త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | ఆసుప‌త్రుల నిర్మాణ ప‌నుల్లో వేగం పెంచండి

Revanth Reddy | ఎల్బీనగర్, అల్వాల్, వరంగల్, ఉస్మానియా ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

S

Telangana | Published On Oct 3, 2026, 3.32 pm IST

Revanth Reddy | ఆసుప‌త్రుల నిర్మాణ ప‌నుల్లో వేగం పెంచండి
Advertisement
  • విద్య, వైద్యం క్షేత్రస్థాయి పరిస్థితులపై స‌మీక్ష‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Revanth Reddy | త్రినేత్ర న్యూస్‌: ఎల్బీనగర్, అల్వాల్, వరంగల్, ఉస్మానియా ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఆసుపత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది అవసరాలను గుర్తించి నియామక ప్రక్రియను మొదలు పెట్టాలని, ఆసుపత్రుల నిర్మాణం పూర్తయ్యే నాటికి సిబ్బంది కొరత లేకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. శనివారం సీఎంవో అధికారులతో ఆయ‌న‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆసుపత్రుల నిర్మాణం, పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంత‌రం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్య, వైద్యానికి సంబంధించిన క్షేత్రస్థాయి పరిస్థితులపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఆసుపత్రుల్లో అవసరమైన అత్యాధునిక పరికారాలను కొనుగోలు చేసి, ఆసుపత్రుల నిర్మాణం పూర్తయ్యేనాటికి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించేలా చూడాలని సూచించారు. జిల్లా కలెక్టర్లతో పాటు అధికారులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, ఆసుపత్రులను సందర్శించాల్సిందేనని స్పష్టం చేశారు. ఆయా జిల్లాల‌కు సంబంధించి జిల్లా స్థాయిలో ప్రతీ వారం వీటిపై సమీక్ష నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాఠశాలల్లో అవసరమైన చోట మరమ్మతు పనులను చేపట్టాలని తెలిపారు.

గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు సిద్ధం చేయండి..

భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబరులో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 ఏర్పాట్లపైనా సమావేశంలో అధికారులతో చర్చించారు. సమ్మిట్ ఏర్పాట్లు, అతిథులు, పెట్టుబడుల విషయంలో పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. త్వరలోనే ఏర్పాట్లను పరిశీలిస్తానని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, సీఎంవో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement