త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India UAE Defence Deal | ఇండియన్ వెపన్స్‌పై కన్నేసిన యూఏఈ: ‘బ్రహ్మోస్’, ‘ఆకాశ్ తీర్’ కోసం ముమ్మర చర్చలు

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల వేళ యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇండియా నుంచి బ్రహ్మోస్, ఆకాశ్ తీర్‌లను కొనుగోలు చేయనుంది.

J

Business | Published On Jun 22, 2026, 5.57 pm IST

India UAE Defence Deal | ఇండియన్ వెపన్స్‌పై కన్నేసిన యూఏఈ: ‘బ్రహ్మోస్’, ‘ఆకాశ్ తీర్’ కోసం ముమ్మర చర్చలు
Advertisement
  • భారత్ నుంచి అత్యంత శక్తివంతమైన బ్రహ్మోస్ (BrahMos), ఆకాశ్ తీర్ సిస్టమ్స్ కొనుగోలుకు యూఏఈ (UAE) ఆసక్తి
  • మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో రక్షణ సామర్థ్యం పెంపుపై యూఏఈ స్పెషల్ ఫోకస్
  • ఇప్పటికే ఇరు దేశాల మధ్య ప్రారంభమై, వేగంగా సాగుతున్న ప్రాథమిక స్థాయి చర్చలు
  • అమాంతం పెరిగిన భారత డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్.. రికార్డు స్థాయిలో 4 బిలియన్ డాలర్లకు చేరిక

India UAE Defence Deal | త్రినేత్ర.న్యూస్ : గల్ఫ్ దేశం యూఏఈ (UAE) తన రక్షణ వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేసుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా భారత్‌కు చెందిన ప్రతిష్టాత్మక బ్రహ్మోస్ (BrahMos) సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, 'ఆకాశ్ తీర్' (Akashteer) ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. సోమవారం వెలువడిన సమాచారం ప్రకారం.. ఇరు దేశాల మధ్య ఈ మెగా డిఫెన్స్ డీల్‌పై (Defence deal) ప్రాథమిక స్థాయి చర్చలు శరవేగంగా జరుగుతున్నాయి.

మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలే కారణమా?

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య మిడిల్ ఈస్ట్‌లో ఇటీవల జరిగిన పరిణామాలతో యూఏఈ ఒక్కసారిగా అప్రమత్తమైంది. క్షిపణులు, డ్రోన్ దాడుల ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు, తమ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్స్‌కు (Energy exports) అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) భద్రతను పెంచే ఉద్దేశంతో ఈ వెపన్స్ కొనుగోలు చేయాలని భావిస్తోంది. డిఫెన్స్ సెక్టార్‌లో కేవలం ఒకే దేశంపై ఆధారపడకుండా, సరఫరాదారుల జాబితాను పెంచుకునే వ్యూహంలో భాగంగానే భారత్‌తో యూఏఈ చేతులు కలుపుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

బ్రహ్మోస్, ఆకాశ్ తీర్ స్పెషాలిటీ ఏంటి?

భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌గా గుర్తింపు పొందింది. దీనిని భూమి, సముద్రం, గాలిలో ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. రష్యాకు యూఏఈతో మంచి సంబంధాలు ఉన్నందున, ఈ ఎగుమతికి మాస్కో నుంచి ఎలాంటి అడ్డంకులు ఉండవని నిపుణులు భావిస్తున్నారు.

ఇక 'ఆకాశ్ తీర్' అనేది ఇండియన్ ఆర్మీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) సంయుక్తంగా రూపొందించిన ఫుల్లీ ఆటోమేటెడ్ ఎయిర్ డిఫెన్స్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. శత్రువుల వైమానిక దాడులను వేగంగా పసిగట్టి.. కచ్చితత్వంతో తిప్పికొట్టడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. యూఏఈ వద్ద ఇప్పటికే అమెరికాకు చెందిన అధునాతన థాడ్ (THAAD), పేట్రియాట్ (Patriot) డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. వీటితో పాటు ఆకాశ్ తీర్ తోడైతే వారి రక్షణ వ్యవస్థ మరింత పటిష్టంగా మారుతుంది.

భారత డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్‌కు భారీ డిమాండ్

ఇటీవలి కాలంలో ఇండియా డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ (Defence exports) రికార్డు స్థాయిలో పెరిగాయి. 2013-14లో కేవలం 7.26 మిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు, 2026 మార్చి నాటికి ఏకంగా 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 37,868 కోట్లు) దాటాయి. గత ఏడాది మే నెలలో పాకిస్థాన్‌పై 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) సమయంలో భారత్ తొలిసారిగా బ్రహ్మోస్‌ను వినియోగించడం.. అంతర్జాతీయంగా మన వెపన్ సిస్టమ్స్‌పై ఆసక్తిని అమాంతం పెంచింది.

ఇప్పటికే ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్ క్షిపణులను డెలివరీ చేసిన భారత్.. వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. థాయ్‌లాండ్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, చిలీ తదితర దేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పుడు యూఏఈతో చర్చలు సఫలమైతే గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్‌లో భారత్ స్థానం మరింత బలోపేతం అవుతుందనడంలో సందేహం లేదు.

Advertisement
Advertisement