త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Karthika Pournami | నేడే కార్తీక పౌర్ణ‌మి.. ఏ సమయంలో దీపారాధన చేయాలి? జ్వాలాతోరణం వెనుక ఆసక్తికర విష‌యాలు తెలుసా..?

Karthika Pournami | కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన పర్వదినం కార్తీక పౌర్ణమి. శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఈ రోజున స్నానం, జపం, దీపారాధన, దానధర్మాలు చేయడం విశేష ఫలితాలను ఇస్తుందని భక్తుల విశ్వాసం. పూర్ణిమ తిథి, కృత్తికా నక్షత్రం కలయికతో వచ్చే ఈ పర్వదినాన్ని త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు.

P

Devotional | Published On Nov 24, 2026, 5.45 am IST

Karthika Pournami | నేడే కార్తీక పౌర్ణ‌మి.. ఏ సమయంలో దీపారాధన చేయాలి? జ్వాలాతోరణం వెనుక ఆసక్తికర విష‌యాలు తెలుసా..?
Advertisement

Karthika Pournami | కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన పర్వదినం కార్తీక పౌర్ణమి. శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఈ రోజున స్నానం, జపం, దీపారాధన, దానధర్మాలు చేయడం విశేష ఫలితాలను ఇస్తుందని భక్తుల విశ్వాసం. పూర్ణిమ తిథి, కృత్తికా నక్షత్రం కలయికతో వచ్చే ఈ పర్వదినాన్ని త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ సంవ‌త్స‌రం నేడు మంగ‌ళ‌వారం (నవంబర్‌ 24న) కార్తిక పౌర్ణమి వచ్చింది. మరి ఈ రోజున పాటించాల్సిన ఆచారాలేమిటి? జ్వాలాతోరణం వెనుక ఉన్న పురాణ కథలేంటి? తెలుసుకుందాం రండి..!

పౌర్ణమి తిథి ఎప్పుడు.. ఏం చేయాలంటే..

మంగళవారం కార్తిక పౌర్ణమి పర్వదినం. స్థానిక కాలమానం ప్రకారం నవంబర్‌ 23న రాత్రి 10.13 గంటలకు ప్రారంభమయ్యే పూర్ణిమ తిథి మొద‌లై.. 24న రాత్రి 8.26 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో చేసే పూజలు, దీపారాధనకు విశేష ప్రాధాన్యత ఉన్న‌ది. పౌర్ణమి రోజున పవిత్ర స్నానం, దైవదర్శనం, జపతపాలు, దీపదానం చేయడం శ్రేష్ఠమని ప్రముఖ జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. గంగ, గోదావరి, కృష్ణా, తుంగభద్ర వంటి నదుల్లో స్నానం చేయాల‌ని.. నదీ స్నానం సాధ్యం కానివారు ఇంట్లోనే నీటిలో గంగాజలం కలుపుకొని స్నానమాచరించవ‌చ్చ‌ని పేర్కొంటున్నారు. సాయంత్రం వేళ ఆలయాల్లో, ఇంట్లో, తులసికోట వద్ద దీపాలు వెలిగించాలి. ఏడాదిలోని 365 రోజులకు ప్రతీకగా 365 వత్తులతో దీపం వెలిగించే సంప్రదాయం సైతం ఉన్న‌ది. అయితే, పౌర్ణ‌మి రోజున దీపాన్ని దానం చేయడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. ఉసిరికాయలు, సాలగ్రామాలను దానం చేయడం శుభప్రదమని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. పౌర్ణమి రాత్రి వెన్నెలలో పరమాన్నం తయారుచేసి స్వామివారికి నివేదించే ఆచారం సైతం ఉన్న‌ది.

ఆరు కృత్తికలకు ప్రత్యేక పూజ

కార్తీక పౌర్ణమి నాడు కార్తికేయ స్వామిని స్మరించడం విశేష ఫలప్రదమని భక్తుల నమ్మకం. సాయంత్రం చంద్రోదయ సమయంలో కార్తికేయుడిని పెంచిన ఆరుగురు కృత్తికలను అగ్నిరూపంలో పూజిస్తారు. శత్రువులపై విజయం, ధైర్యసాహసాలు కలగాలని స్వామివారిని ప్రార్థిస్తారు. కార్తిక మాసంలో నియమనిష్ఠలతో దీక్ష ఆచరించడం జన్మబంధాల నుంచి విముక్తిని కలిగిస్తుందని శాస్త్రవచనం.

జ్వాలాతోరణం.. ఎందుకీ ప్రత్యేకత?

కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల్లో నిర్వహించే అత్యంత విశిష్టమైన వేడుక జ్వాలాతోరణం. రెండు ఎత్తైన కర్రలకు అడ్డంగా మరో కర్రను కట్టి, దానికి ఎండుగడ్డిని చుడతారు. అనంతరం నిప్పు అంటించడంతో జ్వాలలతో ప్రకాశించే తోరణం ఏర్పడుతుంది. పల్లకిలో ఉత్సవమూర్తులైన శివపార్వతులను ఈ తోరణం కింద నుంచి ఊరేగిస్తారు. ఆ తర్వాత భక్తులు సైతం దాని కింద నుంచి నడుస్తూ పాపాలు, దోషాలు తొలగిపోవాలని ప్రార్థిస్తారు. దీనికి వెనుక ప‌లు కార‌ణాలు ఉన్నాయ‌ని పురాణాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను పీడిస్తున్న త్రిపురాసురులను పరమశివుడు సంహరించిన రోజు కార్తీక పౌర్ణమి అని పురాణాలు చెబుతున్నాయి. ఈ విజయానికి గుర్తుగా ఈ పర్వదినాన్ని త్రిపుర పౌర్ణమిగా కూడా వ్యవహరిస్తారు. రాక్షస సంహారం అనంతరం కైలాసానికి తిరిగి వచ్చిన శివుడికి దిష్టి తగలకుండా పార్వతీదేవి జ్వాలాతోరణం ఏర్పాటు చేసినట్లు క‌థ‌నం ప్ర‌చారంలో ఉంది. ఈ సందర్భంగా తులసికోట వద్ద 365 వత్తులతో దీపం వెలిగిస్తారు.

క్షీర‌సాగ‌ర మ‌థ‌నంతో వెలువ‌డిన కాల‌కూటం..

క్షీరసాగర మథనం సమయంలో వెలువడిన కాలకూట విషం సమస్త లోకాలను నాశనం చేసే ప్రమాదం ఏర్పడింది. దీంతో దేవతలు, రాక్షసులు శివుడిని శరణు వేడారు. లోకకల్యాణం కోసం పరమేశ్వరుడు ఆ విషాన్ని స్వీకరించి కంఠంలోనే నిలిపాడు. దీంతో ఆయన నీలకంఠుడిగా ప్రసిద్ధి చెందాడు. ఈ ఘట్టం అనంతరం శివపార్వతులు కుటుంబ సమేతంగా మూడుసార్లు జ్వాలాతోరణం దాటినట్లు పురాణ గాథలు వివరిస్తున్నాయి. తోరణంలో కాలిన గడ్డిని పశువుల ఆహారం, ధాన్యం నిల్వ చేసే ప్రదేశాల్లో ఉంచితే పశుసంపద, ధాన్యసంపద వృద్ధి చెందుతాయని భక్తుల విశ్వాసం. జ్వాలాతోరణాన్ని దర్శించడం, దాని కింద నుంచి వెళ్లడం వల్ల పాపాలు తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు. అపమృత్యు దోషాలు తొలగడంతో పాటు నరకద్వార ప్రవేశం నుంచి విముక్తి లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.

కాశీలో దేవ దీపావళి.. అరుణాచలంలో కృత్తిక దీపం

పౌర్ణమి వేడుకలు దేశవ్యాప్తంగా వైభవంగా జరుగుతాయి. వారణాసి క్షేత్రంలో ఈ పర్వదినాన్ని 'దేవ దీపావళి'గా నిర్వహిస్తారు. గంగానది తీరంలోని ఘాట్లన్నీ వేలాది దీపాలతో ప్రకాశిస్తాయి. దేవతలు సైతం భూమిపైకి వచ్చి దీపారాధన చేస్తారని భక్తుల విశ్వాసం. తమిళనాడులోని అరుణాచల క్షేత్రంలో కృత్తిక దీపోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. శృంగేరి శారదా పీఠంలో లక్ష దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. కార్తిక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు జగద్గురువుల ఆధ్వర్యంలో తుంగా హారతి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కార్తిక పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి, ఇంట్లో లేదా ఆలయంలో కనీసం ఒక్క దీపమైనా వెలిగించాలని పండితులు సూచిస్తున్నారు. దీపారాధన సమయంలో సమస్త జీవరాశుల క్షేమాన్ని కోరుతూ ఈ శ్లోకాన్ని పఠించాలని చెబుతున్నారు.

శ్లోకం..

కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః...
జలే స్థలే యే నివసంతి జీవాః |
దృష్ట్వా ప్రదీపం న హి జన్మభాగినః
భవంతి త్వం శ్వపచాహి విప్రాః ||

కీటకాలు, పక్షులు, దోమలు, చెట్లు, మొక్కలు, నీటిలో, నేలపై నివసించే సమస్త జీవరాశులకు ముక్తి కలగాలని ఈ శ్లోకం ద్వారా ప్రార్థిస్తారు. మనుషులకు జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందే అవకాశం ఉంది. కానీ ఇతర జీవరాశులకు ఆ మార్గం అందుబాటులో ఉండదు. అందుకే సృష్టిలోని ప్రతి జీవి పట్ల కృతజ్ఞతతో, వాటి క్షేమాన్ని కోరుకుంటూ దీపం వెలిగించాలని ఈ ఆచారం సందేశమిస్తోంది. కార్తీక పౌర్ణమి సందేశం ఒక్కటే.. వెలుగు జ్ఞానానికి ప్రతీక. చీకటి అజ్ఞానానికి సంకేతం. దీపం వెలిగించడం అంటే కేవలం ఆచారం కాదు. మనలోని అహంకారం, ద్వేషం, అసూయలను తొలగించుకొని ప్రేమ, జ్ఞానం, సద్గుణాలతో జీవితాన్ని ప్రకాశవంతం చేసుకోవడమే ఈ పర్వదినం ఇచ్చే అసలైన సందేశం.

Advertisement
Advertisement