త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Volkswagen | వోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు.. 2030 నాటికి లక్ష ఉద్యోగాలు కట్..

Volkswagen | జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్‌ మరో 50వేల ఉద్యోగాలను 2030 నాటికి తగ్గించేందుకు సిద్ధమైంది. దాదాపు 90 ఏళ్ల చరిత్రలోనే అతిపెద్ద పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. తాజా కోతలతో 2030 చివరి నాటికి సంస్థ తొలగించనున్న మొత్తం ఉద్యోగాల సంఖ్య లక్షకు చేరనుంది.

S

Business | Published On Sep 4, 2026, 10.48 am IST

Volkswagen | వోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు.. 2030 నాటికి లక్ష ఉద్యోగాలు కట్..
Advertisement

Volkswagen | జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్‌ మరో 50వేల ఉద్యోగాలను 2030 నాటికి తగ్గించేందుకు సిద్ధమైంది. దాదాపు 90 ఏళ్ల చరిత్రలోనే అతిపెద్ద పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. తాజా కోతలతో 2030 చివరి నాటికి సంస్థ తొలగించనున్న మొత్తం ఉద్యోగాల సంఖ్య లక్షకు చేరనుంది. ప్రపంచంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థల్లో ఒకటైన వోక్స్‌వ్యాగన్‌కు ఆడి, పోర్షే, స్కోడా, సీట్, బెంట్లీ, లంబోర్ఘిని వంటి ప్రముఖ కార్ల బ్రాండ్లు ఉన్నాయి. అయితే సంస్థ ప్రస్తుతం అమ్మకాలు తగ్గడం, లాభాలు పడిపోవడం, ముఖ్యంగా చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థల నుంచి పెరుగుతున్న పోటీ వంటి సవాళ్లను ఎదుర్కొంటోంది.

మ‌రో 50వేల ఉద్యోగుల తొల‌గింపు..

తాజా ఉద్యోగాల తగ్గింపు ప్రణాళికకు వోక్స్‌వ్యాగన్ పర్యవేక్షణ బోర్డు గురువారం ఆమోదం తెలిపింది. ఇప్పటికే మార్చిలో 2030 నాటికి 50వేల ఉద్యోగాలను తగ్గించనున్నట్లు సంస్థ ప్రకటించింది. మారుతున్న వినియోగదారుల డిమాండ్, వేగంగా జరుగుతున్న సాంకేతిక మార్పుల నేపథ్యంలో సంస్థ పోటీతత్వాన్ని కాపాడుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల సామర్థ్యాన్ని ప్రాథమికంగా సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉందని వోక్స్‌వ్యాగన్ తెలిపింది. తాజా పునర్వ్యవస్థీకరణలో మేనేజ్‌మెంట్‌ స్థాయి ఉద్యోగాలతో కలిపి సుమారు 50వేల పోస్టులను తగ్గించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఖర్చులను తగ్గించేందుకు అత్యంత ప్రజాదరణ ఉన్న వాహనాలపై దృష్టి పెట్టడంతోపాటు, ఒక్కో మోడల్‌ ఉత్పత్తి పరిమాణాన్ని పెంచాలని నిర్ణయించింది. వోక్స్‌వ్యాగన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఒలివర్ బ్లూమ్ ఈ నిర్ణయాన్ని సంస్థ భవిష్యత్తుకు బలమైన సంకేతంగా అభివర్ణించారు. మొత్తం ఉద్యోగుల పట్ల బాధ్యత తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. మరిన్ని ఉద్యోగాల కోతలను పరిశీలిస్తున్నట్లు బ్లూమ్ జూలైలో బీబీసీకి వెల్లడించారు.

ప‌రిశ్ర‌మ‌లో వ‌స్తున్న మార్పులే కార‌ణం..

కాగా జర్మనీలోని ఎమ్డెన్, స్వికావ్, హానోవర్, నెకార్సుల్మ్ ప్లాంట్ల భవిష్యత్తును కూడా వోక్స్‌వ్యాగన్ సమీక్షిస్తోంది. ప్రస్తుతం ఈ నాలుగు ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం మార్కెట్ డిమాండ్ కంటే ఎక్కువగా ఉంది. దీంతో ఈ ప్లాంట్లను ఇతర అవసరాలకు ఎలా వినియోగించాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంస్థ తెలిపింది.ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమ వేగంగా మారుతున్న నేపథ్యంలో లాభదాయకతను పునరుద్ధరించడంతోపాటు పోటీతత్వాన్ని నిలబెట్టుకునేందుకు వోక్స్‌వ్యాగన్ ఈ భారీ పునర్వ్యవస్థీకరణను చేపడుతోంది. 2025లో వోక్స్‌వ్యాగన్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 6.60 లక్షలకు పైగా ఉద్యోగులను కలిగి ఉంది. యూరప్‌లోని అతిపెద్ద పారిశ్రామిక కార్మిక సంఘం ఐజీ మెటల్ అధ్యక్షురాలు, వోక్స్‌వ్యాగన్ పర్యవేక్షణ బోర్డు డిప్యూటీ చైర్‌పర్సన్ క్రిస్టియానే బెన్నర్ మాట్లాడుతూ.. సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొనేందుకు వోక్స్‌వ్యాగన్ మంచి పరిష్కారాల కోసం తీవ్రంగా పోరాడిందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement