త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tummala Nageshwar Rao | యాంత్రీక‌ర‌ణ ప‌థ‌కం.. ఈసారి స‌బ్సిడీ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లోకే..

Tummala Nageshwar Rao | రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, సహకార శాఖల పరిధిలోని పలు అంశాలపై ఉన్నతాధికారులతో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణ, ఎరువుల లభ్యత, యూరియా సరఫరా, వ్యవసాయ యాంత్రీకరణ, రైతు వేదికలపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

S

Telangana | Published On Aug 28, 2026, 7.03 pm IST

Tummala Nageshwar Rao | యాంత్రీక‌ర‌ణ ప‌థ‌కం.. ఈసారి స‌బ్సిడీ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లోకే..
Advertisement

యాంత్రీకరణ పథకంలో ఇచ్చే పనిముట్లు ఖరారు
ఎంప్యానెల్ లిస్టును పరిశీలిస్తున్న హాకా అధికారులు
కేంద్ర ప్రభుత్వ యాప్‌పై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి
కాంప్లెక్స్ ఎరువులకు కూడా సబ్సిడీ ఇవ్వండి
ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణలో వేగం పెంచాలి
రెండు మూడు రోజుల్లోనే ఆయిల్‌పామ్‌ మొక్కలు అందేలా చర్యలు
రైతు వేదికలపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటును 2, 3 నెలలో పూర్తిచేయాలి
సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష

Tummala Nageshwar Rao | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, సహకార శాఖల పరిధిలోని పలు అంశాలపై ఉన్నతాధికారులతో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణ, ఎరువుల లభ్యత, యూరియా సరఫరా, వ్యవసాయ యాంత్రీకరణ, రైతు వేదికలపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

రైతుల అవసరాలకు అనుగుణంగా పనిముట్ల ఎంపిక

రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేయడంతో పాటు, సాగు ఖర్చులను తగ్గించేందుకు అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకంపై మంత్రి సమీక్షించారు. ఈ పథకం కింద రైతులకు అందించాల్సిన వ్యవసాయ పనిముట్లను ఖరారు చేసినట్లు తెలిపారు. రైతుల అవసరాలకు అనుగుణంగా పనిముట్ల ఎంపిక చేసి, వాటి పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈసారి యాంత్రీకరణ పథకం కింద అందించే సబ్సిడీ నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. మధ్యవర్తిత్వానికి అవకాశం లేకుండా, పారదర్శకంగా లబ్ధిదారులకు ప్రయోజనం అందేలా వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. యాంత్రీకరణ పథకంలో పనిముట్లు సరఫరా చేసే సంస్థల ఎంప్యానెల్‌మెంట్‌ ప్రక్రియను హాకా అధికారులు పరిశీలిస్తున్నారని మంత్రి తెలిపారు. నాణ్యత, ధర, రైతులకు అందుబాటు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంప్యానెల్‌ లిస్టును త్వరగా ఖరారు చేయాలని సూచించారు.

యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవు..

రాష్ట్రంలో యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన ఫెర్టిలైజర్ యాప్‌ ద్వారా వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ రైతులకు యూరియాను సరఫరా చేస్తున్నామని తెలిపారు. నిన్న కొన్ని జిల్లాల్లో వచ్చిన సమస్యలను కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడే పరిష్కరించినట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా 2.79, డీఏపీ 0.33, కాంప్లెక్స్‌ ఎరువులు 2.25, ఎంఓపీ 0.31, ఎస్‌ఎస్‌పీ 0.20 లక్షల మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఆగస్టు సరఫరా ప్రణాళికలో భాగంగా 1.50 లక్షల మెట్రిక్‌ టన్నులకు గాను 1.17 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను రాష్ట్రానికి తెప్పించగలిగామని తెలిపారు. ఏప్రిల్‌ 2026 నుంచి ఇప్పటి వరకు యూరియా 6.65, డీఏపీ 2.59, కాంప్లెక్స్‌ 6.37, ఎంఓపీ 0.27, ఎస్‌ఎస్‌పీ 0.42 లక్షల మెట్రిక్‌ టన్నుల అమ్మకాలు జరిగాయని, గత ఏడాది ఇదే సమయానికి వరుసగా 7.32, 2.12, 7.33, 0.23, 0.27 లక్షల మెట్రిక్‌ టన్నుల అమ్మకాలు జరిగినట్లు వివరించారు. రాష్ట్ర యూరియా యాప్‌ ద్వారా 33.37 లక్షల మంది రైతులు 1.38 కోట్ల యూరియా సంచులను బుక్‌ చేసుకోగా, 1.24 కోట్ల సంచులను కొనుగోలు చేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ ద్వారా 10.17 లక్షల మంది రైతులు 42.34 లక్షల సంచులను బుక్‌ చేసుకుని, 28.39 లక్షల సంచులను కొనుగోలు చేసినట్లు చెప్పారు.

ఎరువుల లభ్యత, కొనుగోలు ప్రక్రియపై స్పష్టమైన సమాచారం

కేంద్ర ప్రభుత్వ ఫెర్టిలైజర్‌ యాప్‌లో మ్యాపింగ్‌ ఆలస్యం తదితర కారణాలతో వచ్చే సమస్యలను జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారుల నుంచి ఎప్పటికప్పుడు తెలుసుకుని, కేంద్ర అధికారులతో మాట్లాడి అదే రోజు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ డైరెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఫెర్టిలైజర్‌ యాప్‌ వినియోగంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. యాప్‌లో బుకింగ్‌, ఎరువుల లభ్యత, కొనుగోలు ప్రక్రియ తదితర అంశాలపై రైతులకు స్పష్టమైన సమాచారం అందేలా వ్యవసాయశాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాల కారణంగా సరఫరా వ్యవస్థపై ఒత్తిడి ఉన్నప్పటికీ, రాష్ట్రానికి అవసరమైన యూరియాను అందించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపట్టిందన్నారు. కేంద్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన ఎరువుల కేటాయింపులు, సరఫరా కోసం చర్యలు తీసుకున్నామని తెలిపారు. పోర్టుల వద్ద ప్రత్యేక అధికారులను నియమించి, అక్కడికి చేరిన యూరియాను ఆలస్యం లేకుండా జిల్లాలకు తరలించేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు.

కాంప్లెక్స్‌ ఎరువులకు కూడా సబ్సిడీ ఇవ్వాలి..

కేంద్ర ప్రభుత్వం కేవలం యూరియాకే కాకుండా కాంప్లెక్స్‌ ఎరువులకు కూడా సబ్సిడీ ఇవ్వాలని మంత్రి తుమ్మల కోరారు. యూరియాకు సబ్సిడీ ఇచ్చి, ఇతర ఎరువులకు తగిన సబ్సిడీ లేకపోవడంతో రైతులు తక్కువ ధరలో లభించే యూరియాను అధికంగా వినియోగించే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. “ఎరువుల ధరల విధానాన్ని సమతుల్యంగా రూపొందించాలి. అన్ని రకాల ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించే విధంగా సబ్సిడీ విధానం ఉండాలి. లేకపోతే సబ్సిడీ అధికంగా ఉన్న యూరియాను ఎక్కువగా వినియోగించే పరిస్థితిని కేంద్ర ప్రభుత్వమే రైతులకు కల్పించినట్లవుతుంది” అని మంత్రి పేర్కొన్నారు. “యూరియా పంటలను రక్షించే ఎరువు కాదు.. భక్షించే ఎరువు” అని వ్యాఖ్యానిస్తూ, నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ పంటలకు అవసరమైన అన్ని పోషకాలను సమతుల్యంగా అందించే విధంగా రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణలో వేగం పెంచాలి..

రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. రైతుల్లో పెరుగుతున్న ఆసక్తికి అనుగుణంగా మొక్కల లభ్యతను పెంచడంతో పాటు, సకాలంలో మొక్కలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడ డిమాండ్‌ ఎక్కువగా ఉంటే ఆ జిల్లాకు మొక్కల సరఫరాలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు మొక్కలు లేవనే సమాధానం రాకూడదని, రెండు మూడు రోజుల్లోనే మొక్కలు అందేలా సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించారు.

లక్ష్యానికి రెండింతల మొక్కలు నర్సరీల్లో సిద్ధం చేయాలి..

నర్సరీల్లో నిర్ణయించిన లక్ష్యానికి కనీసం రెండింతల సంఖ్యలో మొక్కలను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. అన్ని శాఖల వద్ద ఉన్న భూముల వివరాలను తెప్పించుకొని, నర్సరీలకు భూమి అవసరమైతే ఇతర శాఖల ఖాళీ స్థలాలను లీజు ప్రాతిపదికన వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ సెక్రటరీని ఆదేశించారు. ఆయిల్‌పామ్‌ సాగులో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచేందుకు డ్రిప్‌ ఇరిగేషన్‌ కీలకమని మంత్రి అన్నారు. డ్రిప్‌ కంపెనీలతో చర్చించి, ఆయిల్‌పామ్‌ కంపెనీలు రైతులకు త్వరగా డ్రిప్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయిల్‌ఫెడ్‌ ఎండీని ఆదేశించారు. ఆయిల్‌పామ్‌ మిల్లుల నిర్మాణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి, రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

2600 రైతు వేదికలపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయాలి..

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2600 రైతు వేదికలపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. అన్ని రైతు వేదికలపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసేలా, దశలవారీగా అమలు కార్యాచరణను రూపొందించి, వాటిని 2, 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నోడల్‌ సంస్థగా ఉన్న హాకా, రెడ్కో కమిషనర్‌తో సమన్వయం చేసుకుని రైతు వేదికలపై సోలార్‌ ప్యానెల్స్‌ త్వరగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని హాకా ఎండీని ఆదేశించారు. ఈ అంశంపై మంత్రి తుమ్మల రెడ్కో కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి, రైతు వేదికలపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణ, సాంకేతిక అంశాలు, సాధ్యాసాధ్యాలను పరిశీలించి ముందుకు వెళ్లాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, కోఆపరేషన్ స్పెషల్ కమిషనర్ రాహుల్ రాజ్, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ భాషా, హాకా ఎండీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement