త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchander Rao | హిందూ దేవుళ్లను విభజిస్తారా?

Ramchander Rao | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హిందూ దేవుళ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ఈ మధ్య అసంబద్ధంగా మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

P

Telangana | Published On Sep 29, 2026, 5.34 pm IST

Ramchander Rao | హిందూ దేవుళ్లను విభజిస్తారా?
Advertisement
  • రాముడైనా, శివుడైనా పేదల దేవుడే
  • ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక‌ల కోస‌మే అడ్డ‌గోలు వ్యాఖ్య‌లు
  • బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు
  • సీఎం రేవంత్ బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్‌
  • ఇక‌పై ఇలాంటి వ్యాఖ్య‌లు స‌హించ‌బోమ‌ని వార్నింగ్‌

Ramchander Rao | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హిందూ దేవుళ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ఈ మధ్య అసంబద్ధంగా మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు మ‌తిస్థిమితం లేకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నార‌ని.. ఆయ‌న‌కు స‌రైన వైద్యం అందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వ్యాఖ్యానించారు. హిందువులకు వేర్వేరు దేవుళ్లు ఉన్నార‌ని రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని రాంచందర్‌రావు అన్నారు. తాగేవాళ్లకు వేరే దేవుడు ఉన్నాడని, మాంసం తినేవాళ్లకు వేరే దేవుళ్లు ఉన్నారని, డ్యాన్స్‌ చేసేవాళ్లకు వేరే దేవుళ్లు ఉన్నారని సీఎం అంటున్నారని విమర్శించారు. ‘మరి నీకు ఏ దేవుడు ఉన్నాడో నాకైతే తెల్వదు’ అంటూ రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాముడు వేరు.. శివుడు వేరు అంటున్నారని రాంచందర్‌రావు ఆరోపించారు. ‘జై శ్రీరామ్‌’ అంటారు నరేంద్ర మోదీ.. ‘నేను హర హర మహాదేవ్‌ అంటాను’ అని సీఎం అంటున్నారని.. రాముడు ధనికుల దేవుడు అని.. శివుడు పేదల దేవుడు అని రేవంత్‌రెడ్డి అంటున్నారని ఆరోపించారు. ఏ దేవుడైనా పేదల దేవుడేనని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.

ఎవ‌రికి క‌ష్టం వ‌చ్చినా దేవుడి త‌ల‌చుకుంటం..

ఎవరికి ఎప్పుడు కష్టాలు వచ్చినా దేవుడినే గుర్తు చేసుకుంటామని రాంచందర్‌రావు అన్నారు. అది రాముడైనా, కృష్ణుడైనా, శివుడైనా ప్రజలు దేవుడినే ప్రార్థిస్తారని చెప్పారు. ‘రేవంత్‌రెడ్డి కష్టాలు ఏమీ లేవు కదా? ఈ మధ్య భూములు బాగానే అమ్ముతున్నడు. బాగానే డబ్బులు వచ్చినయ్‌. ఆయనకు ఏమీ కష్టాలు లేవు’ అని వ్యాఖ్యానించారు. రాజీవ్‌ మల్హోత్రా రాసిన ‘బ్రేకింగ్‌ ఇండియా’ పుస్తకాన్ని అందరూ చదవాలని రాంచందర్‌రావు సూచించారు. ‘హౌ టు బ్రేక్‌ ఇండియా’ అంటే ఇదేనని వ్యాఖ్యానించారు. ‘బ్రేక్‌ ఇండియా’ అనేది నేమ్‌ ఆఫ్‌ రిలీజియన్‌ అని పేర్కొన్నారు. ‘ముస్లిం ఈజ్‌ కాంగ్రెస్‌.. కాంగ్రెస్‌ ఈజ్‌ ముస్లిం’ అని రేవంత్‌రెడ్డి అన్నారని రాంచందర్‌రావు ఆరోపించారు. అప్పటి నుంచి రేవంత్‌రెడ్డి ‘రేవంతుద్దీన్‌’ అయిపోయారని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ‘రేవంతుద్దీన్‌ అయ్యాక కల్మా చదివి రాముడు ఎవరు? కృష్ణుడు ఎవరు అని అడుగుతున్నావా? రాముడు.. శివుడు వేరు అంటావా?’ అని ప్రశ్నించారు. సౌత్‌, నార్త్‌ను విభజిస్తారా? అని రాంచందర్‌రావు ప్రశ్నించారు. కులాలు, మతాలుగా ప్రజలను విభజిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు హిందూ దేవుళ్లను సైతం విభజిస్తున్నారని మండిపడ్డారు. మతి ఉన్న వారు ఎవరైనా ఇలా మాట్లాడరని రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పదవిలో ఉంటూ ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడటం దేశ ప్రజలను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను అవమానపరిచినట్లేనని ఆరోపించారు. రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ చెప్పినట్లుగా హిందూ దేవీదేవతలను అవమానపరిచే విధంగా మాట్లాడడాన్ని బీజేపీ ఖండిస్తోందన్నారు.

ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక కోసమే..

ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలు వస్తున్నాయని, ఇప్పుడు ముస్లింలను ఏకం చేయాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని రాంచందర్‌రావు ఆరోపించారు. నియోజకవర్గంలో 50–60 వేల ముస్లిం ఓట్లు ఉన్నాయని, అవి తమకే రావాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అందుకే హిందూ దేవీదేవతలపై వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ దేవీదేవతలపై మాట్లాడొద్దని రాంచందర్‌రావు హెచ్చరించారు. కాంగ్రెస్‌ నాయకులు, ముఖ్యంగా రేవంత్‌రెడ్డి, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను బీజేపీ హెచ్చరిస్తోందన్నారు. ‘ఇకపై ఇలాంటి అవమానాలను మేం భరించం’ అని స్పష్టం చేశారు. తెలంగాణలో హిందువులు ఇలాంటి అవమానాలను భారీగా భరించారని, ఇకపై భరించేది లేదని రేవంత్‌రెడ్డికి స్పష్టం చేస్తున్నామని అన్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ప్రతి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని రాంచందర్‌రావు ప్రకటించారు. హిందూ దేవీదేవతలను అవమానించే వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమిస్తుందని తెలిపారు. ఈ రోజు హిందూ దేవాలయాలకు వెళ్లేందుకు సీఎం రేవంత్‌రెడ్డికి అర్హత లేదని రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. ‘మీరు హిందువులను అవమానిస్తున్నారు. హిందువులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement