త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Flights Cancelled | మ‌రో వారం రోజులు.. సౌదీ అరేబియాకు భార‌త విమాన స‌ర్వీసులు ర‌ద్దు

Flights Cancelled | విమానాశ్ర‌యాలే ల‌క్ష్యంగా హౌతీ తిరుగుబాటుదారులు (Houthi Rebels) దాడుల‌కు పాల్ప‌డుతుండ‌టంతో సౌదీ అరేబియాలో (Saudi Arabia) తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతున్నాయి. ప్ర‌యాణికుల భ‌ద్ర‌త దృష్ట్యా భార‌త్‌, సౌదీ మ‌ధ్య న‌డిచే విమాన స‌ర్వీసుల‌ను (Flights Cancelled) దేశీయ విమాన‌యాన సంస్థ‌లు ఇప్ప‌టికే ర‌ద్దు చేశాయి.

G

National | Published On Oct 17, 2026, 8.24 am IST

Flights Cancelled | మ‌రో వారం రోజులు.. సౌదీ అరేబియాకు భార‌త విమాన స‌ర్వీసులు ర‌ద్దు
Advertisement

Flights Cancelled | త్రినేత్ర న్యూస్‌: విమానాశ్ర‌యాలే ల‌క్ష్యంగా హౌతీ తిరుగుబాటుదారులు (Houthi Rebels) దాడుల‌కు పాల్ప‌డుతుండ‌టంతో సౌదీ అరేబియాలో (Saudi Arabia) తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతున్నాయి. ప్ర‌యాణికుల భ‌ద్ర‌త దృష్ట్యా భార‌త్‌, సౌదీ మ‌ధ్య న‌డిచే విమాన స‌ర్వీసుల‌ను (Flights Cancelled) దేశీయ విమాన‌యాన సంస్థ‌లు ఇప్ప‌టికే ర‌ద్దు చేశాయి. సౌదీలో ప్ర‌ధాన న‌గ‌రాలైన రియాద్‌, జెడ్డా, ద‌మ్మామ్‌, మ‌దీనా న‌గ‌రాల‌కు విమాన స‌ర్వీసుల‌ను మ‌రో వారం రోజుల‌పాటు ర‌ద్దు చేశాయి. ఈ మేర‌కు ఇండిగో (IndiGo), ఆకాశ ఎయిర్ (Akasa Air), ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్ర‌క‌టించాయి. రియాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంతోపాటు (Riyadh Airport) సౌదీ అరేబియాపై డ్రోన్లు, క్షిప‌ణుల‌తో దాడులు జ‌రుగుతుండ‌టంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించాయి. అయితే ఇండిగో, ఆకాశ ఎయిర్ తమ విమానాలను అక్టోబర్ 24 వరకు ర‌ద్దు చేయ‌గా, ఎయిర్ ఇండియా (Air India Group) గ్రూప్ ఈ నెల‌ 20 వరకు పొడిగించింది. హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణి దాడులు చేయడంతో అక్టోబర్ 17 వరకు త‌మ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు గ‌తంలో ప్రకటించిన విష‌యం తెలిసిందే.

మారుతున్న పరిస్థితులు..

సౌదీ అరేబియాలో మారుతున్న పరిస్థితులను నిశితంగా పరిశీలించిన తర్వాత, రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా నగరాలకు వచ్చివెళ్లే విమానాలను అక్టోబర్ 24 వరకు రద్దు చేస్తున్నామ‌ని ఇండిగో వెల్ల‌డించింది. బుకింగ్ సమయంలో ఇచ్చిన వివరాల ఆధారంగా బాధితులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామ‌ని తెలిపింది. ఇండిగో సంస్థ ఢిల్లీ, హైదరాబాద్, ముంబై నుంచి రియాద్‌కు విమానాలను నడుపుతున్న‌ది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా, రియాద్‌కు అన్ని విమాన స‌ర్వీసుల‌ను అక్టోబర్ 24 వరకు నిలిపివేస్తున్నామ‌ని ఆకాశ ఎయిర్ తెలిపింది. అలాగే జెడ్డా సర్వీసులను ఈ నెల 21 వరకు ర‌ద్దుచేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.

అక్టోబర్ 20 వరకు..

టాటా గ్రూప్‌న‌కు చెందిన ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కూడా తమ విమాన సర్వీసులను అక్టోబర్ 20 వరకు నిలిపివేశాయి. ప్రాంతీయ పరిస్థితుల దృష్ట్యా దమ్మామ్, జెడ్డా, రియాద్‌లకు ఈ నెల‌ 20 వరకు విమానాలను రద్దు చేసిన‌ట్లు భారత్ నుంచి గల్ఫ్ ప్రాంతానికి అత్యధిక సర్వీసులు నడిపే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) తెలిపింది. కోజికోడ్ నుంచి రియాద్‌కు రోజువారీ విమానాలను, బెంగళూరు, కొచ్చి, కన్నూర్ నుంచి వారానికి మూడు విమానాలను ఈ సంస్థ‌ నడుపుతుంది. ఇక‌ బెంగళూరు, మంగళూరు, ఢిల్లీ నుంచి దమ్మామ్‌కు.. కోజికోడ్, మంగళూరు, బెంగళూరు నుంచి జెడ్డాకు సర్వీసులు అందిస్తున్న‌ది.

సౌదీ అరేబియాలో మారుతున్న పరిస్థితుల వల్ల రియాద్, దమ్మామ్, జెడ్డాలకు నడిచే అన్ని ఎయిర్ ఇండియా (Air India) విమానాలు అక్టోబర్ 20 వరకు రద్దయ్యాయ‌ని ఆ సంస్థ ప్ర‌తినిధి వెల్ల‌డించారు. తాము పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామ‌ని, భద్రతా ప్రమాణాలను పరిశీలించిన తర్వాతే సర్వీసులను పునరుద్ధరిస్తామ‌ని చెప్పారు. దీనివ‌ల్ల ప్రభావితమైన ప్రయాణికులకు డబ్బులు తిరిగి చెల్లిస్తామ‌ని వెల్లడించారు.

Advertisement
Advertisement