త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NEET 2026 Winners | ఒకే ఇంట్లో ముగ్గురు నీట్ విజేతలు.. ఆద‌ర్శంగా నిలుస్తున్న తోబుట్టువులు

NEET 2026 Winners | బీహార్ (Bihar) రాష్ట్రం స‌హ‌ర్సా (Saharsa)లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తోబుట్టువులు నీట్ ప‌రీక్ష‌లో విజేత‌లుగా నిలిచారు. కుటుంబం ఆర్థిక ప‌రిస్థితి అంతంత‌మాత్రంగానే ఉన్నా.. క‌ష్ట‌ప‌డి చ‌ద‌వి నీట్ పరీక్షలో (NEET 2026 Winners) అత్యుత్తమ ర్యాంకులు సాధించారు.

D

National | Published On Jul 18, 2026, 5.05 pm IST

NEET 2026 Winners | ఒకే ఇంట్లో ముగ్గురు నీట్ విజేతలు.. ఆద‌ర్శంగా నిలుస్తున్న తోబుట్టువులు
Advertisement

NEET 2026 Winners | సంక‌ల్పం, ప‌ట్టుద‌ల ఉంటే సాధించ‌నిదంటూ ఏదీ ఉండ‌దు. పట్టుదలతో శ్రమిస్తే అసాధ్యమైనది కూడా సుసాధ్యం చేయొచ్చ‌ని నిరూపించారు ముగ్గురు తోబుట్టువులు. కుటుంబం ఆర్థిక ప‌రిస్థితి అంతంత‌మాత్రంగానే ఉన్నా.. క‌ష్ట‌ప‌డి చ‌ద‌వి నీట్ పరీక్షలో (NEET 2026 Winners) అత్యుత్తమ ర్యాంకులు సాధించారు.

బీహార్ (Bihar) రాష్ట్రం స‌హ‌ర్సా (Saharsa)లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తోబుట్టువులు నీట్ ప‌రీక్ష‌లో విజేత‌లుగా నిలిచారు. రజనీష్ కుమార్, సాక్షి కుమారి, ప్రహ్లాద్ కుమార్ నీట్ 2026 ప‌రీక్ష‌లో వ‌రుసగా 3122, 9672, 26751 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించి అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. వీరి తండ్రి రోహిత్ ఆనంద్ చిన్న కిరాణా దుకాణం పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయ‌న‌కు ముగ్గురు సంతానం (ఒక ఆడ‌పిల్ల‌, ఇద్ద‌రు మ‌గ‌పిల్ల‌లు). ముగ్గురికీ డాక్ట‌ర్ అవ్వాల‌నే క‌ల ఉంది. అయితే, ఢిల్లీ, కోటా వంటి న‌గ‌రాల్లోని ఖ‌రీదైన కోచింగ్ సెంట‌ర్ల‌లో చేర్పించే స్తోమ‌త ఆ కుటుంబానికి లేదు. దీంతో వారు ముగ్గురూ స్థానికంగా ఉన్న చిన్న కోచింగ్ సెంట‌ర్‌లో చేరి స‌మ‌యాన్ని చ‌క్క‌గా స‌ద్వినియోగం చేసుకున్నారు.

రోజుకు 10 నుంచి 13 గంటల పాటు కఠినంగా శ్రమించారు. ముగ్గురూ ఒక‌రికి తెలియ‌ని అంశాల‌ను మ‌రొక‌రితో చ‌ర్చిస్తూ, సందేహాల‌ను నివృత్తి చేసుకుంటూ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయ్యారు. ఇటీవ‌లే వెల్ల‌డైన నీట్ ఫ‌లితాల్లో ముగ్గురూ విజేత‌లుగా నిలిచి.. డాక్ట‌ర్ అవ్వాల‌న్న త‌మ క‌ల‌కు బాట‌లు వేసుకున్నారు. రజనీష్, సాక్షిలు తమ మూడో ప్రయత్నంలో ర్యాంక్ సాధించగా, ప్రహ్లాద్ తొలి ప్రయత్నంలోనే ఈ విజయం సొంతం చేసుకోవ‌డం విశేషం. త‌మ విజ‌యానికి త‌ల్లిదండ్రులే కార‌ణ‌మ‌ని ఆ ముగ్గురు తోబుట్టువులు తెలిపారు. ఒత్తిడికి గురైన‌ప్పుడ‌ల్లా త‌ల్లిదండ్రులు ప్రోత్స‌హించార‌ని.. వారి మ‌ద్ద‌తు, విశ్వాస‌మే త‌మ‌ను విజ‌య తీరాల‌కు చేర్చింద‌ని చెప్పుకొచ్చారు. అనుకున్న‌ది సాధించాలంటే.. మంచి మంచి కోచింగ్ సెంట‌ర్ల‌లోనే చేరాల్సిన ప‌నిలేద‌ని ఈ ముగ్గురూ నిరూపించారు. క‌ష్ట‌ప‌డే త‌త్వం, క‌ల‌ల‌ను సాకారం చేసుకోవాల‌నే సంక‌ల్పం ఉంటే ఎక్క‌డ చ‌దివినా విజ‌యం సాధించొచ్చ‌ని నిరూపించారు.

Also Read..

పోస్టాఫీస్‌లో మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేకంగా అందుబాటులో ఉన్న సేవింగ్స్ ఖాతా.. దీని ప్ర‌త్యేక‌త‌లు ఇవే..

పోస్టాఫీస్‌లో మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేకంగా అందుబాటులో ఉన్న సేవింగ్స్ ఖాతా.. దీని ప్ర‌త్యేక‌త‌లు ఇవే..

చేతిలో గాజుల బుట్టతో మంత్రి పొన్నం.. బీసీ వృత్తికారులకు సర్కార్ అభయం!

Advertisement
Advertisement