త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AI | డాక్టర్లను మించేసిన ఏఐ.. వైద్య రంగంలో కొత్త మైలురాయి..

AI | ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇప్ప‌టికే అనేక రంగాల్లో మ‌నుషుల‌కు దీటుగా ఎన్నో ప‌నుల‌ను క్ష‌ణాల్లో నిర్వ‌హిస్తోంది. దీంతో రానున్న రోజుల్లో చాలా మంది ఉద్యోగాల‌ను కోల్పోతార‌ని ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతుండ‌గా తాజాగా ఏఐ వైద్యుల‌కు స‌హాయం చేసే క్లినిక‌ల్ అసిస్టెంట్‌గా కూడా మారనుంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

S

Lifestyle | Published On Jun 18, 2026, 5.17 pm IST

AI | డాక్టర్లను మించేసిన ఏఐ.. వైద్య రంగంలో కొత్త మైలురాయి..
Advertisement

AI | ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇప్ప‌టికే అనేక రంగాల్లో మ‌నుషుల‌కు దీటుగా ఎన్నో ప‌నుల‌ను క్ష‌ణాల్లో నిర్వ‌హిస్తోంది. దీంతో రానున్న రోజుల్లో చాలా మంది ఉద్యోగాల‌ను కోల్పోతార‌ని ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతుండ‌గా తాజాగా ఏఐ వైద్యుల‌కు స‌హాయం చేసే క్లినిక‌ల్ అసిస్టెంట్‌గా కూడా మారనుంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఆ రోజు ఎంతో దూరంలో లేద‌ని నిపుణులు అంటున్నారు. ప్ర‌ముఖ శాస్త్రీయ జ‌ర్న‌ల్ నేచ‌ర్‌లో ప్ర‌చురిత‌మైన అధ్య‌య‌నం ప్ర‌కారం ఇటీవ‌ల ఏఐ ని వైద్య రంగంలో ప‌లు విభాగాల్లో ఉప‌యోగించి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, వైద్యుల‌కు దీటుగా సేవ‌లు అందించిన‌ట్లు తేలింది. వైద్య వ్య‌వ‌స్థ‌లు నిర్దారించ‌లేని కొన్ని వ్యాధుల‌ను సైతం ఏఐ నిర్దారించింద‌ని, అలాగే చికిత్స ప్ర‌ణాళిక ప‌నుల్లో వైద్యుల‌కు స‌మానంగా, కొన్ని సంద‌ర్భంగాల్లో వైద్యుల క‌న్నా మెరుగ్గా ఏఐ ప‌నిచేసింద‌ని వెల్ల‌డైంది. వైద్య స‌మాచారాన్ని విశ్లేషించ‌డంతోపాటు న‌మూనాల‌ను గుర్తించ‌డం, శాస్త్రీయ ఆధారాల స‌హాయంతో చికిత్స అందించ‌డం త‌దిత‌ర ప‌నుల్లో ఏఐ స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేసింద‌ని సైంటిస్టుల అధ్య‌య‌నాల్లో తేలింది.

మిరా, అమీ ఏఐ వ్య‌వ‌స్థ‌ల‌తో..

సైంటిస్టులు చేప‌ట్టిన ఈ అధ్య‌యనాల్లో మిరా అనే ఏఐ వ్య‌వ‌స్థను ఉప‌యోగించారు. ఇది వైద్య రంగంలో అత్య‌వ‌స‌ర విభాగాలకు చెందిన ఎల‌క్ట్రానిక్ హెల్త్ రికార్డుల‌ను ప‌రిశీలించింది. వాటి స‌హాయంతో రోగాల‌ను నిర్దారించ‌డంలో వైద్యుల‌కు స‌హాయం చేసింది. దీంతో సంప్ర‌దాయ రోగ నిర్దార‌ణ క‌న్నా చాలా త‌క్కువ స‌మ‌యంలోనే వైద్యులు రోగాన్ని నిర్దారించి చికిత్స చేయ‌గ‌లిగారు. అలాగే టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ అభివృద్ధి చేసిన అమీ అనే మెడిక‌ల్ చాట్ బాట్ ఏఐ చికిత్స ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించే విష‌యంలో మెరుగైన ప‌నితీరును క‌న‌బ‌రిచింది. ఇది క్లినిక‌ల్ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న సూచ‌న‌లు ఇచ్చింది. అయితే సైంటిస్టులు, వైద్య నిపుణులు ఈ ఫ‌లితాల‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశ‌లించాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. ఈ ప‌రీక్ష‌ల‌ను ల్యాబ్‌ల‌లో నియంత్రిత ప‌రిస్థితుల్లో నిర్వ‌హిస్తారు. వాస్త‌వ ప్ర‌పంచంలో వైద్య సేవ‌ల‌ను అందించ‌డంలో స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రించేందుకు ఈ ఏఐ వ్య‌వ‌స్థ‌లు ఇంకా సిద్ధం కాలేద‌ని వారు తెలిపారు. అయితే వైద్య ప్ర‌పంచంలో మాత్రం ఈ ఫ‌లితాల‌ను ఓ కీల‌క‌మైన మైలురాయిగా అభివ‌ర్ణిస్తున్నారు.

వైద్యుల క‌న్నా మెరుగైన స్కోరు..

నేచ‌ర్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురిత‌మైన పరిశోధ‌న‌ల్లో తెలిపిన ప్ర‌కారం వైద్యులు సాధార‌ణంగా నిర్వ‌హించే క్లినిక‌ల్ ప‌నుల‌పై రెండు ప్ర‌త్యేక ఏఐ వ్య‌వ‌స్థ‌ల‌ను ప‌రీక్షించారు. మొద‌టి వ్య‌వ‌స్థ మిరా 500కు పైగా అత్య‌వ‌స‌ర విభాగ కేసుల‌ను ఎల‌క్ట్రానిక్ హెల్త్ రికార్డుల ఆధారంగా విశ్లేష‌ణ చేసింది. ఈ ఏఐ నిర్దార‌ణ క‌చ్చిత‌త్వంలో 87.1 శాతం స్కోరును సాధించింది. ఇక అవే కేసుల‌ను ప‌రిశీలించిన వైద్య బృందం 78.1 శాతం క‌చ్చిత‌త్వ స్కోరును మాత్ర‌మే సాధించ‌డం గ‌మ‌నార్హం. అంటే వైద్యుల క‌న్నా మెరుగ్గా ఏఐ విశ్లేష‌ణ చేసింద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. వైద్య స‌మాచారాన్ని స‌మ‌గ్రంగా విశ్లేషించి నిర్దార‌ణ సూచ‌న‌లు అందించే ఆటోమేటిక్ మెడిక‌ల్ రీజనింగ్ ఏజెంట్‌గా ఈ టూల్‌ను అభివృద్ధి చేశారు. ఇక రెండో ఏఐ వ్య‌వ‌స్థ గూగుల్‌కు చెందిన అమీ ద్వారా రోగుల‌తో ప‌రస్పర సంభాష‌ణ‌లు నిర్వ‌హించ‌డం, చికిత్స ప్ర‌ణాళిక‌లు రూపొందించ‌డం వంటి అంశాల్లో ప‌రీక్ష‌లు జ‌రిపారు. యూకేకు చెందిన 21 మంది ప్రాక్టిసింగ్ వైద్యులు రూపొందించిన ప్ర‌ణాళిక‌ల‌తో పోలిస్తే, అమీ సూచ‌న‌లు క్లినిక‌ల్ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు చాలా ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ట్లు ప‌రిశోధ‌కులు గుర్తించారు. క్లిష్ట‌మైన వైద్య ప‌రిస్థితుల‌ను నిర్వ‌హించ‌డంలోనూ ఈ వ్య‌వ‌స్థ మెరుగైన ఫ‌లితాల‌ను అందించింది.

డాక్ట‌ర్ల స్థానాన్ని ఏఐ భ‌ర్తీ చేస్తుందా..

ఈ రెండు అధ్య‌య‌నాల‌ను క‌లిపి చూస్తే ఏఐ సాధార‌ణ ల‌క్ష‌ణాల ఆధారంగా సూచ‌న‌లు ఇచ్చే ద‌శ‌ల‌ను దాటి, సంక్లిష్ట క్లినికల్‌ ఆలోచ‌నా ప్ర‌క్రియ‌ల‌కు స‌హాయ‌ప‌డే స్థాయికి చేరుకుంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే ఏఐ ఇంత‌గా అభివృద్ధి చెందుతున్న నేప‌థ్యంలో రానున్న రోజుల్లో డాక్ట‌ర్ల‌ను కూడా ఇది భ‌ర్తీ చేస్తుందా అనే సందేహాలు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. అద్భుత‌మైన ఫ‌లితాల‌ను సాధిస్తున్న‌ప్ప‌టికీ వాస్త‌వ ప్ర‌పంచంలో వైద్యుల‌ను ఏఐ భ‌ర్తీ చేయ‌లేద‌ని, ఆ స్థితికి ఇంకా అది చేరుకోలేద‌ని నిపుణులు స్ప‌ష్టం చేస్తున్నారు. మ‌రింత సంక్లిష్ట‌మైన ప‌రిస్థితులు ఏర్ప‌డితే స‌రైన నిర్ణ‌యం తీసుకోగ‌లిగే సామ‌ర్థ్యం మ‌నుషుల‌కే ఉంటుంద‌ని, ఏఐకి ఉండ‌ద‌ని, అలాంటి ప‌రిస్థితుల్లో ఏఐ ద్వారా ఏదైనా త‌ప్పు జ‌రిగితే అందుకు భారీ ఎత్తున మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఏఐ అభివృద్ధి చెంద‌డం వ‌ల్ల రోగాల నిర్దార‌ణ విష‌యంలో, చికిత్స ప్ర‌ణాళిక అంశంలో గ‌ణ‌నీయ‌మైన మార్పులు చోటు చేసుకునే అవ‌కాశం ఉంద‌ని, దీంతో వైద్యులు మ‌రింత వేగంగా నిర్ణ‌యాలు తీసుకుని రోగుల‌కు స‌త్వ‌ర చికిత్స అందించి ప్రాణాల‌ను కాపాడే అవ‌కాశం ఉంటుంద‌ని, ఆ విష‌యంలో ఏఐ అద్భుతంగా ప‌నిచేస్తుంద‌ని చెబుతున్నారు.

Advertisement
Advertisement