త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Metformin | మధుమేహ మందు మెట్‌ఫార్మిన్‌.. మరెన్నో రోగాలకు ఆశాకిరణం..

Metformin | ప్రపంచవ్యాప్తంగా మధుమేహ నియంత్రణ కోసం విస్తృతంగా వినియోగిస్తున్న మెట్‌ఫార్మిన్ ట్యాబ్లెట్ల‌పై తాజా పరిశోధనలు ఆసక్తికర విషయాలను వెలుగులోకి తెచ్చాయి. ఇప్పటివరకు ఈ ఔషధం ప్రధానంగా కాలేయంలో పనిచేసి రక్తంలో చక్కెర ఉత్పత్తిని తగ్గిస్తుందని భావించగా, వాస్తవానికి ఇది ప్రేగుల్లో కీలక మార్పులు తీసుకువస్తూ మధుమేహ నియంత్రణతోపాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

S

Health | Published On Jun 5, 2026, 3.26 pm IST

Metformin | మధుమేహ మందు మెట్‌ఫార్మిన్‌.. మరెన్నో రోగాలకు ఆశాకిరణం..
Advertisement

Metformin | ప్రపంచవ్యాప్తంగా మధుమేహ నియంత్రణ కోసం విస్తృతంగా వినియోగిస్తున్న మెట్‌ఫార్మిన్ ట్యాబ్లెట్ల‌పై తాజా పరిశోధనలు ఆసక్తికర విషయాలను వెలుగులోకి తెచ్చాయి. ఇప్పటివరకు ఈ ఔషధం ప్రధానంగా కాలేయంలో పనిచేసి రక్తంలో చక్కెర ఉత్పత్తిని తగ్గిస్తుందని భావించగా, వాస్తవానికి ఇది ప్రేగుల్లో కీలక మార్పులు తీసుకువస్తూ మధుమేహ నియంత్రణతోపాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దేశంలో సుమారు 10 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. వీరిలో పెద్ద సంఖ్యలో ప్రజలు మెట్‌ఫార్మిన్‌ను వాడుతున్నారు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ఔషధాన్ని 1922లో బ్రిటిష్‌, ఫ్రెంచ్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. 1957 నుంచి ఫ్రాన్స్‌లో వినియోగంలోకి వచ్చిన ఈ మందు, 1995లో అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FDA) అనుమతి తర్వాత ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం అమెరికాలోనే సుమారు రెండు కోట్ల మంది దీనిని ఉపయోగిస్తున్నారు.

మ‌రింత ఎక్కువ‌గా గ్లూకోజ్ శోష‌ణ‌..

అమెరికాలోని నార్త్ వెస్ట్ర‌న్ యూనివ‌ర్సిటీ ఫీన్‌బ‌ర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన శాస్త్రవేత్త నవదీప్‌ ఛండేల్‌ నేతృత్వంలోని బృందం మెట్‌ఫార్మిన్‌ ప్రభావంపై తాజా అధ్యయనం నిర్వహించింది. ఈ పరిశోధనలో మెట్‌ఫార్మిన్‌ చిన్న పేగు కణాల్లోని మైటోకాండ్రియాపై పనిచేస్తూ సిట్రులిన్‌ అనే రసాయనం ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు గుర్తించారు. అదే సమయంలో ఆకలిని నియంత్రించే సంకేతాలను పంపే గ్రోత్‌ డిఫరెన్షియేషన్‌ ఫ్యాక్టర్‌-15 (GDF-15) ఉత్పత్తిని పెంచుతున్నట్లు తేలింది. దీని ప్రభావంతో పేగు కణాలు మరింత ఎక్కువ గ్లూకోజును శోషించుకుంటాయి. అనంతరం ఆ గ్లూకోజును లాక్టేట్‌, లాక్‌ఫే వంటి పదార్థాలుగా మారుస్తాయి. ఈ ప్రక్రియ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేందుకు సహకారం లభిస్తుంది. మధుమేహ నియంత్రణలో ఉపయోగపడుతాయని భావిస్తున్న బెర్‌బెరిన్‌, ఫిన్‌ఫార్మిన్‌ వంటి పదార్థాలు కూడా ఇదే విధానంలో పనిచేస్తున్నాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ అధ్యయన ఫలితాలను నేచ‌ర్ మెట‌బాలిజం అనే జ‌ర్న‌ల్‌ తాజా సంచికలో ప్రచురించారు.

కేవ‌లం మ‌ధుమేహానికే కాదు..

ఇటీవల వెలువడుతున్న అధ్యయనాలు మెట్‌ఫార్మిన్‌ ప్రయోజనాలు మధుమేహ నియంత్రణకే పరిమితం కావని సూచిస్తున్నాయి. ఒజెంపిక్‌, మంజారో వంటి బరువు తగ్గించే మందుల వినియోగాన్ని నిలిపివేసిన తర్వాత శరీర బరువును నియంత్రించడంలో ఇది సహాయపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వయసుతో వచ్చే కణస్థాయి వాపులను తగ్గించడం, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ బాధితుల్లో వ్యాయామం వల్ల లభించే ప్రయోజనాలకు సమానమైన ప్రభావం చూపడం వంటి అంశాలపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి.

ఎముక‌ల‌కు కూడా..

అలాగే ఎముకలు, కీళ్ల అరిగిపోవడం వల్ల వచ్చే నొప్పులను తగ్గించడం, మెదడు పనితీరును పరిరక్షించడం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయ‌ని కొన్ని ప్రారంభ అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే ఇవన్నీ ఇంకా ప్రాథమిక దశలో ఉన్న పరిశోధనలే. విస్తృత స్థాయి క్లినికల్‌ పరీక్షల ద్వారా ఫలితాలు నిర్ధారితమైన తర్వాతే మెట్‌ఫార్మిన్‌ను ఇతర వ్యాధుల చికిత్సలో వినియోగించే అవకాశాలపై స్పష్టత రానుంది. అప్పటివరకు ఈ ఆశాజనక ఫలితాలను శాస్త్రీయ పరిశోధనల దశలోనే చూడాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement