త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttam Kumar Reddy | ప్రతి నీటి బొట్టుకు జియో ట్యాగింగ్

న్యూఢిల్లీ వేదికగా జరిగిన కేంద్ర జలశక్తి సదస్సులో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రతిపాదనలు చేశారు. జల సంరక్షణలో ఏఐ వాడకాన్ని నొక్కిచెప్పారు.

J

Telangana | Published On Sep 2, 2026, 6.57 pm IST

Uttam Kumar Reddy | ప్రతి నీటి బొట్టుకు జియో ట్యాగింగ్
Advertisement
  • న్యూఢిల్లీలో జరిగిన తొలి 'జల్ సంచయ్–జన్ భాగీదారీ' సదస్సులో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • జల సంరక్షణ పనులకు ప్రత్యేక జియో ట్యాగింగ్, ఏఐ టెక్నాలజీ వాడాలని కేంద్రానికి సూచన
  • రాబోయే మూడేళ్లలో రూ.46,110 కోట్లతో 17.28 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా రాష్ట్ర ప్రభుత్వ భారీ యాక్షన్ ప్లాన్
  • ప్రాజెక్టుల్లో పూడికతీత, ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల సడలింపులో కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి

Uttam Kumar Reddy | త్రినేత్ర.న్యూస్ : దేశ రాజధాని న్యూఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్ వేదికగా సెప్టెంబర్ 2న జరిగిన 'జల్ సంచయ్–జన్ భాగీదారీ' (Jal Sanchay-Jan Bhagidari) సదస్సులో తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా సాగే జల సంరక్షణ పనులన్నీ ఒకే గొడుగు కిందకు రావాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో నీటి నిర్వహణ చేపట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సును 'టీమ్ ఇండియా' వేదికగా ఆయన అభివర్ణించారు.

జాతీయ జలభద్రతకు 'ఏఐ' పవర్

నీటి భద్రత అనేది కేవలం ఇంజనీర్ల బాధ్యత కాదని, అది వ్యవసాయ స్థిరత్వానికి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఒక పెద్ద ప్రజా ఉద్యమంలా మారాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి జల సంరక్షణ ఆస్తికి జియో ట్యాగింగ్ (Geo-tagging) చేసి, ప్రత్యేక ఐడీ కేటాయించాలన్నారు. ఎన్ని చెరువులు, ప్రాజెక్టులు కట్టామన్నది కాదు.. ఎంత నీరు నిల్వ చేశాం, భూగర్భ జలాలు ఎంత పెరిగాయన్నదే అసలైన కొలమానం కావాలని ఆయన బలంగా వినిపించారు. ఏఐ టెక్నాలజీ సహాయంతో వర్షపాతం, నదీ ప్రవాహాలను పక్కాగా అంచనా వేయొచ్చని సూచించారు.

తెలంగాణ రికార్డ్.. రూ.46 వేల కోట్లతో యాక్షన్ ప్లాన్

2025లో జరిగిన జల్ సంచయ్ ప్రోగ్రామ్‌లో దేశంలోని టాప్ 50 జిల్లాల్లో 13 మన తెలంగాణవే కావడం గర్వకారణమన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 22,428 జలవనరుల పునరుద్ధరణ పూర్తయిందని తెలిపారు. రాబోయే 2026-29 మూడేళ్లలో రూ. 46,110 కోట్ల భారీ బడ్జెట్‌తో 17.28 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పక్కా యాక్షన్ ప్లాన్ (Action Plan) సిద్ధం చేసిందని వెల్లడించారు. ఇందులో భాగంగా మిగిలిన భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం వేగవంతం చేయనున్నట్లు స్పష్టం చేశారు.

పూడికతీతకు సై.. కేంద్రం సాయం తప్పనిసరి

తెలంగాణలోని ప్రధాన జలాశయాల్లో దాదాపు 22.95 శాతం నీటి నిల్వ సామర్థ్యాన్ని పూడిక వల్లే కోల్పోయామని అధ్యయనాల్లో తేలిందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని లోయర్ మానేరు, మిడ్ మానేరు, కడెం ప్రాజెక్టుల్లో పైలట్ ప్రాజెక్టుగా (Pilot Project) పూడికతీత పనులు ప్రారంభించామన్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్, జూరాల వంటి ప్రాజెక్టుల్లోనూ అమలు చేస్తామన్నారు.

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి కృషి సించాయీ యోజన (PMKSY) కింద ఆర్థిక సాయం అందించాలని ఉత్తమ్ కోరారు. ఎఫ్‌ఆర్‌బీఎం (FRBM) పరిమితులను సడలించడంతో పాటు పర్యావరణ అనుమతులను త్వరగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జల సంరక్షణలో తెలంగాణ మోడల్‌ను ఇతర రాష్ట్రాలతో పంచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి ప్రకటించారు.

Advertisement