్రారంభించాడు.

అతని కాన్సెప్ట్ చాలా సింపుల్.. "ప్రతిరోజూ ఆన్‌లైన్ క్లాస్‌కు హాజరవ్వండి". కరోనా సమయంలో అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో, ఈ ఆన్‌లైన్ సెషన్స్‌కు జనాలు విపరీతంగా ఆకర్షితులయ్యారు. మౌత్ టాక్ ద్వారా ఒక చిన్న ఇనిషియేటివ్ కాస్తా.. ప్రపంచ స్థాయి వెల్‌నెస్ మూవ్‌మెంట్‌గా మారిపోయింది.

ఫిట్‌నెస్ కాదు.. హ్యాబిట్ ముఖ్యం

ఈ స్టార్టప్ సక్సెస్ వెనుక ఉన్నది కేవలం బరువు తగ్గడం, ఫిట్‌నెస్ సాధించడం కాదు. యోగాను ఒక అలవాటుగా మార్చడమే దీని ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా ఇల్లు, ఆఫీసు పనులతో బిజీగా ఉండే మహిళలకు ఈ ప్లాట్‌ఫామ్ ఎంతో ఉపయోగకరంగా మారింది. ఒకప్పుడు ఒంటరిగా మొదలైన ఈ ప్రయాణం.. నేడు 300 మంది ఉద్యోగులతో ప్రపంచంలోనే అతిపెద్ద వర్చువల్ యోగా (Virtual yoga) ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా నిలిచింది. పురాతన భారతీయ యోగా విద్యను, డిజిటల్ ప్రపంచానికి అనుసంధానించి కోట్లాది మందిలో ఆరోగ్య సిరిని పంచుతున్నాడు మన ఐఐటీ యోగా గురువు సౌరభ్.

Advertisement

తాజావార్తలు

Advertisement