త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttam Kumar Reddy | ప్రపంచ ఏరోస్పేస్ రాజధానిగా తెలంగాణ : మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి

Uttam Kumar Reddy | ప్రపంచ ఏరోస్పేస్ రాజధానిగా తెలంగాణ అవతరిస్తోందని మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అత్యాధునిక విమానాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, రక్షణ వ్యవస్థల తయారీలో హైదరాబాద్ ప్రపంచ పటంలో కీలక స్థానాన్ని దక్కించుకోబోతోందని ఆయన పేర్కొన్నారు.

P

Flash news | Published On Jun 30, 2026, 3.47 pm IST

Uttam Kumar Reddy | ప్రపంచ ఏరోస్పేస్ రాజధానిగా తెలంగాణ : మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి
Advertisement

Uttam Kumar Reddy | ప్రపంచ ఏరోస్పేస్ రాజధానిగా తెలంగాణ అవతరిస్తోందని మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అత్యాధునిక విమానాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, రక్షణ వ్యవస్థల తయారీలో హైదరాబాద్ ప్రపంచ పటంలో కీలక స్థానాన్ని దక్కించుకోబోతోందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఏరోమార్ట్ హైదరాబాద్–2026 అంతర్జాతీయ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ బిజినెస్ కన్వెన్షన్ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడారు. ప్రపంచ ఏరోస్పేస్ రంగం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోందని, పెట్టుబడులు, పరిశ్రమలు, అత్యాధునిక సాంకేతికతకు రాష్ట్రం కొత్త చిరునామాగా మారుతోందని చెప్పారు. భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, సూపర్‌సోనిక్ యుద్ధ విమానాలను నడిపిన వ్యక్తిగా ఏరోస్పేస్ రంగంలో నాణ్యత, ఖచ్చితత్వం ఎంత కీలకమో తనకు ప్రత్యక్ష అనుభవం ఉందన్నారు. "ఒక్క చిన్న విడిభాగంలో లోపం వచ్చినా మిషన్ విజయంపై ప్రభావం పడుతుంది. అలాంటి అత్యున్నత ప్రమాణాలను తెలంగాణ పరిశ్రమలు నేడు విజయవంతంగా అందిస్తున్నాయి" అని వ్యాఖ్యానించారు.

మేడ్ ఇన్ తెలంగాణ ముద్ర‌..

అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్‌కు అవసరమైన క్యాబిన్లు, అపాచీ యుద్ధ హెలికాప్టర్ల నిర్మాణ భాగాలు, ఎఫ్–16 యుద్ధ విమానాల రెక్కలు, ప్రపంచ ప్రఖ్యాత ఏరో ఇంజిన్ విడిభాగాలు, ఎంఆర్ఓ వ్యవస్థలు ప్రస్తుతం తెలంగాణలోనే తయారవుతున్నాయని మంత్రి తెలిపారు. "'మేడ్ ఇన్ తెలంగాణ' అనే ముద్ర ఇప్పుడు ప్రపంచ ఆకాశంలో గర్వంగా ఎగురుతోంది" అన్నారు. స్పెయిన్‌కు చెందిన ఐటీపీ ఏరో, కెనడాకు చెందిన ఎఫ్‌టీజీ ఏరోస్పేస్ వంటి అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం రాష్ట్ర పారిశ్రామిక విశ్వసనీయతకు నిదర్శనమని చెప్పారు. ఫ్రాన్స్, ఇటలీ సహా 25కిపైగా దేశాల కంపెనీలు ఏరోమార్ట్‌లో పాల్గొనడం తెలంగాణ అంతర్జాతీయ ప్రాధాన్యతను మరింత పెంచిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 1,500కు పైగా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు సేవలందిస్తున్న ఎంఎస్‌ఎంఈలు పనిచేస్తున్నాయని తెలిపారు. అత్యాధునిక పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండలాలు, ప్లగ్-అండ్-ప్లే మౌలిక సదుపాయాలతో తెలంగాణ దేశంలోనే అత్యంత ఆకర్షణీయ పెట్టుబడి గమ్యస్థానంగా నిలిచిందని చెప్పారు. డీఆర్‌డీఓ, రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, ప్రైవేట్ పరిశ్రమలు ఒకే నగరంలో ఉండటం హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి పోటీ సామర్థ్యాన్ని కల్పించిందన్నారు.

రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో..

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా రూపుదిద్దుకుంటున్న ఐటీఐలు ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యంతో కూడిన యువతను తీర్చిదిద్దుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగం గత కొన్నేళ్లుగా సగటున 30 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిందని, గత ఏడాది ఎగుమతులు 103 శాతం పెరిగి దశాబ్దాలుగా అగ్రస్థానంలో ఉన్న ఔషధ రంగాన్నే అధిగమించడం రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో సువ‌ర్ణ అధ్యాయ‌మ‌న్నారు. విమానయాన రంగ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని మంత్రి వెల్లడించారు. వరంగల్ విమానాశ్రయానికి వచ్చే నెలలో శంకుస్థాపన చేయనున్నట్లు, ఆదిలాబాద్‌లో పౌర-సైనిక అవసరాలకు అనువైన ఎయిర్‌ఫీల్డ్ ఏర్పాటు చేయనున్నట్లు, కొత్తగూడెం విమానాశ్రయానికి త్వరలో కేంద్రం నుంచి ఆమోదం లభించే అవకాశం ఉందని తెలిపారు. ఈ మూడు కేంద్రాలు భవిష్యత్తులో విమాన మరమ్మత్తు, విమాన తయారీ, రక్షణ పరిశ్రమలకు భారీ అవకాశాలు కల్పిస్తాయని చెప్పారు.

ప్రతి దశలో ప్రభుత్వం అండ

ప్రపంచ ఏరోస్పేస్ సంస్థలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, "మీ తదుపరి తయారీ కేంద్రం తెలంగాణ కావాలి. మీ తదుపరి పెట్టుబడి హైదరాబాద్‌లో ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చే ప్రభుత్వం మాత్రమే కాదు.. మీ విజయానికి భాగస్వామిగా నిలిచే ప్రభుత్వం" అని పిలుపునిచ్చారు. పెట్టుబడిదారులకు ప్రజాప్రతినిధుల నుంచి అధికార యంత్రాంగం వరకు 24 గంటలూ అందుబాటులో ఉంటామని, పరిశ్రమల స్థాపన, విస్తరణలో ప్రతి దశలో ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. "ఏరోమార్ట్ హైదరాబాద్–2026 కేవలం ఒక పారిశ్రామిక సదస్సు కాదు.. ప్రపంచ ఏరోస్పేస్ పటంలో తెలంగాణ శాశ్వత స్థానాన్ని ఖరారు చేసే చారిత్రక వేదిక" అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement