త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jairam Ramesh | భారత విదేశాంగ మంత్రి పర్యటనను అమెరికా ప్రకటిస్తదా?

విదేశాంగ మంత్రి జైశంకర్ ముంబై పర్యటనను అమెరికా రాయబారి ప్రకటించడంపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ తీవ్రంగా మండిపడ్డారు. భారత విదేశాంగ శాఖ మౌనంపై నిలదీశారు.

J

National | Published On Oct 15, 2026, 5.06 pm IST

Jairam Ramesh | భారత విదేశాంగ మంత్రి పర్యటనను అమెరికా ప్రకటిస్తదా?

సంక్షిప్త సారాంశం

అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ముంబై పర్యటన సందర్భంగా.. కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్ కూడా అక్కడ సమావేశంలో పాల్గొంటారని అమెరికా రాయబారి ప్రకటించడం రాజకీయంగా కలకలం రేపింది. భారత విదేశాంగ మంత్రి అధికారిక షెడ్యూల్‌ను మన దేశ విదేశాంగ శాఖ (MEA) ప్రకటించకుండా, అమెరికా రాయబారి ప్రకటించడమేంటి అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ప్రశ్నించారు. 'ఆపరేషన్ సిందూర్' ఆపివేతను కూడా అమెరికా అధికారులే మొదట వెల్లడించారని గుర్తుచేసిన ఆయన, ఈ విషయంలో MEA ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు.

Advertisement
  • మోదీ ప్రభుత్వంపై జైరామ్ రమేష్ తీవ్ర ఆగ్రహం

Jairam Ramesh | త్రినేత్ర న్యూస్ : అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో (Marco Rubio) త్వరలో ముంబైలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి అమెరికా రాయబారి కొన్ని వివరాలు వెల్లడించగా, అందులో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా ఆ సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. అయితే, ఒక భారతీయ కేబినెట్ మంత్రి, అందునా విదేశాంగ మంత్రి పర్యటన వివరాలను మన దేశ అధికారిక ప్రతినిధికి బదులుగా అమెరికా రాయబారి ప్రకటించడం ఏంటని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది.

కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ (కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్), ఎంపీ జైరామ్ రమేష్ సోషల్ మీడియా వేదికగా మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. భారత్ స్వయంప్రతిపత్తిని దెబ్బతీసేలా ఈ పరిణామాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.

జైరామ్ రమేష్ ఎమన్నారంటే?

ఈ వ్యవహారంపై ఎక్స్ (X) వేదికగా స్పందించిన జైరామ్ రమేష్.. "అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో త్వరలో ముంబైలో పర్యటించనున్నట్లు ఆ దేశ రాయబారి మరిన్ని వివరాలు వెల్లడించడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. అలాగే రూబియో భారత్ ప్రభుత్వ అధికారులను ముంబైలో కలుస్తారని చెప్పడంలోనూ వింతేమీ లేదు. కానీ, 'మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ కూడా మరికొందరితో కలిసి అక్కడ మాతో చేరతారని మేము ఆశిస్తున్నాము' అని అమెరికా రాయబారి చెప్పడమే అత్యంత అసాధారణమైన విషయం" అని పేర్కొన్నారు.

భారతదేశంలో జరిగే విదేశాంగ మంత్రి అధికారిక సమావేశాల ప్రకటనను విదేశాంగ శాఖ (MEA) అధికార ప్రతినిధి కాకుండా, వేరే దేశానికి చెందిన వ్యక్తులు చేయడం ఎప్పటి నుంచి మొదలైందని ఆయన ఎద్దేవా చేశారు.

'ఆపరేషన్ సింధూర్' ఉదంతాన్ని గుర్తుచేస్తూ విమర్శలు

గతంలో 'ఆపరేషన్ సింధూర్' (Operation Sindoor) నిలిపివేత విషయాన్ని కూడా తొలిసారి మార్కో రూబియో ద్వారానే ప్రపంచం తెలుసుకుందని జైరామ్ రమేష్ గుర్తుచేశారు. ఇప్పుడు సరిగ్గా అలాగే, మన విదేశాంగ మంత్రి జైశంకర్ ముంబై పర్యటన, మార్కో రూబియోతో భేటీ అంశంపై కూడా మన MEA నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

"విదేశాంగ మంత్రి జైశంకర్, మార్కో రూబియోల ముంబై భేటీపై మన విదేశాంగ శాఖ ఎందుకు మౌనంగా ఉంది?" అని జైరామ్ రమేష్ నేరుగా ప్రభుత్వాన్ని నిలదీశారు. దౌత్యపరమైన ప్రోటోకాల్‌ను విస్మరించి, కీలకమైన విషయాలను విదేశీ శక్తుల ద్వారా భారతీయులు తెలుసుకోవాల్సి వస్తోందంటూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Advertisement
Advertisement