త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tiger Shroff Firing | టైగర్ ష్రాఫ్ కారు కాల్పుల కేసులో సంచలన నిజాలు.. నేపాల్‌కు పారిపోవాలని నిందితుల ప్లాన్

టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిపి పరారవుతున్న నిందితులు నేపాల్‌కు పారిపోవాలని ప్లాన్ చేసినట్లు కోటా పోలీసులు వెల్లడించారు. విచారణలో వెలుగులోకి వచ్చిన కీలక విషయాలు ఇవే.

J

National | Published On Oct 19, 2026, 2.47 pm IST

Tiger Shroff Firing | టైగర్ ష్రాఫ్ కారు కాల్పుల కేసులో సంచలన నిజాలు.. నేపాల్‌కు పారిపోవాలని నిందితుల ప్లాన్

సంక్షిప్త సారాంశం

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటనకు పాల్పడిన ముగ్గురు నిందితులు ఢిల్లీ మీదుగా నేపాల్‌కు పారిపోవడానికి ప్లాన్ చేసినట్లు రాజస్థాన్ కోటా ఎస్పీ తేజస్విని గౌతమ్ వెల్లడించారు. ముంబై పోలీసుల నుంచి సమాచారం అందిన కేవలం 15 నిమిషాల్లోనే కోటా పోలీసులు పుణె-జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో వలపన్ని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితుల్లో ఒకరైన రెహాన్‌కు.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న అనిల్ పండిత్‌తో టచ్‌లో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసులో హర్యానాకు చెందిన రెహాన్, బీహార్‌కు చెందిన హ్రితిక్ కుర్మి అలియాస్ రోషన్, ఒక మైనర్‌ను అరెస్ట్ చేయగా, త్వరలోనే వారిని ముంబై పోలీసులకు అప్పగించనున్నారు.

Advertisement

Tiger Shroff Firing | త్రినేత్ర న్యూస్ : బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి రాజస్థాన్‌లోని కోటాలో అరెస్టయిన ముగ్గురు నిందితుల గురించి పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడులకు పాల్పడిన నిందితులు దేశం విడిచి నేపాల్‌కు పారిపోవడానికి ప్లాన్ వేసినట్లు కోటా ఎస్పీ తేజస్విని గౌతమ్ సోమవారం తెలిపారు.

15 నిమిషాల్లోనే ట్రాప్ చేసి పట్టుకున్న పోలీసులు

సోమవారం ఉదయం నిందితుల కదలికలపై సమాచారం అందిన వెంటనే కోటా సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితులు రైలులో కోటా వైపు వస్తున్నట్లు గుర్తించి, కేవలం 15 నిమిషాల్లోనే ఒక ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. పుణె-జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తున్న నిందితులను పోలీసులు అత్యంత చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టయిన ముగ్గురు నిందితులను హర్యానాలోని సోనిపట్‌కు చెందిన రెహాన్ అలియాస్ సుక్కా (18), బీహార్‌లోని బెగుసరాయ్‌కు చెందిన, గత కొన్నేళ్లుగా ముంబైలో ర్యాపిడో రైడర్‌గా పనిచేస్తున్న హ్రితిక్ కుర్మి అలియాస్ రోషన్ (22), అలాగే 17 ఏళ్ల మైనర్‌గా పోలీసులు గుర్తించారు.

ఢిల్లీ మీదుగా నేపాల్‌కు చెక్కేయాలని ప్లాన్

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. ముంబైలో కాల్పులు జరిపిన అనంతరం ఈ నిందితులు ఎలాగైనా ఢిల్లీకి చేరుకుని, అక్కడి నుంచి నేపాల్ సరిహద్దు దాటి పరారవ్వాలని పథకం పన్నారట. అయితే కాల్పులకు ఉపయోగించిన ఆయుధాలు ఇంకా లభించలేదని, నిందితులను మరింత విచారించి ఆయుధాలు ఎక్కడ దాచారో రాబడతామని ఎస్పీ తెలిపారు.

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో లింక్స్?

ఈ కేసులో మరో కీలక కోణం కూడా బయటపడింది. అరెస్టయిన నిందితుల్లో ఒకడైన రెహాన్‌కు.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలున్న అనిల్ పండిత్ అనే వ్యక్తితో నిరంతరం కాంటాక్ట్ ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కాల్పుల వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందనే అనుమానంతో పోలీసులు ఈ కోణంలోనూ లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

నిందితులు ముంబైలో టైగర్ ష్రాఫ్ రొటీన్‌పై పక్కాగా రెక్కీ నిర్వహించి దాడి చేసి.. ఆ తర్వాత అంధేరి వెస్ట్ రైల్వే స్టేషన్ వద్ద బైక్‌ను వదిలేసి పరారయ్యారని దర్యాప్తులో తేలింది. కోటా పోలీసుల అదుపులో ఉన్న ఈ ముగ్గురిని త్వరలోనే కస్టడీ నిమిత్తం ముంబై పోలీసులకు అప్పగించనున్నారు. ముంబై పోలీసుల రాకతో ఈ కేసుకు సంబంధించి మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Advertisement
Advertisement