త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

H-1B visa | భార‌తీయుల‌కు షాక్‌.. హెచ్‌-1బీ ప్రోగ్రామ్‌ రద్దుకు అమెరికా చట్టసభలో బిల్లు

H-1B visa | హెచ్‌-1బీ వీసాల (H-1B visa programme) విష‌యంలో అగ్ర‌రాజ్యం అమెరికా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. హెచ్‌-1బీ ప్రోగ్రామ్‌నే ర‌ద్దు చేసేందుకు సిద్ధ‌మైంది. ఈ మేర‌కు అమెరికా చట్టసభ సభ్యుడు ఒకరు బిల్లును ప్రవేశపెట్టారు.

D

International | Published On Feb 11, 2026, 11.16 am IST

H-1B visa | భార‌తీయుల‌కు షాక్‌.. హెచ్‌-1బీ ప్రోగ్రామ్‌ రద్దుకు అమెరికా చట్టసభలో బిల్లు
Advertisement

H-1B visa | హెచ్‌-1బీ వీసాల (H-1B visa programme) విష‌యంలో అగ్ర‌రాజ్యం అమెరికా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇప్ప‌టికే కొత్త వీసాల‌పై రుసుమును 1,00,000 డాల‌ర్ల‌కు పెంచి షాకిచ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు హెచ్‌-1బీ ప్రోగ్రామ్‌నే ర‌ద్దు చేసేందుకు సిద్ధ‌మైంది. ఈ మేర‌కు అమెరికా చట్టసభ సభ్యుడు ఒకరు బిల్లును ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాదినాటికి హెచ్‌-1బీ కార్యక్రమానికి ముగింపు పలకాలంటూ ప్ర‌తిపాద‌న చేశాడు.

అమెరికా వలస విధానం, జాతీయత చట్టాన్ని, వీసా కార్యక్రమాన్ని రద్దు చేయాలని ప్రతిపాదిస్తూ ఫ్లోరిడా ప్రతినిధి, రిపబ్లికన్‌ గ్రెగ్‌ స్టీబ్‌ (Greg Steube) ‘ఎండింగ్ ఎక్స్‌ప్లాయిటేటివ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎగ్జెంప్షన్స్ యాక్ట్ (ఎక్సైల్‌ యాక్ట్)’ (EXILE Act)పేరుతో ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ వీసాల వ‌ల్ల అమెరికా పౌరుల‌కు జ‌రుగుతున్న న‌ష్టాన్ని వివ‌రించారు. విదేశీ కార్మికుల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం వ‌ల్ల అమెరికా పౌరుల సంక్షేమం, అభివృద్ధి దెబ్బ‌తింటోంద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇది జాతి ప్ర‌యోజ‌నాల‌ను విరుద్ధ‌మ‌ని పేర్కొన్నారు. ఈ వీసా ప్రోగ్రామ్ వ‌ల్ల అమెరికా యువ‌త‌, కార్మికులు ఉద్యోగాలు కోల్పోతున్నార‌ని చెప్పుకొచ్చారు. కార్పొరేట్ కంపెనీలు ఈ వీసాను దుర్వినియోగ‌ప‌రుస్తూ.. త‌క్కువ వేత‌నానికి విదేశీ యువ‌త‌ను తెచ్చుకుని స్థానిక యువ‌త‌కు ద‌క్కాల్సిన ఉద్యోగాల‌ను హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. అందుకే మ‌న పిల్ల‌ల‌కు అమెరిక‌న్ డ్రీమ్‌ను కాపాడాలంటే ఈ దోపిడీకి అడ్డుక‌ట్ట వేయాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు.

స్వ‌స్తి ప‌ల‌కాల్సిందే..

గ్రెగ్‌స్టీబే కాదు.. చాలా మంది నేత‌లు హెచ్‌-1బీ వీసాల ద్వారా అమెరికన్లకు జరుగుతున్న అన్యాయంపై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్రతిభావంతులైన అమెరికన్లను కాదని కొన్ని అమెరికన్‌ కంపెనీలు భారతీయులు, చైనీయులను నియమించుకుంటూ హెచ్‌-1బీ స్కామ్‌కు పాల్పడుతున్నాయని ఆరోపిస్తున్నారు. మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌ నినాదం భారతీయుల వల్లో, చైనీయుల వల్లో సాకారం కాదని, కేవలం అమెరికన్ల వల్లే అది సాధ్యపడుతుందని అభిప్రాయ‌ప‌డుతున్నారు. అందుకే ఈ వీసా ప్రోగ్రామ్‌కు స్వ‌స్తి ప‌ల‌కాలంటూ గ‌త కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు.

జేడీ వాన్స్ సైతం..

ఈ ప్రోగ్రామ్‌ అమెరికన్‌ ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద కంపెనీలు 9,000 మంది ఉద్యోగులను లేఆఫ్‌ చేసి వేలాది విదేశీ వర్క్‌ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నాయని, కొత్త ఉద్యోగాల కల్పన జరగడం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం ఓ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించారు.

హెచ్‌-1బీ వీసాలు పొందిన‌వారిలో భార‌తీయులే అధికం

హెచ్‌-1బీ వీసాలను అమెరికా గరిష్ఠంగా ఏడాదికి 65,000 వ‌ర‌కూ జారీచేస్తుంది. అమెరికాలో మాస్టర్స్‌ లేదా పీహెచ్‌డీ చేసిన వారి కోసం అదనంగా మరో 20,000 స్లాట్లు లభిస్తాయి. ఈ వీసాలు పొందుతున్న లబ్ధిదారుల్లో భారతీయులే అధికం. గత దశాబ్ద కాలంలో ఏటా జారీ అయ్యే హెచ్‌-1బీ వీసాలలో 80 శాతం భారతీయులే పొందారు. ప‌లు నివేదిక‌ల ప్ర‌కారం.. 2023 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 3.86 లక్షల హెచ్‌-1బీ వీసాలు జారీ కాగా అందులో 2.79 లక్షల వీసాలు భారతీయులకే దక్కాయి. 2024లో మొత్తం 3.99 లక్షల దరఖాస్తులకు ఆమోదం లభించగా అందులో 2.83 లక్షలు (71 శాతం) భారతీయులవే ఉన్నాయి. ఇప్పుడు తాజా బిల్లుతో భార‌తీయుల‌కు షాక‌నే చెప్పాలి.

అమెజాన్ టాప్‌..

అమెరికాలోని ఐటీ కంపెనీల్లో పని చేసేందుకు ప్రత్యేక వృత్తి నిపుణుల కోసం ప్రతియేటా జారీ చేసే తాత్కాలిక వీసా ప్రోగ్రామ్‌ హెచ్‌1- బీ వీసా. భారత ఐటీ దిగ్గజ సంస్థలు ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, విప్రోలు అత్యధికంగా ఈ వీసాలు పొందుతుంటాయి. ఈ వీసాలతోనే అమెరికాలో తమ వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ వీసాలతోనే భారతీయుల్ని నియమించుకుంటున్నాయి. ఈ వీసాల‌ను అత్య‌ధికంగా పొందిన సంస్థ‌ల్లో అమెజాన్‌ (Amazon) టాప్‌లో ఉండ‌గా.. టాటా కన్సల్టెన్సీ (TCS) రెండోస్థానంలో నిలిచింది.

యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ డేటా ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరం జూన్‌ నాటికి అమెజాన్‌ దాదాపు 10,044 హెచ్‌-1బీ వీసాలను ఉపయోగించింది. ఆ తర్వాత టీసీఎస్‌ 5,505, మైక్రోసాఫ్ట్ (5,189), మెటా (5,123), యాపిల్ (4,202), గూగుల్ (4,181), డెలాయిట్ (2,353), ఇన్ఫోసిస్ (2,004), విప్రో (1,523), టెక్ మహీంద్రా అమెరికాస్ (951), ఒరాకిల్‌ (2,092), అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (2,347), కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్ (2,493), వాల్‌మార్ట్‌ అసోసియేట్స్‌ (2,390) హెచ్‌-1బీ వీసాలను దక్కించుకున్నాయి. ఇవే కాకుండా అమెరికాకు చెందిన పలు కంపెనీలు కూడా హెచ్‌-1బీ వీసాలతో ఎక్కువమంది భారతీయులను నియమించుకుంటున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement