త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | మ‌హారాష్ట్ర‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం కండి.. తుమ్మ‌డిహెట్టి నివేదిక‌ల‌న్నీ రెడీగా ఉంచండి

Revanth Reddy | తుమ్మిడిహెట్టిపై త్వ‌ర‌లోనే మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల‌కు సిద్ధం కావాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అధికారుల‌ను ఆదేశించారు.

S

Telangana | Published On Oct 23, 2026, 3.57 pm IST

Revanth Reddy | మ‌హారాష్ట్ర‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం కండి.. తుమ్మ‌డిహెట్టి నివేదిక‌ల‌న్నీ రెడీగా ఉంచండి
Advertisement
  • 152 మీట‌ర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించేలా ఒప్పిద్దాం
  • శ్రీ‌శైలం, నార్లాపూర్ నుంచి నీళ్లు వ‌చ్చేలా ఏర్పాట్లు చేయండి
  • ఏదుల నుంచి నీళ్లు వ‌ద‌లండి.. పాల‌మూరుకు ఢోకా ఉండ‌దు
  • ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

Revanth Reddy | త్రినేత్ర న్యూస్‌: తుమ్మిడిహెట్టి (Tummidihetti Barrage)పై త్వ‌ర‌లోనే మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల‌కు సిద్ధం కావాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అధికారుల‌ను ఆదేశించారు. ఈనెల 23 త‌ర్వాత చ‌ర్చ‌ల‌కు పిలుస్తాన‌ని మ‌హారాష్ట్ర సీఎం సూచ‌న‌ప్రాయంగా చెప్పిన‌ట్లు తెలిపారు. నివేదిక‌ల‌న్నీ సిద్ధంగా ఉంచాల‌ని.. 152 మీట‌ర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మ‌హారాష్ట్ర‌ను ఒప్పించాల‌న్నారు. ఇక శ్రీశైలం, నార్లాపూర్ నుంచి నీళ్లు వ‌చ్చేలా ప్ర‌త్యామ్నాయ ఏర్పాటు చేస్తే పాల‌మూరుకు ఢోకా ఉండ‌ద‌న్నారు. హైద‌రాబాద్ బోధి పెవిలియన్లో శుక్ర‌వారం నిర్వ‌హించిన సమీక్ష సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

అటవీ, గిరిజన వెనుకబడ్డ ప్రాంతమైన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించేందుకు వీలుగా బ్యారేజీ ఎత్తు ఉండాలి. అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. 152 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మించేందుకు మహారాష్ట్రను ఒప్పించేందుకు వీలుగా అవసరమైన అన్ని నివేదికలు సిద్దంగా ఉంచాలి. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశాల వివరాలన్నీ అందుబాటులో ఉంచుకోవాలి.

డిండి ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీ, అచ్చంపేట ఎత్తిపోతలకు 0.1 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయాలి. అందుకు వీలుగా శ్రీశైలం, నార్లాపూర్ నుంచి 0.6 టీఎంసీల నీటిని ఏదుల వరకు అదనంగా తెచ్చుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. అందుకు అవసరమైన పంప్ హౌజులు, పంపులు, సిస్టమ్ వెంటనే చేపట్టాలి అని రేవంత్ అధికారుల‌ను ఆదేశించారు. అయితే 152 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మిస్తే ఎంత నీటిని తీసుకునే వీలుంది.. మహారాష్ట్ర పరిధిలో ఎంతమేరకు ముంపునకు గురవుతుందో ఈ సంద‌ర్భంగా అధికారులు సీఎంకు వివ‌రించారు.

ఈ స‌మీక్ష స‌మావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్‌బాబు, రాజ్యసభ సభ్యులు ఎంపీ వేంనరేందర్‌రెడ్డితో పాటు ఇరిగేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement