త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran Supreme Leader | ఇరాన్‌ తర్వాతి సుప్రీం లీడర్‌ ఎవరు..? ఖమేనీ వారసుడిని ఎంపిక విధానమిదే..!

Iran Supreme Leader | ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ కన్నుమూశారు. ఇజ్రాయెల్‌-అమెరికా సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఇరాన్‌ మీడియా సైతం ధ్రువీకరించింది.

P

International | Published On Mar 1, 2026, 9.52 am IST

Iran Supreme Leader | ఇరాన్‌ తర్వాతి సుప్రీం లీడర్‌ ఎవరు..? ఖమేనీ వారసుడిని ఎంపిక విధానమిదే..!
Advertisement

Iran Supreme Leader | ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ కన్నుమూశారు. ఇజ్రాయెల్‌-అమెరికా సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఇరాన్‌ మీడియా సైతం ధ్రువీకరించింది. ఆయన మృతికి 40 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించినట్లు అధికారిక వార్తా సంస్థ ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. ఆయన మృతితో ఇరాన్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. 1989 నుంచి ఇరాన్‌కు నాయకత్వం వహించిన ఖమేనీ.. మధ్యప్రాచ్యంలో సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన దేశాధినేతగా గుర్తింపు పొందారు. 1979 ఇస్లామిక్‌ విప్లవం తర్వాత ఇది రెండోసారి మాత్రమే అగ్ర నాయకత్వం మార్పు జరగడం గమనార్హం. ఖమేనీ మరణంతో దేశపాలన బాధ్యతలను తాత్కాలికంగా ముగ్గురు సభ్యులతో కూడిన మండలి నిర్వహించనుంది. ఇరాన్‌ అధ్యక్షుడు, న్యాయవ్యవస్థ అధిపతి, గార్డియన్‌ కౌన్సిల్‌కు చెందిన ఒక నేత కలిసి కొత్త సుప్రీం లీడర్‌ నియామకం జరిగే వరకు బాధ్యతలు చేపడుతారని ఐఆర్‌ఎన్‌ఏ తెలిపింది.

సుప్రీం లీడర్‌ ఎంపిక ఎలా?

ఇరాన్‌ రాజ్యాంగం ప్రకారం.. సుప్రీం లీడర్‌ను నియమించే అధికారం ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్‌’కి మాత్రమే ఉంటుంది. అధికారికంగా అసెంబ్లీ ఎక్స్‌పర్ట్స్‌ (మజ్లెస్-ఎ ఖోబ్రెగాన్-ఎ రహబరీ)గా పిలిచే ఈ సంస్థలో 88 మంది ఇస్లామిక్ పండితులు ఉంటారు. వీరిని ప్రజలు ప్రత్యక్ష ఓటుతో ఎనిమిదేళ్ల కాలానికి ఎన్నుకుంటారు. ఈ సంస్థకు సుప్రీం లీడర్‌ను నియమించడం, పర్యవేక్షించడం, అవసరమైతే తొలగించడం వంటి రాజ్యాంగబద్ధ అధికారాలు ఉన్నాయి. అయితే, వ్యవస్థ అంతర్గతంగా కట్టుదిట్టంగా ఉంటుంది. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులను గార్డియన్‌ పరిశీలించి, అనుమతిస్తుంది. ఈ గార్డియన్‌ కౌన్సిల్‌ సభ్యులను సుప్రీం లీడర్‌ నేరుగా, పరోక్షంగా ఎంపిక చేస్తారు. దీంతో అధికార వ్యవస్థలో ఒక మూస వలయం ఏర్పడినట్లవుతోంది. 1979 విప్లవ నేత రుహొల్లా ఖమేనీ 1989లో మరణించిన తర్వాత, అప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న అలీ ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి వారసుడి ఎంపిక ప్రక్రియ ప్రధానంగా మతపెద్దల వర్గంలోనే నిశ్శబ్దంగా కొనసాగుతూ వచ్చింది. ఈసారి ఆ వ్యవస్థకు గణనీయమైన పరీక్షగా మారనుంది.

సుప్రీం లీడర్‌ బరిలో పలువురు..

అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న థింక్‌ట్యాంక్‌ కౌన్సిల్‌ ఆన్‌ ఫారియన్‌ రిలేసన్స్‌ తాజాగా నివేదికలో పలు పేర్లను వారసులుగా ప్రస్తావించింది. హోజ్జత్-ఉల్-ఇస్లాం మొహ్సెన్ ఖోమీ సుప్రీం లీడర్‌ పదవి కోసం పోటీలో ఉన్నారు. ఖమెనీకి సన్నిహిత సలహాదారుగా ఉన్న ఆయనపై చాలా వర్గాలకు నమ్మకం ఉంది. వ్యవస్థలో స్థిరత్వం కొనసాగించగలరని ఖమెనీ అనుచరులు భావిస్తున్నారు. అలాగే, అయతుల్లా అలిరెజా అరాఫీ సైతం సుప్రీం లీడర్‌ రేసులో ఉన్నారు. ఆయన గార్డియన్‌ కౌన్సిల్‌, అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్‌లో సీనియర్‌ సభ్యుడు. ఇరాన్‌ సెమినరీ వ్యవస్థకు అధిపతి. ఆయనను నియమిస్తే ప్రస్తుతం ఉన్న రాజకీయ నిర్మాణం యథాతథంగా కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయతుల్లా మొహ్సెన్ అరాకీ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్‌లో ప్రముఖ సభ్యుడు. ఆయన పేరు సైతం ప్రముఖంగానే వినిపిస్తోంది. అయతుల్లా ఘోలాం హొసెయిన్ మొహ్సేని ఈజీ ప్రస్తుతం ఇరాన్‌ న్యాయవ్యవస్థ అధిపతి. భద్రతా, పరిపాలనా విభాగాల్లో అనుభవం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. అయతుల్లా హషెం హొసెయిని బుషెహ్రీ ఖోమ్‌లో అసెంబ్లీ సభ్యుడు ఈయన పేరు సైతం ప్రముఖంగానే వినిపిస్తోంది. ఇందులో ఎవరు సుప్రీం లీడర్‌గా నియమితులవుతారన్నది ప్రస్తుతం ఇరాన్ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది.

Read Also :

ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీ హ‌తం.. ధ్రువీక‌రించిన ఇరాన్ మీడియా..

దుబాయ్‌లో చిక్కుకున్న పీవీ సింధు.. భ‌యాన‌కంగా ఉంద‌న్న బ్యాడ్మింట‌న్ స్టార్

 

Advertisement
Advertisement