త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Canada | కెనడా సంచలన నిర్ణయం.. అమెరికాతో వాణిజ్య చర్చలు నిలిపివేత

Canada | అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య చర్చలను కెన‌డా తాత్కాలికంగా నిలిపివేసింది. అమెరికా ప్రతిపాదించిన నిబంధనల్లో చివరి నిమిషంలో చేసిన మార్పులు అన్యాయమైనవి, ఆర్థికంగా అనుకూలం కానివిగా ఉన్నాయని కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ పేర్కొన్నారు.

S

International | Published On Aug 22, 2026, 2.40 pm IST

Canada | కెనడా సంచలన నిర్ణయం.. అమెరికాతో వాణిజ్య చర్చలు నిలిపివేత
Advertisement

Canada | అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య చర్చలను కెన‌డా తాత్కాలికంగా నిలిపివేసింది. అమెరికా ప్రతిపాదించిన నిబంధనల్లో చివరి నిమిషంలో చేసిన మార్పులు అన్యాయమైనవి, ఆర్థికంగా అనుకూలం కానివిగా ఉన్నాయని కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాతో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసిన ఒక రోజు తర్వాత కెనడా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇటీవల జరిగిన చర్చల్లో పురోగతి కనిపించినప్పటికీ, కెనడా నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి అది సరిపోలేదని కార్నీ తెలిపారు. కెనడాలోని చాలా వ్యాపారాలకు సుంకం లేని మార్కెట్ ప్రవేశం కల్పించడం, కీలక పరిశ్రమలపై అమెరికా విధిస్తున్న సుంకాలను తగ్గించడం, చిన్న, మ‌ధ్యతరహా వ్యాపారాలను రక్షించడం వంటి లక్ష్యాలను సాధించాల్సి ఉందని ఆయన చెప్పారు.

కెన‌డియ‌న్ల ప్ర‌యోజ‌నాల మేర‌కే..

గత 18 నెలలుగా కెనడా కొత్త ప్రభుత్వం దేశీయంగా తమ బలాన్ని పెంచుకోవడం, విదేశాల్లో భాగస్వామ్యాలను విస్తరించడం, అమెరికాతో న్యాయమైన ఒప్పందం కుదుర్చుకోవడంపై దృష్టి సారించింద‌ని కార్నీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవలి వారాల్లో అమెరికాతో ప్రపంచంలోనే అత్యుత్తమ ఒప్పందాన్ని సాధించే దిశగా కెనడా స్థితిని మెరుగుపరచడంలో తాము ముఖ్యమైన పురోగతి సాధించామ‌ని, అయితే కెనడియన్ల కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ఆ పురోగతి సరిపోలేద‌ని, అందువల్ల అమెరికాతో వాణిజ్య చర్చలను నిలిపివేయాలని నిర్ణయించాన‌ని తెలిపారు. కెనడా చర్చల బృందాన్ని ఒట్టావాకు తిరిగి రావాలని ఆదేశించాన‌ని కార్నీ పేర్కొన్నారు. చర్చల చివరి నిమిషం వరకు కెనడియన్ల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రతినిధులు నిజాయితీగా, కష్టపడి పనిచేశారని కార్నీ అన్నారు. అయితే అమెరికా ప్రతిపాదించిన నిబంధనల్లో చివరి నిమిషంలో చేసిన మార్పులు అన్యాయంగా, ఆర్థికంగా అనుకూలం కానివిగా ఉన్నాయని, భవిష్యత్తులో కుదిరే ఏ ఒప్పందమైనా విశ్వసనీయంగా ఉంటుందా అనే ప్రశ్నలను అవి లేవనెత్తాయని ఆయన తెలిపారు.

డాల‌ర్‌కు డాల‌ర్ సుంకం..

అమెరికా తన అన్ని వాణిజ్య సంబంధాలను ప్రభావితం చేస్తోందని కూడా కార్నీ విమర్శించారు. అమెరికా మారిపోయిందని, త‌మ‌ పాత సంబంధానికి తిరిగి వెళ్లబోమని మొదటి నుంచే గుర్తించామ‌ని, అమెరికా తన అన్ని వాణిజ్య సంబంధాలను మార్చుకుంటోందని త‌మ‌ ప్రభుత్వం చాలామందికంటే ముందుగానే అర్థం చేసుకుంద‌ని అన్నారు. తన అత్యంత సన్నిహిత మిత్రదేశాలపైనా సుంకాలు విధిస్తూ, తన భారీ మార్కెట్‌లో ప్రవేశానికి ధర నిర్ణయిస్తోంద‌ని ఆయన అన్నారు. కాగా అమెరికా సుమారు 28 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన కెనడియన్ వస్తువులపై 50 శాతం సుంకం విధించేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఇరు దేశాల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది. దీనికి ప్రతిగా అమెరికా విధించే సుంకాలకు సమానంగా, డాలర్‌కు డాలర్ ప్రాతిపదికన కెనడా కూడా సుంకాలు విధిస్తుందని కార్నీ తెలిపారు. అమెరికా తాజా ప్రతిపాదనలు భవిష్యత్తులో కుదిరే ఏ ఒప్పందమైనా ఎంతవరకు విశ్వసనీయంగా ఉంటుందనే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని పేర్కొంటూ, కెనడా వాణిజ్య చర్చల ప్రతినిధులను ఒట్టావాకు తిరిగి రావాలని కార్నీ ఆదేశించారు.

https://twitter.com/CNBCTV18Live/status/2091030618096463977?s=20

అమెరికాపై ఆధార‌ప‌డ‌డాన్ని త‌గ్గిస్తాం: కెన‌డా

అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించే వ్యూహాన్ని కెనడా కొనసాగిస్తుందని కార్నీ తెలిపారు. దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు ఇతర దేశాలతో వాణిజ్యాన్ని విస్తరించనున్నట్లు చెప్పారు. కెనడాకు ఇప్పటికే ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా 150 కోట్ల మంది వినియోగదారులకు ప్రాధాన్య మార్కెట్ ప్రవేశం లభిస్తోందని, ఈ మార్కెట్ ప్రాప్యతను ఈ ఏడాది చివరి నాటికి రెట్టింపు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణ‌యించుకుందని తెలిపారు. కెనడా ప్రభుత్వం కార్మికులు, వ్యాపారాలకు అదనపు మద్దతు చర్యలను కూడా ప్రకటించనుంది. గత 18 నెలల్లో ఇప్పటికే దాదాపు 25 బిలియన్ కెనడియన్ డాలర్ల మద్దతు అందించామని కార్నీ చెప్పారు.

అంత‌కు ముందు ట్రంప్ స్పంద‌న‌..

ఈ పరిణామానికి ఒక రోజు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం కెనడాతో ఒప్పందంపై ఆశాభావం వ్యక్తం చేశారు. జాయింట్ బేస్ ఆండ్రూస్ నుంచి సౌత్ కరోలినాలోని మైర్టిల్ బీచ్‌కు బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడిన ట్రంప్‌ను కెనడాతో ఒప్పందం పరిస్థితి గురించి ప్రశ్నించారు. దానికి ట్రంప్ స్పందిస్తూ డీల్‌పై ఆశాభావంతో ఉన్న‌ట్లు తెలిపారు. అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా జ‌రుగుతుంద‌ని భావిస్తున్నాన‌ని, తాను కెన‌డా ప్ర‌ధానితో మాట్లాడ‌తాన‌ని, త‌మ‌కు మంచి అనుబంధం ఉంద‌ని అన్నారు. కెన‌డాతో ఒప్పందం ముందుకు సాగుతుంద‌ని, త‌మ రైతుల‌ను కూడా చూసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ రైతులు త‌మ‌కు చాలా ముఖ్య‌మని, కెన‌డాతో ఒప్పందం కుదిరే అవ‌కాశం ఉండాల‌ని పేర్కొన్నారు.

Advertisement
Advertisement