TG PRC | పీఆర్సీ అమలుపై నీలినీడలు
TG PRC | ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వేతన సవరణ (పీఆర్సీ) అమలుపై నీలినీడలు కమ్మకుంటున్నాయి. ఇప్పటికే పెండింగ్ డీఏలు, బకాయిల చెల్లింపులతో ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతోంది. ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల వ్యయం ఏటేటా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పీఆర్సీ సిఫారసులు అందిన తర్వాత ప్రభుత్వం వెంటనే వేతన సవరణకు వెళ్లగలదా? లేక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందా? అన్నది కీలకంగా మారింది. ముఖ్యంగా ఫిట్‌మెంట్ శాతం పెరిగే కొద్దీ ప్రభుత్వంపై పడే వార్షిక భారం భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.
- 2 డీఏలకే ఏటా 2,500 కోట్ల భారం
- మరో 3 డీఏలకు 3750 కోట్లు అవసరం
- కొత్త వేతన సవరణతో ఖజానాపై మరింత భారం
- 2021లో జీతాల వ్యయం 21,650 కోట్లు
- 2025 నాటికి .. 30,189 కోట్లు
- 20 శాతం ఫిట్ మెంట్ అమలైతే
- 8వేల కోట్ల అదనపు భారం
- 50 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే పెరిగే భారం మరో 25వేల కోట్లు
- వేతన సవరణ చేస్తారా? సర్దుబాటు చేస్తారా?
- ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్న అనేక సందేహాలు
TG PRC | ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వేతన సవరణ (పీఆర్సీ) అమలుపై నీలినీడలు కమ్మకుంటున్నాయి. ఇప్పటికే పెండింగ్ డీఏలు, బకాయిల చెల్లింపులతో ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతోంది. ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల వ్యయం ఏటేటా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పీఆర్సీ సిఫారసులు అందిన తర్వాత ప్రభుత్వం వెంటనే వేతన సవరణకు వెళ్లగలదా? లేక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందా? అన్నది కీలకంగా మారింది. ముఖ్యంగా ఫిట్‌మెంట్ శాతం పెరిగే కొద్దీ ప్రభుత్వంపై పడే వార్షిక భారం భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.
- త్రినేత్ర న్యూస్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. 2023 జూలై నుంచి 2026 జనవరి వరకు పెండింగ్‌లో ఉన్న డీఏల్లో రెండు విడతలను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. దాదాపు 5 శాతం మేర డీఏ పెంపుతో ఖజానాపై సుమారు రూ.2,500 కోట్ల అదనపు భారం పడుతోంది. మిగిలిన డీఏలను కూడా విడుదల చేయాల్సి ఉండటంతో రానున్న రోజుల్లో వేతన సంబంధిత వ్యయం మరింత పెరగనుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్లపై వ్యయం కూడా గణనీయంగా పెరుగుతోంది. 2021–22లో రూ.21,650 కోట్లుగా ఉన్న జీతాల వ్యయం 2024–25 నాటికి రూ.30,189 కోట్లకు చేరింది.ఈ పరిస్థితుల్లో కొత్త పీఆర్సీ అమలు చేస్తే ప్రభుత్వంపై పడే అదనపు భారంపై ఆర్థిక శాఖ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.
20 శాతం ఫిట్‌మెంట్‌కే రూ.7–8 వేల కోట్లు
పీఆర్సీలో ఫిట్‌మెంట్ శాతమే ప్రభుత్వంపై పడే అదనపు వ్యయాన్ని నిర్ణయించనుంది. ప్రాథమిక అంచనాల ప్రకారం 20 శాతం ఫిట్‌మెంట్ అమలు చేస్తే రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.7 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. ఫిట్‌మెంట్‌లో ప్రతి ఒక శాతం పెంపునకు ఏటా సుమారు రూ.260 కోట్ల అదనపు వ్యయం అవుతుందని అంచనా. ఉద్యోగ సంఘాలు మాత్రం 50–51 శాతం వరకు ఫిట్‌మెంట్ డిమాండ్ చేస్తున్నాయి. ఈ స్థాయిలో ఫిట్‌మెంట్‌తోపాటు పెండింగ్ డీఏలను పూర్తిగా చెల్లిస్తే ఉద్యోగులు, పెన్షనర్లపై ప్రభుత్వ వార్షిక వ్యయం రూ.35 వేల కోట్లను దాటే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వ్యయం రూ.30,189 కోట్లుగా ఉంది.
డీఏల భారం కొనసాగుతూనే..
జీవన వ్యయ పెరుగుదలకు అనుగుణంగా ఉద్యోగుల డీఏను సాధారణంగా జనవరి, జూలైలో సవరించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో డీఏలో ప్రతి ఒక శాతం పెంపునకు ఏటా సుమారు రూ.480 కోట్ల అదనపు వ్యయం అవుతోంది. దీంతో పెండింగ్‌లో ఉన్న డీఏలన్నింటినీ విడుదల చేస్తే ప్రభుత్వంపై వేల కోట్ల అదనపు భారం పడనుంది. ఇప్పటికే ఉద్యోగులు, పెన్షనర్లకు మంజూరు చేసిన 5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) వల్ల ఏటా మరో రూ.2,000 కోట్ల భారం ప్రభుత్వంపై ఉంది. డీఏలు, ఐఆర్ భారం కొనసాగుతున్న సమయంలో పీఆర్సీ అమలు చేస్తే ఖజానాపై ఒత్తిడి మరింత పెరగనుంది.
పీఆర్సీ నివేదిక తర్వాతే నిర్ణయం
రిటైర్డ్ అధికారి ఎన్ శివశంకర్ అధ్యక్షతన ఏర్పాటైన పీఆర్సీ తన నివేదికను సమర్పించిన తర్వాత కొత్త వేతన స్కేల్ అమలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఫిట్‌మెంట్ ఎంత ఇవ్వాలన్నదానిపై కమిషన్ సిఫారసులు కీలకం కానున్నాయి. ప్రస్తుత వేతన స్కేల్‌తోపాటు ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను కూడా పీఆర్సీ పరిశీలించాల్సి ఉంది. రాష్ట్ర ఆదాయ వృద్ధి, ప్రభుత్వ ఆర్థిక బాధ్యతలు, కొనసాగుతున్న పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో ఉద్యోగుల వేతన పెంపుతోపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా పీఆర్సీ సిఫారసుల అమలులో కీలకంగా మారనుంది.
కొత్త డీఏతో మరో భారం
2026 జూలై నుంచి అమలయ్యే మరో డీఏపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 2027 జనవరిలో మరో డీఏ పెండింగ్‌లోకి రానుంది. ఇప్పటికే ఉన్న బకాయిలకు తోడు కొత్త డీఏలు చేరుతుండటంతో వేతనాల వ్యయం మరింత పెరిగే పరిస్థితి ఉంది. 2024 జూలై నుంచి రావాల్సిన డీఏ బకాయిలను విడతలవారీగా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. మొత్తం బకాయిలను ఎప్పటిలోగా చెల్లిస్తారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఒకవైపు పెండింగ్ బకాయిలు, మరోవైపు కొత్త డీఏలు.. ఇంకోవైపు పీఆర్సీ అమలు భారం ప్రభుత్వ ఆర్థిక లెక్కల్లో కీలకంగా మారాయి.
ఖజానాపై ఒత్తిడి.. పీఆర్సీపై ఆచితూచి?
సంక్షేమ పథకాల వ్యయం, అప్పులపై వడ్డీ చెల్లింపులు, ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతున్నాయి. రాష్ట్ర మొత్తం రెవెన్యూ వ్యయంలో ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలకే 21 శాతానికి పైగా వెచ్చిస్తున్నట్లు అంచనాలు ఉన్నాయి. వడ్డీ చెల్లింపులను కలిపితే ఈ వ్యయం దాదాపు 40 శాతానికి చేరుతోంది. ఈ నేపథ్యంలో పెండింగ్ డీఏలు, బకాయిలను దశలవారీగా సర్దుబాటు చేస్తూనే పీఆర్సీ సిఫారసుల అమలుపై ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. పీఆర్సీ నివేదిక రావడం ఒక ఎత్తయితే.. దాన్ని ఎప్పుడు అమలు చేస్తారు? ఎంత ఫిట్‌మెంట్ ఇస్తారు? అన్నదే కీలకంగా మారింది. ఫిట్‌మెంట్ పెరిగే కొద్దీ ప్రభుత్వంపై పడే వార్షిక భారం కూడా పెరగనున్న నేపథ్యంలో.. పీఆర్సీ అమలుపై సర్కారు తీసుకునే నిర్ణయం కోసం ఉద్యోగ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Aishwarya Rajesh | గ్లామర్ రూటులో ఐశ్వర్య రాజేష్ - హాట్ ఫొటోలతో షేక్
- ●K Laxman | సేవ్ డెమోక్రసీ కాదు.. సేవ్ డైనాస్టీ మార్చ్ : కే లక్ష్మణ్
- ●Gutka Manufacturing Unit | ఇంట్లో గుట్కా తయారీ కేంద్రం.. గుట్టురట్టు చేసిన పోలీసులు
- ●B. Narsing Rao | తెలంగాణ దర్శకుడు బీ నర్సింగరావుకు గౌరవ డాక్టరేట్
- ●Asian Games | 44 ఏళ్ల నిరీక్షణకు తెర..! ఆసియా కప్ వుమెన్స్ హాకీలో భారత్కు స్వర్ణం
- ●BMS Nanda Kishore | ఆటో డ్రైవర్లూ.. కనీస ఛార్జీ రూ.50 వసూలు చేయండి: బీఎంఎస్ పిలుపు

Aishwarya Rajesh | గ్లామర్ రూటులో ఐశ్వర్య రాజేష్ - హాట్ ఫొటోలతో షేక్

K Laxman | సేవ్ డెమోక్రసీ కాదు.. సేవ్ డైనాస్టీ మార్చ్ : కే లక్ష్మణ్

Gutka Manufacturing Unit | ఇంట్లో గుట్కా తయారీ కేంద్రం.. గుట్టురట్టు చేసిన పోలీసులు

B. Narsing Rao | తెలంగాణ దర్శకుడు బీ నర్సింగరావుకు గౌరవ డాక్టరేట్




