త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jio IPO | జియో ఐపీఓ నేడే ప్రారంభం.. జీఎంపీ వివరాలివే.. బ్రోక‌రేజీలు ఏమంటున్నాయి..?

Jio IPO | భారత్‌లో ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలవనున్న జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ బుధవారం సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభమైంది.

S

Business | Published On Oct 21, 2026, 10.50 am IST

Jio IPO | జియో ఐపీఓ నేడే ప్రారంభం.. జీఎంపీ వివరాలివే.. బ్రోక‌రేజీలు ఏమంటున్నాయి..?
Advertisement

Jio IPO | భారత్‌లో ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలవనున్న జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ బుధవారం సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభమైంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ కొత్తగా గరిష్ఠంగా 27 కోట్ల షేర్లను జారీ చేసి సుమారు రూ.30,213 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇవాళ పబ్లిక్ ఇష్యూ ప్రారంభం కాగా అక్టోబర్ 23 వరకు అందుబాటులో ఉంటుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రిలయన్స్ గ్రూప్ నుంచి వస్తున్న తొలి ఐపీఓ ఇదే. జియో ఐపీఓ ధరల శ్రేణి, లిస్టింగ్ తేదీ, గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ), బ్రోకరేజీ సంస్థల అంచనాలు సహా కీలకమైన పది అంశాలు ఇలా ఉన్నాయి.

జియో ఐపీఓ ధరల శ్రేణి ఎంత?

జియో ప్లాట్‌ఫామ్స్ ఒక్కో షేరుకు రూ.1,065 నుంచి రూ.1,119 వరకు ధరల శ్రేణిని నిర్ణయించింది. ఐపీఓ పత్రాల ప్రకారం కంపెనీ విలువ సుమారు 108 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. పెట్టుబడిదారులు కనీసం 12 షేర్ల లాట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత 12 షేర్ల చొప్పున అదనంగా దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ వర్గాల పెట్టుబడిదారులకు అవకాశం కల్పించేందుకు ఐపీఓలో ప్రత్యేక కేటాయింపులు చేశారు. అర్హత కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారుల కోసం రూ.2,500 కోట్ల వరకు, అర్హత కలిగిన ఉద్యోగుల కోసం రూ.500 కోట్ల వరకు కేటాయించారు. రిటైల్ వ్యక్తిగత పెట్టుబడిదారులకు నికర ఆఫర్‌లో కనీసం 35 శాతం కేటాయించనున్నారు.

జియో షేర్ల లిస్టింగ్ ఎప్పుడు?

జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు అక్టోబర్ 28న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)ల్లో లిస్ట్ కానున్నాయి. ఐపీఓ ముగిసిన తర్వాత స్టాక్ మార్కెట్‌లో షేర్ల ట్రేడింగ్ ప్రారంభమవుతుంది. జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ విలువ పరంగా దేశ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలవనుంది. 2024లో హ్యుందాయ్ మోటార్ ఇండియా సమీకరించిన రూ.27,870 కోట్లను ఈ ఐపీఓ అధిగమించనుంది. జియో ఐపీఓలో కొత్తగా గరిష్ఠంగా 27 కోట్ల షేర్లను జారీ చేస్తున్నారు. అంటే ఈ ఆఫర్ ద్వారా ఇప్పటికే ఉన్న వాటాదారులు తమ షేర్లను విక్రయించడం లేదు.

జియో ఐపీఓ జీఎంపీ ఎంత?

జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లపై గ్రే మార్కెట్‌లో బలమైన ఆసక్తి కనిపిస్తోంది. మంగళవారం నాటికి షేర్లు సుమారు రూ.245 గ్రే మార్కెట్ ప్రీమియంతో ట్రేడవుతున్నట్లు అనధికారిక మార్కెట్ సమాచారం సూచించింది. ఇది ఐపీఓ గరిష్ఠ ధర రూ.1,119తో పోలిస్తే దాదాపు 22 శాతం ప్రీమియం కావ‌డం విశేషం. గ్రే మార్కెట్ ప్రీమియం అంటే ఐపీఓలో షేర్లు కేటాయింపు పొందకముందు లేదా స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ జరగకముందు, అనధికారిక మార్కెట్‌లో పెట్టుబడిదారులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్న అదనపు ధర. ఈ అంచనాల ప్రకారం ఒక్కో షేరు లిస్టింగ్ ధర సుమారు రూ.1,364 ఉండే అవ‌కాశాలు ఉన్నాయ‌ని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే గ్రే మార్కెట్ ధరలు అధికారికమైనవి కావు. లిస్టింగ్ సమయంలో వాస్తవ ధర భిన్నంగా ఉంటుంది. జీఎంపీ ఆధారంగా లాభాలు ఖాయమని భావించకూడదు.

నాలుగో అత్యంత విలువైన కంపెనీగా జియో?

ప్రస్తుత బీఎస్‌ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ర్యాంకింగ్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే, లిస్టింగ్ తర్వాత జియో ప్లాట్‌ఫామ్స్ దేశంలో నాలుగో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా నిలిచే అవకాశం ఉంది. ఈ జాబితాలో రూ.15.9 లక్షల కోట్ల విలువతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో, రూ.11.2 లక్షల కోట్లతో భారతీ ఎయిర్‌టెల్ రెండో స్థానంలో, దాదాపు రూ.11 లక్షల కోట్లతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మూడో స్థానంలో ఉన్నాయి. జియో ప్లాట్‌ఫామ్స్ అంచనా విలువ ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టీసీఎస్ వంటి దిగ్గజ కంపెనీల విలువను కూడా అధిగమించే అవకాశం ఉందని బీఎస్‌ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

టాటా గ్రూప్‌ను అధిగమించనున్న రిలయన్స్?

జియో ప్లాట్‌ఫామ్స్ లిస్టింగ్ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ దేశంలో అత్యంత విలువైన వ్యాపార సమూహంగా టాటా గ్రూప్‌ను అధిగమించే అవకాశం ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత కార్పొరేట్ రంగ ర్యాంకింగ్స్‌లో కీలక మార్పుగా నిలవనుంది. జియో షేర్ల ధరల శ్రేణిలో గరిష్ఠ ధర అయిన రూ.1,119 ఆధారంగా కంపెనీ విలువ సుమారు రూ.10.3 లక్షల కోట్లకు చేరుతుంద‌ని అంచనా. దీంతో రిలయన్స్ గ్రూప్ మొత్తం మార్కెట్ విలువ రూ.28.5 లక్షల కోట్లకు చేరనుంది. అక్టోబర్ 15 నాటి ఈటీ ఇంటెలిజెన్స్ గణాంకాల ప్రకారం, టాటా గ్రూప్ మార్కెట్ విలువ రూ.25.5 లక్షల కోట్లుగా ఉంది. జియో లిస్టింగ్‌కు ముందు రిలయన్స్ గ్రూప్ మార్కెట్ విలువ రూ.18.2 లక్షల కోట్లుగా నమోదైంది. దేశంలోని అతిపెద్ద వ్యాపార సమూహాల్లో అదానీ గ్రూప్ రూ.17.48 లక్షల కోట్ల విలువతో మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ రూ.13.91 లక్షల కోట్లతో, బజాజ్ గ్రూప్ రూ.13.88 లక్షల కోట్లతో ఉన్నాయి.

జియో భవిష్యత్తుపై ఆకాశ్ అంబానీ ఏమన్నారు?

టెలికాం రంగాన్ని దాటి సాంకేతికత, కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్ రంగాలు జియో ప్లాట్‌ఫామ్స్ తదుపరి విస్తరణకు కీలకంగా మారనున్నాయని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. జియోలో నెట్‌వర్క్‌, సాంకేతికత వేర్వేరు కాదని, తమ నెట్‌వర్కే సాంకేతికత అని ఆయన పేర్కొన్నారు. కంపెనీ సొంతంగా అభివృద్ధి చేసిన 5జి కోర్, క్లౌడ్ ఆధారిత రేడియో యాక్సెస్ నెట్‌వర్క్, సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ గురించి వివరించారు. ఈ వ్యవస్థ ద్వారా 53.33 కోట్ల మంది వినియోగదారులకు సేవలందిస్తున్నట్లు తెలిపారు. ఉపగ్రహ కనెక్టివిటీ, తదుపరి తరం 6జి సాంకేతికత కూడా జియో భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికల్లో ఉన్నాయని ఆకాశ్ అంబానీ వెల్లడించారు. మొబైల్ సేవలు, గృహ బ్రాడ్‌బ్యాండ్ నుంచి సంస్థలకు అందించే డిజిటల్ పరిష్కారాల వరకు పలు విభాగాల్లో కంపెనీ వృద్ధికి అవకాశాలు ఉన్నాయని వివరించారు. దేశంలో ఇప్పటికీ సుమారు 26 కోట్ల మంది 2జి సేవలను వినియోగిస్తున్నారని, దేశవ్యాప్తంగా కేవలం 21 శాతం ఇళ్లకే స్థిర బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ విభాగాల్లో విస్తరణకు ఇంకా పెద్ద అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

రూ.1.46 ల‌క్ష‌ల కోట్ల ఆదాయం..

రిలయన్స్ టెలికాం రంగంలోకి ప్రవేశించిన గత దశాబ్ద కాలంలో జియో ప్లాట్‌ఫామ్స్ ప్రపంచంలోని అతిపెద్ద మొబైల్ ఆపరేటర్లలో ఒకటిగా ఎదిగింది. మొబైల్ కనెక్టివిటీతో ప్రారంభమైన సంస్థ కార్యకలాపాలు ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ వినోదం, క్లౌడ్ కంప్యూటింగ్, వ్యాపార సంస్థలకు సాంకేతిక సేవల వరకు విస్తరించాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జియో ప్లాట్‌ఫామ్స్ కార్యకలాపాల ద్వారా రూ.1.46 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయం రూ.1.28 లక్షల కోట్లుగా ఉంది. ఇదే సమయంలో నికర లాభం రూ.26,109 కోట్ల నుంచి రూ.30,049 కోట్లకు పెరిగింది. వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచనకు ముందు లాభం (ఈబీఐటీడీఏ) రూ.64,170 కోట్ల నుంచి రూ.76,255 కోట్లకు చేరింది. జూన్ నాటి కంపెనీ గణాంకాల ప్రకారం జియో ప్లాట్‌ఫామ్స్‌కు 53.33 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. దేశంలోని మొత్తం డేటా ట్రాఫిక్‌లో దాదాపు 60 శాతం వాటా జియోదే. ఐపీఓ ద్వారా సమీకరించే నిధులు కంపెనీ ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేయనున్నాయి.

నిధుల‌ను ఎలా వినియోగిస్తారు..?

ఐపీఓ ద్వారా వచ్చే నికర నిధుల్లో గరిష్ఠంగా రూ.27,500 కోట్లను తన టెలికాం అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు చెందిన రుణాలను తిరిగి చెల్లించడానికి లేదా ముందుగానే తీర్చడానికి వినియోగించాలని కంపెనీ ప్రణాళిక రూపొందించింది. ఆకాశ్ అంబానీ తెలిపిన వివరాల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో జియో నికర రుణం-ఈబీఐటీడీఏ నిష్పత్తి 0.36 రెట్లకు తగ్గింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇది 0.88 రెట్లుగా ఉంది. ఐపీఓ ద్వారా కంపెనీకి అదనపు ఆర్థిక వెసులుబాటు లభిస్తుందని, 5జి, బ్రాడ్‌బ్యాండ్, కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్, వ్యాపార సేవల్లో పెట్టుబడులు పెంచేందుకు అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు. గూగుల్, మెటా వంటి అంతర్జాతీయ సాంకేతిక పెట్టుబడిదారుల భాగస్వామ్యం కూడా జియో తదుపరి వృద్ధికి తోడ్పడనుంది. ఐపీఓ ప్రారంభానికి ముందు జియో ప్లాట్‌ఫామ్స్ 212 మంది యాంకర్ ఇన్వెస్టర్లకు ఒక్కో షేరును రూ.1,119 చొప్పున కేటాయించింది. ఈ కేటాయింపు విలువ రూ.8,109.85 కోట్లుగా ఉంది. ఇది ఐపీఓ ధరల శ్రేణిలో గరిష్ఠ ధర కావ‌డం విశేషం.

సంస్థాగ‌త పెట్టుబ‌డిదారుల నుంచి స్పంద‌న‌..

యాంకర్ బుక్‌లో అందుబాటులో ఉన్న షేర్ల విలువ కంటే 30 రెట్లకు పైగా, అంటే రూ.2.5 లక్షల కోట్లకు మించిన సంస్థాగత పెట్టుబడుల కోసం బిడ్లు వచ్చినట్లు సమాచారం. మొత్తం 7.24 కోట్ల షేర్లను కేటాయించారు. దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా భావిస్తున్న ఈ ఇష్యూకు సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన లభించిందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. యాంకర్ కేటాయింపుల్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అత్యధికంగా రూ.499.98 కోట్ల విలువైన షేర్లను పొందింది. న్యూ వరల్డ్ ఫండ్ ఇంక్‌కు రూ.486.27 కోట్ల విలువైన షేర్లు, సింగపూర్ ప్రభుత్వానికి రూ.340.93 కోట్ల విలువైన షేర్లు కేటాయించారు. ఎస్‌బీఐ ఫోకస్డ్ ఫండ్‌కు రూ.315 కోట్ల విలువైన షేర్లు దక్కగా, బీఎన్‌పీ పారిబాస్ ఫైనాన్షియల్ మార్కెట్స్‌-ఓడీఐకు రూ.303.25 కోట్ల విలువైన షేర్లు కేటాయించారు. దేశీయ మ్యూచువల్ ఫండ్లకు 2.489 కోట్ల షేర్లు కేటాయించారు. వీటి విలువ రూ.2,784.96 కోట్లు. ఇది మొత్తం యాంకర్ బుక్‌లో 34.34 శాతం. బ్లాక్‌రాక్, క్యాపిటల్ గ్రూప్, ఫిడెలిటీ, టీ.రో ప్రైస్, ష్రోడర్స్, జేపీ మోర్గాన్ అసెట్ మేనేజ్‌మెంట్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, జానస్ హెండర్సన్ వంటి ప్రముఖ అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు కూడా యాంకర్ బుక్‌లో పాల్గొన్నాయి.

జియో ఐపీఓపై బ్రోకరేజీ సంస్థల అంచనాలు..

టెలికాం రంగంలో జియోకు ఉన్న ఆధిపత్యం, లాభదాయకతలో మెరుగుదల, బ్రాడ్‌బ్యాండ్, కృత్రిమ మేధ రంగాల్లో విస్తరణ అవకాశాలను పరిగణనలోకి తీసుకుని పలు బ్రోకరేజీ సంస్థలు ఈ ఐపీఓపై సానుకూల అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ జియో ఐపీఓకు సబ్‌స్క్రైబ్ చేయాలని పెట్టుబడిదారులకు సూచించింది. లిస్టింగ్ సమయంలో లాభాలు పొందే అవకాశాలతోపాటు దీర్ఘకాలిక పెట్టుబడిగా కూడా ఈ షేర్లకు ప్రాధాన్యం ఉందని పేర్కొంది. భారత టెలికాం మార్కెట్‌లో జియోకు ఉన్న బలమైన స్థానం, మెరుగుపడుతున్న ఆదాయాలు, విస్తృత వినియోగదారుల సంఖ్య, సొంత సాంకేతిక సామర్థ్యాలు, పెరుగుతున్న బ్రాడ్‌బ్యాండ్ వ్యాపారం భవిష్యత్తులో వృద్ధికి పునాదిగా నిలుస్తాయని వివరించింది. జూన్ నాటికి జియోకు 53.3 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారని, దేశంలోని వైర్‌లెస్ డేటా ట్రాఫిక్‌లో సుమారు 60 శాతం వాటా ఉందని బ్రోకరేజీ సంస్థ పేర్కొంది. జియో సొంత 5జి సాంకేతికత, 7,200కు పైగా పేటెంట్ దరఖాస్తులు, క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ రంగాల్లో పెట్టుబడులు డిజిటల్ సేవల వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు దోహదపడతాయని అంచనా వేసింది.

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ కూడా దీర్ఘకాలిక పెట్టుబడి దృష్టితో జియో ఐపీఓకు దరఖాస్తు చేసుకోవాలని సిఫారసు చేసింది. వినియోగదారులు 2జి నుంచి 4జి, 5జి సేవలకు మారడం, గృహ బ్రాడ్‌బ్యాండ్ వినియోగం పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లలో తన సాంకేతికతను వాణిజ్యపరంగా వినియోగించుకునే అవకాశాలను అన్వేషించడం ద్వారా జియో ప్రయోజనం పొందుతుంద‌ని పేర్కొంది. జియో సొంత సాంకేతిక పరిజ్ఞానం, 5జి నెట్‌వర్క్, బ్రాడ్‌బ్యాండ్ పరిష్కారాలు, జియోబ్రెయిన్ ఏఐ ప్లాట్‌ఫామ్ భవిష్యత్తులో ఆదాయ వృద్ధికి కీలక చోదకాలుగా మారుతాయ‌ని కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది.

గమనిక: స్టాక్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడి సాధనాలపై నిపుణులు, విశ్లేషకులు వ్యక్తం చేసే అభిప్రాయాలు, సిఫారసులు వారివే. అవి మా అభిప్రాయాలను ప్రతిబింబించవు. గ్రే మార్కెట్ ప్రీమియం అనధికారిక అంచనా మాత్రమే. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు ఐపీఓ పత్రాలు, రిస్క్‌లు, ఆర్థిక పరిస్థితులను పరిశీలించాలి. అవ‌స‌రం అయితే నిపుణుల స‌ల‌హా తీసుకోవాలి.

ట్యాగ్స్:

Advertisement
Advertisement