త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Family Pension | ఫ్యామిలీ పెన్షన్‌పై కేంద్రం కీలక స్పష్టత.. ఎవరికి ఎంత ఆదాయ పరిమితి?

Family Pension | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ మరణించిన తర్వాత కుటుంబ పెన్షన్ ఎవరికి లభిస్తుంది? అర్హత పొందాలంటే ఎంత ఆదాయం ఉండాలి? ఆర్థికంగా ఎవరిపై ఆధారపడినట్లు నిరూపించుకోవాలి? అనే అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. చట్టబద్ధమైన భార్య లేదా భర్తకు ఎలాంటి ఆదాయ పరిమితి లేకుండానే కుటుంబ పెన్షన్ పొందే అవకాశం ఉండగా, ఇతర కుటుంబ సభ్యులకు ఆదాయం, ఆర్థిక ఆధారపడడం వంటి నిబంధనలు వర్తిస్తాయి.

S

Business | Published On Nov 14, 2026, 4.45 pm IST

Family Pension | ఫ్యామిలీ పెన్షన్‌పై కేంద్రం కీలక స్పష్టత.. ఎవరికి ఎంత ఆదాయ పరిమితి?
Advertisement

Family Pension | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ మరణించిన తర్వాత కుటుంబ పెన్షన్ ఎవరికి లభిస్తుంది? అర్హత పొందాలంటే ఎంత ఆదాయం ఉండాలి? ఆర్థికంగా ఎవరిపై ఆధారపడినట్లు నిరూపించుకోవాలి? అనే అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. చట్టబద్ధమైన భార్య లేదా భర్తకు ఎలాంటి ఆదాయ పరిమితి లేకుండానే కుటుంబ పెన్షన్ పొందే అవకాశం ఉండగా, ఇతర కుటుంబ సభ్యులకు ఆదాయం, ఆర్థిక ఆధారపడడం వంటి నిబంధనలు వర్తిస్తాయి.

అర్హ‌త ఎలా వ‌స్తుంది..?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ మరణించిన తర్వాత కుటుంబ పెన్షన్ పొందేందుకు కుటుంబ సభ్యులందరికీ ఆటోమేటిక్‌గా అర్హత లభించదు. మరణించిన వ్యక్తితో ఉన్న బంధుత్వం, వారి ఆదాయం, ఆర్థికంగా వారిపై ఆధారపడి ఉన్నారా లేదా అనే అంశాల ఆధారంగా అర్హతను నిర్ణయిస్తారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్) ఆదాయ పరిమితులు, ఆర్థిక ఆధారపడే నిబంధనలపై వివరణ ఇచ్చింది. చట్టబద్ధంగా వివాహమైన భార్య లేదా భర్తకు కుటుంబ పెన్షన్ పొందేందుకు ఎలాంటి ఆదాయ పరిమితి ఉండదని స్పష్టం చేసింది. అయితే, పిల్లలు లేని పునర్వివాహం చేసుకున్న వితంతువులు, అవివాహిత, వితంతు, విడాకులు పొందిన కుమార్తెలు, ఆధారపడిన తల్లిదండ్రులు, మానసిక లేదా శారీరక వైకల్యం ఉన్న పిల్లలు, తోబుట్టువులకు ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి.

ఆదాయం ఎంత క‌న్నా త‌క్కువ‌గా ఉండాలి..?

ఇతర అర్హులైన కుటుంబ సభ్యులు, పిల్లలు లేని పునర్వివాహిత వితంతువులు నెలకు రూ.9వేల కంటే తక్కువ ఆదాయం కలిగి ఉండాలి. కుటుంబ పెన్షన్, దానికి వర్తించే డియర్‌నెస్ రిలీఫ్‌ను ఈ ఆదాయ లెక్కింపులో పరిగణనలోకి తీసుకోరు. ప్రస్తుతం ఇదే కనీస కుటుంబ పెన్షన్ మొత్తంగా ఉంది. మానసిక లేదా శారీరక వైకల్యం ఉన్న పిల్లలు, తోబుట్టువుల విషయంలో ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం (కుటుంబ పెన్షన్ మినహాయించి) వారికి అర్హతగా లభించే కుటుంబ పెన్షన్ కంటే తక్కువగా ఉండాలి. ప్రస్తుతం ఈ పెన్షన్ ఉద్యోగి వేతనంలో 30 శాతంతోపాటు వర్తించే డియర్‌నెస్ రిలీఫ్‌కు సమానంగా ఉంటుంది.

అయితే, ఆదాయ పరిమితులను పాటించడం మాత్రమే కొన్ని సందర్భాల్లో సరిపోదు. మరణించిన ఉద్యోగి లేదా పెన్షనర్ జీవించి ఉన్న సమయంలో తాము వారిపై ఆర్థికంగా ఆధారపడి ఉన్నామని కూడా కొందరు కుటుంబ సభ్యులు నిరూపించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అవివాహిత, వితంతు లేదా విడాకులు పొందిన కుమార్తెలు తల్లిదండ్రులు జీవించి ఉన్న సమయంలో వారిపై ఆర్థికంగా ఆధారపడి ఉన్నట్లు నిరూపించాలి. ఈ నిబంధనల ద్వారా కుటుంబ పెన్షన్ క్లెయిమ్‌ల పరిశీలనలో ఆదాయం, ఆర్థిక ఆధారపడడం కీలక అంశాలుగా ఉంటాయని కేంద్ర శాఖ స్పష్టం చేసింది.

Advertisement
Advertisement