త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Premium Tatkal | ప్రీమియం తత్కాల్ టికెట్ అంటే ఏమిటి.. ధ‌ర‌లు ఎలా ఉంటాయి.. టికెట్ల‌ను ఎలా బుక్ చేయాలి..?

Premium Tatkal | ముంద‌స్తుగా ట్రెయిన్ టికెట్ల‌ను రిజ‌ర్వ్ చేసుకోలేక‌పోతే త‌రువాత చివ‌రి నిమిషాల్లో త‌త్కాల్‌లో టికెట్ల‌ను కొనాల్సి ఉంటుంది. అయితే తత్కాల్ లో చాలా మందితో పోటీ ఉంటుంది క‌నుక టికెట్లు ల‌భిస్తాయో, లేదోన‌ని టెన్ష‌న్ ప‌డ‌తారు. దీని వ‌ల్ల చివ‌రి నిమిషంలో రైలు టికెట్ల‌ను బుక్ చేయ‌డం చాలా సంద‌ర్భాల్లో త‌ల‌కు మించిన భారంగా అనిపిస్తుంది.

S

Business | Published On Jul 3, 2026, 12.26 pm IST

Premium Tatkal | ప్రీమియం తత్కాల్ టికెట్ అంటే ఏమిటి.. ధ‌ర‌లు ఎలా ఉంటాయి.. టికెట్ల‌ను ఎలా బుక్ చేయాలి..?
Advertisement

Premium Tatkal | ముంద‌స్తుగా ట్రెయిన్ టికెట్ల‌ను రిజ‌ర్వ్ చేసుకోలేక‌పోతే త‌రువాత చివ‌రి నిమిషాల్లో త‌త్కాల్‌లో టికెట్ల‌ను కొనాల్సి ఉంటుంది. అయితే తత్కాల్ లో చాలా మందితో పోటీ ఉంటుంది క‌నుక టికెట్లు ల‌భిస్తాయో, లేదోన‌ని టెన్ష‌న్ ప‌డ‌తారు. దీని వ‌ల్ల చివ‌రి నిమిషంలో రైలు టికెట్ల‌ను బుక్ చేయ‌డం చాలా సంద‌ర్భాల్లో త‌ల‌కు మించిన భారంగా అనిపిస్తుంది. తీవ్రంగా ఒత్తిడికి గుర‌వుతారు. ముఖ్యంగా పీక్ ట్రావెల్ సీజన్లలో లేదా అత్యవసర ప్రయాణ అవసరాలు ఉన్నప్పుడు కన్ఫర్మ్ టికెట్ పొందడం సవాలుగా ఉంటుంది. ఈ సమస్యను తగ్గించి రైల్వే రిజర్వేషన్ ప్రక్రియను మరింత వేగంగా, సులభంగా మార్చేందుకు భారతీయ రైల్వేలు డైనమిక్ ప్రైసింగ్ విధానంతో ప్రీమియం తత్కాల్ టికెట్ బుకింగ్ పథకాన్ని గ‌తంలోనే ప్రవేశపెట్టాయి. సాధారణ బుకింగ్ కోటాలపై ఆధారపడకుండా, అత్యవసరంగా ప్రయాణించాల్సిన వారికి ఐఆర్‌సీటీసీ ద్వారా కన్ఫర్మ్ టికెట్ పొందే అవకాశాన్ని ఇది క‌ల్పిస్తుంది.

ప్రీమియం త‌త్కాల్ అంటే..

ప్రీమియం తత్కాల్ టికెట్ అంటే చివరి నిమిషంలో రైలు టికెట్ బుక్ చేయాల్సిన ప్రయాణికుల కోసం భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టిన ప్రత్యేక కేటగిరీ. సాధారణ తత్కాల్ పథకంతో పోలిస్తే, ఇందులో డైనమిక్ ప్రైసింగ్ విధానం అమల్లో ఉంటుంది. అంటే టికెట్ ధర డిమాండ్‌ను బట్టి మారుతుంది. ఒక రైలుకు డిమాండ్ ఎక్కువగా ఉంటే టికెట్ ధర కూడా పెరుగుతుంది. డిమాండ్ తక్కువగా ఉంటే ధర సాధారణ తత్కాల్ ఛార్జీలకు సమానంగా లేదా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఉదాహ‌ర‌ణ‌కు ప్రీమియం తత్కాల్ కోటా కింద 100 టిక్కెట్లు అందుబాటులో ఉంటే అందుకు అనుగుణంగా ప్ర‌యాణికులు ఉంటే ధ‌ర కాస్త ఎక్కువ ఉంటుంది. అదే టిక్కెట్ల క‌న్నా ప్ర‌యాణికుల సంఖ్య అధికంగా ఉంటే అప్పుడు టిక్కెట్ ధ‌ర డైన‌మిక్ గా మారుతుంది. ప్ర‌యాణికుల సంఖ్య పెరిగే కొద్దీ టిక్కెట్ ధ‌ర కూడా డైన‌మిక్‌గా పెరుగుతూనే ఉంటుంది. అందువ‌ల్ల ప్రీమియం త‌త్కాల్‌లో స్థిర‌మైన చార్జీలు ఉండ‌వు. డిమాండ్‌ను బ‌ట్టి టిక్కెట్ ధ‌ర ఉంటుంది.

డైనమిక్ ప్రైసింగ్‌..

ప్రీమియం తత్కాల్‌లో అత్యంత ప్రత్యేకమైన అంశం డైనమిక్ ప్రైసింగ్. విమాన టికెట్ల ధరలు సీట్లు నిండుతున్న కొద్దీ పెరిగినట్లే, ఇందులో కూడా ప్రతి బుకింగ్‌తో టికెట్ ధర పెరుగుతుంది. ముందుగా బుక్ చేసుకున్న వారికి తక్కువ ధరలో టికెట్ లభించే అవకాశం ఉంటుంది. చివరి నిమిషంలో బుక్ చేసేవారు ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది. ప్రీమియం తత్కాల్ బుకింగ్ రైలు బయలుదేరే రోజుకు ముందు రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది సాధారణ తత్కాల్ బుకింగ్ సమయంతో సమానమే. దీంతో అత్యవసర ప్రయాణం అవసరమైన వారు ముందుగానే తమ బుకింగ్ పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రీమియం తత్కాల్ కోటాలో ఏజెంట్లకు టికెట్లు బుక్ చేసే అనుమతి ఉండదు. దీనివల్ల నిజమైన ప్రయాణికులకు మాత్ర‌మే టికెట్ పొందే అవకాశం ఉంటుంది.

కోటా రాయితీలు ఉండ‌వు..

ఈ కోటాలో ఎలాంటి రాయితీలు ఉండవు. అంటే మ‌హిళ‌లు, వృద్ధులు, అంగ వైక‌ల్యం ఉన్న‌వారు, ఇత‌ర ప్ర‌త్యేక కోటా లేదా డిస్కౌంట్‌తో ప్రయాణించే వారికి వ‌ర్తించే రాయితీల‌న్నీ ప్రీమియం త‌త్కాల్‌లో ఉండ‌వు. పూర్తి స్థాయిలో చార్జిల‌ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కన్ఫర్మ్ అయిన ప్రీమియం తత్కాల్ టికెట్‌ను ప్రయాణికుడు రద్దు చేసుకుంటే ఎలాంటి రీఫండ్ కూడా ఇవ్వరు. ఈ కఠినమైన నిబంధన వల్ల అనవసర బుకింగ్‌లు, చివరి నిమిషంలో క్యాన్సిలేషన్లు తగ్గుతాయి. ప్రీమియం తత్కాల్ టికెట్లు పూర్తిగా ఈ-టికెట్ల రూపంలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంటే వీటిని కేవలం ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారానే బుక్ చేయాలి. రైల్వే కౌంటర్ల వద్ద ఈ కోటా టికెట్లు లభించవు.

సీట్ క‌న్‌ఫ‌ర్మ్ అయితేనే టికెట్ జారీ..

ప్రీమియం తత్కాల్ కోటా వల్ల బ్లాక్ మార్కెట్ ద్వారా టికెట్లు దాచిపెట్టి అధిక ధరలకు విక్రయించే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. డైనమిక్ ప్రైసింగ్ విధానం కారణంగా అక్రమంగా టికెట్లు నిల్వ చేయడం లాభదాయకం కాదు. దీంతో టికెట్ ధరల విషయంలో ప్రయాణికులకు పారదర్శకత ఉంటుంది. మరో ముఖ్యమైన ప్రయోజనం కన్ఫర్మ్ టికెట్ లభించే అవకాశాలు పెరగడం. అన్ని రైళ్లలో ప్రీమియం తత్కాల్ అందుబాటులో ఉండకపోయినా, కొన్ని సాధారణ తత్కాల్ టికెట్లను ప్రీమియం తత్కాల్ కోటాకు మార్చడం వల్ల అత్యవసర ప్రయాణికులకు కన్ఫర్మ్ సీటు ల‌భిస్తుంది. సీట్ క‌న్‌ఫ‌ర్మ్ అయితేనే టికెట్ జారీ చేస్తారు. లేదంటే టికెట్ ఇవ్వ‌రు. ఈ విధంగా ప్ర‌యాణానికి ఒక రోజు ముందుగానే సీటు క‌న్‌ఫ‌ర్మ్ చేసుకోవచ్చు. టికెట్ ల‌భ్యం అవ‌క‌పోతే ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను చూసుకోవ‌చ్చు.

ఎలా బుక్ చేయాలి..

ప్రీమియం తత్కాల్ టికెట్ బుకింగ్ చాలా సులభం. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్‌ను సంద‌ర్శించి మీరు ప్ర‌యాణం చేయాల‌నుకునే రైలును వెద‌కాలి. అందులో ప్రీమియం త‌త్కాల్ ఉందా, లేదా చెక్ చేయాలి. ప్రీమియం త‌త్కాల్ ఉంటే రైలు బ‌య‌ల్దేర‌డానికి ఒక రోజు ముందు ఉద‌యం 10 గంట‌ల‌కు సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. అయితే ప్ర‌యాణికుల వివ‌రాల‌ను ముందుగానే ప్యాసింజ‌ర్ లిస్ట్‌లో చేర్చి ఉంటే టికెట్‌ను వేగంగా బుక్ చేయ‌వ‌చ్చు. దీంతో టికెట్ ల‌భించే అవ‌కాశాలు పెరుగుతాయి. రైలును వెదికిన త‌రువాత అందులో ప్ర‌యాణించాల‌నుకున్న త‌ర‌గ‌తిని ఎంచుకుని అక్క‌డే ఉండే ఆప్ష‌న్‌ల‌లో ప్రీమియం త‌త్కాల్ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. త‌రువాత టిక్కెట్‌ను బుక్ చేయాలి. ప్ర‌యాణికుల వివ‌రాల‌ను న‌మోదు చేసి పేమెంట్ మీద క్లిక్ చేసి చెల్లింపు పూర్తి చేయాలి. దీంతో టికెట్ బుక్ అవుతుంది. అయితే సీటు క‌న్‌ఫ‌ర్మ్ అయితేనే టికెట్ ఇష్యూ అవుతుంది క‌నుక బెంగ ఉండ‌దు. టికెట్ జారీ అయితే దాన్ని ప్రింట్ తీసుకోవ‌చ్చు. లేదా ఫోన్ ద్వారా రైలులో అధికారుల‌కు చూపించ‌వ‌చ్చు. ఇలా ప్రీమియం త‌త్కాల్ ప‌నిచేస్తుంది.

వీలైనంత త్వ‌ర‌గా బుక్ చేయాలి..

అయితే ప్రీమియం త‌త్కాల్‌లో డైన‌మిక్ ప్రైసింగ్ విధానం ఉంటుంది క‌నుక వీలైనంత త్వ‌ర‌గా టికెట్‌ను బుక్ చేసేందుకు య‌త్నించాలి. ఆలస్యం చేసే కొద్దీ ప్ర‌యాణికుల సంఖ్య ఎలాగూ పెరుగుతుంది క‌నుక మీరు ఆరంభంలో చూసిన టికెట్ ధ‌ర ల‌భ్యం కాక‌పోవ‌చ్చు. క‌నుక వేగంగా బుకింగ్ చేయాలి. చెల్లింపు పూర్తయిన తర్వాత ఈ-టికెట్‌ను ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా పంపిస్తారు. ప్రయాణానికి అవసరమైన అన్ని వివరాలు అందజేస్తారు. ఏవైనా సందేహాలు లేదా సహాయం అవసరమైతే వెబ్‌సైట్ లేదా యాప్‌లో ఉండే కాంటాక్ట్ వివ‌రాల ద్వారా అధికారుల‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు. అయితే క‌చ్చితంగా ప్ర‌యాణం చేస్తామ‌నుకుంటేనే ఈ టికెట్ల‌ను కొనాలి. రీఫండ్ ఇవ్వ‌రు క‌నుక ఈ విష‌యాన్ని ప్ర‌యాణికులు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.

వెయిటింగ్ లిస్ట్ ఉండ‌దు, రీఫండ్ ఇవ్వ‌రు..

ప్రీమియం తత్కాల్ టికెట్ బుక్ చేసే ముందు ప్రతి ప్రయాణికుడు కొన్ని ముఖ్యమైన నిబంధనలు తెలుసుకోవాలి. తద్వారా చివరి నిమిషంలో ఇబ్బందులు ఎదురుకావు. బుకింగ్ సమయంలో చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ గుర్తింపు కార్డును తప్పనిసరిగా ఇవ్వాలి. అదే గుర్తింపు కార్డును ప్రయాణ సమయంలో కూడా వెంట తీసుకెళ్లాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు పత్రాల‌ను అంగీకరిస్తారు. ప్రీమియం తత్కాల్‌లో వెయిటింగ్ లిస్ట్ ఉండదు. మీకు నేరుగా కన్ఫర్మ్ సీటు లభిస్తుంది లేదా బుకింగ్ విఫలమవుతుంది. దీంతో టికెట్ స్థితిపై వెంటనే స్పష్టత వస్తుంది. కన్ఫర్మ్ అయిన ప్రీమియం తత్కాల్ టికెట్‌ను రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ లభించదు. అయితే భారతీయ రైల్వేలు రైలును రద్దు చేసినా లేదా గణనీయంగా ఆలస్యమైనా మాత్రమే రీఫండ్ అందుతుంది.

యాప్ లేదా సైట్ ద్వారా మాత్ర‌మే..

ప్రీమియం తత్కాల్ టికెట్లను కేవలం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా మాత్రమే బుక్ చేయాలి. రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో ఈ కోటా టికెట్లు అందుబాటులో ఉండవు. డైనమిక్ ప్రైసింగ్ కారణంగా ఉదయం 10 గంటలకు బుకింగ్ ప్రారంభమైన వెంటనే టికెట్ బుక్ చేస్తే తక్కువ ధరలో లభించే అవకాశం ఉంటుంది. బుకింగ్‌లు పెరుగుతున్న కొద్దీ టికెట్ ధర కూడా క్రమంగా పెరుగుతుంది. అందువల్ల క‌చ్చితంగా ఉదయం 10 గంటలకే లాగిన్ అయి బుకింగ్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.

Advertisement
Advertisement