త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India’s Maoists Book Launch | మావోయిస్టుల కోట్లాది రూపాయల డంపులు, బంగారు బిస్కెట్లు: ఆ పుస్తకంలో సంచలన రహస్యాలు వెలుగులోకి!

అడవులు, నగరాల్లో దాచిన కోట్ల నగదు, బంగారు బిస్కెట్ల డంపుల రహస్యాలను బట్టబయలు చేస్తూ ప్రముఖ రక్షణ నిపుణుడు డాక్టర్ పి.వి. రమణ రాసిన సరికొత్త పుస్తకం ఆవిష్కృతమైంది.

J

Hyderabad | Published On Oct 28, 2026, 8.43 pm IST

India’s Maoists Book Launch | మావోయిస్టుల కోట్లాది రూపాయల డంపులు, బంగారు బిస్కెట్లు: ఆ పుస్తకంలో సంచలన రహస్యాలు వెలుగులోకి!
Advertisement
  • అంతర్గత భద్రతా నిపుణుడు డాక్టర్ పి.వి. రమణ రచించిన ‘ఇండియాస్ మావోయిస్ట్స్: గ్లింప్సెస్ ఇన్‌టు రెడ్ ఇన్సర్జెన్సీ’ పుస్తకం బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో ఆవిష్కరణ
  • మావోయిస్టుల అక్రమ నగదు నిల్వలు, బంగారు బిస్కెట్లు, అర్బన్ నెట్‌వర్క్‌లు, 196 జిల్లాల జీఐఎస్ మ్యాపులతో లోతైన పరిశోధన వెల్లడి
  • అంబేద్కరిజం తెచ్చిన సామాజిక చైతన్యమే నక్సలిజం ప్రభావాన్ని తగ్గించిందన్న తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారు బి. శివధర్‌రెడ్డి
  • మావోయిస్టులు మళ్లీ పుంజుకోకుండా ఫార్వర్డ్ బేస్‌లు (FOB) కొనసాగించాలని, అర్బన్ నిధులపై నిఘా పెట్టాలని ఏపీ మాజీ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టీకరణ

India's Maoists Book Launch | త్రినేత్ర న్యూస్ : మావోయిస్టు పార్టీ రహస్య కార్యకలాపాలు, ఆర్థిక మూలాలు, అంతర్గత నిర్మాణ వాస్తవాలను వెలికితీస్తూ ప్రముఖ అంతర్గత భద్రతా నిపుణులు డాక్టర్ పి.వి. రమణ రచించిన పరిశోధనాత్మక గ్రంథం ‘ఇండియాస్ మావోయిస్ట్స్: గ్లింప్సెస్ ఇన్‌టు రెడ్ ఇన్సర్జెన్సీ’ (India’s Maoists: Glimpses into Red Insurgency) హైదరాబాద్ వేదికగా ఆవిష్కృతమైంది. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) ఆడిటోరియంలో బుధవారం జరిగిన ఈ సదస్సులో ఉభయ తెలుగు రాష్ట్రాల ఉన్నత పోలీసు అధికారులు, భద్రతా విశ్లేషకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నక్సలిజంపై పైచేయి సాధించిన అంబేద్కరిజం: బి. శివధర్‌రెడ్డి

కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారు, మాజీ డీజీపీ బి.శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య విలువలు, సమ్మిళిత పాలన వల్లే నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో శాంతి నెలకొందన్నారు. "రాజ్యాంగం కల్పించిన హక్కులు, సామాజిక న్యాయాన్ని చాటిచెప్పే అంబేద్కరిజం భావజాలం ప్రజల్లో విప్లవాత్మక చైతన్యాన్ని తెచ్చింది. ఇది మావోయిస్టుల సిద్ధాంత ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో సమర్థంగా తిప్పికొట్టింది" అని ఆయన విశ్లేషించారు. పోలీసు బలగాలు, అన్ని ప్రభుత్వ విభాగాల సమిష్టి కృషితోనే నేడు శాంతి సాకారమైందని గుర్తుచేశారు.

భవిష్యత్ సవాళ్లు.. అర్బన్ నెట్‌వర్క్‌లపై నిఘా: ద్వారకా తిరుమలరావు

ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. శాశ్వత శాంతి కోసం కేంద్ర బలగాల ఉపసంహరణ తొందరపాటుగా ఉండకూడదని హెచ్చరించారు. వ్యూహాత్మక అటవీ ప్రాంతాల్లో ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్‌లను (FOBs) కొనసాగించాలన్నారు. గతంలో లూటీ అయిన ఆయుధాలు, పేలుడు పదార్థాలను రికవరీ చేయడంతో పాటు, మెట్రో నగరాల్లో చాపకింద నీరులా విస్తరిస్తున్న మావోయిస్టు అర్బన్ నెట్‌వర్క్‌లను, వారి అక్రమ హవాలా నిధులను పూర్తిగా కట్టడి చేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. దేశవ్యాప్తంగా నక్సల్ ప్రభావం ఉన్న 196 జిల్లాల్లో యువతకు ఉపాధి కల్పించి, వారు మళ్లీ తీవ్రవాదం వైపు ఆకర్షితులు కాకుండా చూడాలన్నారు.

India’s Maoists Book Launched Hidden Cash Gold Dumps and Inside Realities Revealed

బంగారు బిస్కెట్ల డంపులు.. లోతైన పరిశోధన: రచయిత డాక్టర్ రమణ

రచయిత డాక్టర్ పి.వి. రమణ మాట్లాడుతూ.. 2004 నుంచి 2026 వరకు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి, లొంగిపోయిన కేడర్, సీనియర్ భద్రతాధికారులను ఇంటర్వ్యూ చేసి ఈ పుస్తకం రాశానని తెలిపారు.

ఆర్థిక మూలాలు: అడవుల్లోనే కాకుండా నగరాల్లో కూడా మావోయిస్టులు దాచిన కోట్ల రూపాయల నగదు, వందల సంఖ్యలోని బంగారు బిస్కెట్ల గుప్త డంపుల వివరాలను ఈ గ్రంథంలో బట్టబయలు చేశారు.

జీఐఎస్ మ్యాపింగ్: కేంద్ర హోంశాఖ గుర్తించిన 196 జిల్లాల భౌగోళిక పరిస్థితులను జీఐఎస్ (GIS) మ్యాపులతో సహా పొందుపరిచారు.

సమస్యకు పరిష్కారం (4P మోడల్): నక్సలిజం శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం, పరిశ్రమలు, ఎన్జీవోలు, ప్రజలతో కూడిన ‘పీపీపీపీ’ (Public-Private-People Partnership) విధానాన్ని సిఫార్సు చేశారు. లొంగిపోయిన వారికి పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్లు, భూమి కేటాయించడంతో పాటు వారి కేసుల సత్వర పరిష్కారానికి సీఎస్ స్థాయిలో త్రైమాసిక సమీక్షలు ఉండాలని సూచించారు.

గిరిజన ప్రాంతాల్లో ప్రాణాంతక సెరిబ్రల్ మలేరియా బారిన పడే రోగుల కోసం తక్షణమే ‘బైక్-అంబులెన్సులు’ ఏర్పాటు చేయాలని, స్థానిక మౌలిక పనులను స్థానిక గ్రామాలకే అప్పగించాలని రచయిత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీలు మహేష్ ఎం. భగవత్, అనిల్ కుమార్, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్, ‘తెలంగాణ టుడే’ ఎడిటర్ కె. శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Advertisement
Advertisement