త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | మేలో 18 సినిమాలు డిజాస్ట‌ర్‌.. జూన్‌పైనే టాలీవుడ్ ఆశ‌లు..!

Tollywood | తెలుగు సినీ పరిశ్రమకు సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలలు కీలకమైనవిగా భావిస్తారు. సంక్రాంతి సీజన్ తర్వాత వచ్చే సమ్మర్ సెలవుల నేపథ్యంలో థియేటర్లకు ప్రేక్షకుల రద్దీ పెరిగి, సినిమాలు మంచి వసూళ్లు సాధించడం సహజం.

P

Entertainment | Published On Jun 3, 2026, 4.40 pm IST

Tollywood | మేలో 18 సినిమాలు డిజాస్ట‌ర్‌.. జూన్‌పైనే టాలీవుడ్ ఆశ‌లు..!
Advertisement

Tollywood | తెలుగు సినీ పరిశ్రమకు సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలలు కీలకమైనవిగా భావిస్తారు. సంక్రాంతి సీజన్ తర్వాత వచ్చే సమ్మర్ సెలవుల నేపథ్యంలో థియేటర్లకు ప్రేక్షకుల రద్దీ పెరిగి, సినిమాలు మంచి వసూళ్లు సాధించడం సహజం. అయితే, ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపించింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో కొన్ని చిత్రాలు ఆశాజనక ఫలితాలు అందుకున్నప్పటికీ, మే నెల మాత్రం టాలీవుడ్‌కు నిరాశనే మిగిల్చింది. మే నెలలో మొత్తం 18 తెలుగు చిత్రాలు థియేటర్లలో విడుదలయ్యాయి. అయితే వాటిలో ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో సమ్మర్ సీజన్‌పై పరిశ్రమ పెట్టుకున్న అంచనాలు ఫ‌లించ‌లేదు. విడుదలకు ముందు కొంత ఆసక్తి రేకెత్తించిన గాయ‌ప‌డ్డ‌ సింహం, జెట్ లీ, గోదారి గట్టుపైన వంటి చిత్రాలు కూడా ప్రేక్షకులను పెద్ద ఎత్తున థియేటర్లకు రప్పించలేకపోయాయి. విడుదల అనంతరం బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపడంలో విఫలమయ్యాయి. చిన్న చిత్రాల పరిస్థితి కూడా భిన్నంగా లేదు. రేజర్, రమణీ కళ్యాణం, ఫస్ట్ టైమ్, మరీచిక, త్రికాల, అగ్లీ స్టోరీ, దూర దర్శిని, వర్క్ ఫ్రం హోమ్ తదితర చిత్రాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయాయి.

ఐపీఎల్, ఎండ‌లు కార‌ణం కావొచ్చు..

ఈ పరిస్థితికి పలు కారణాలు లేక‌పోలేదు.. నెల పొడవునా సాగిన ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగా, తీవ్ర ఎండలు కూడా థియేటర్లకు వచ్చే వారి సంఖ్యపై ప్రభావం చూపినట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు, పెద్ద స్టార్ హీరోల సినిమాలు లేకపోవడం కూడా బాక్సాఫీస్ పనితీరుపై ప్రభావం చూపింది. కొన్ని ప్రాంతాల్లో ప్రేక్షకుల స్పందన తక్కువగా ఉండటంతో షోలు ర‌ద్ద‌యిన సందర్భాలు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే, మే నెలలో సినిమాల కంటే పరిశ్రమకు సంబంధించిన మరో అంశం ఎక్కువ చర్చనీయాంశమైంది. థియేటర్ యజమానులు, నిర్మాతల మధ్య కొనసాగుతున్న పర్సంటేజ్-రెంటల్ వివాదం పరిశ్రమలో చర్చకు దారితీసింది. ఇరు వర్గాలు మీడియా సమావేశాలు నిర్వహిస్తూ తమ వాదనలు వినిపించాయి. ఈ అంశం పరిశ్రమ పెద్దల దృష్టికి వెళ్లగా, సమస్య పరిష్కారంపై చర్చలు కూడా జరిగాయి. నిర్మాతల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ క‌ల్యాణ్‌ను కలిసి తమ అభిప్రాయాలను వెల్లడించారు.

జూన్‌పైనే ఆశ‌లు..

దీంతో మే నెలలో కొత్త సినిమాల విజయాల కంటే పరిశ్రమ అంతర్గత పరిణామాలే ఎక్కువగా వార్తల్లో నిలిచాయి. బాక్సాఫీస్‌కు మళ్లీ ఊపు తీసుకురావాలంటే ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్‌తో కూడిన చిత్రాలు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు టాలీవుడ్ దృష్టి జూన్ నెలపై నిలిచింది. రాబోయే వారాల్లో విడుదలకు సిద్ధమవుతున్న భారీ, మధ్యస్థాయి చిత్రాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయా, బాక్సాఫీస్‌కు కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తాయా అన్న ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది, అఖిల్ అక్కినేని లెనిన్, సమంత మా ఇంటి బంగారం వంటి చిత్రాలపై సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. జూన్ నెల టాలీవుడ్‌కు ఊరటనిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement