త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | రూ.150 కోట్ల‌తో మూడు మండ‌లాల్లో శాశ్వ‌త క‌రువు నివార‌ణ చ‌ర్య‌లు

Ponguleti Srinivas Reddy | కరువు పరిస్థితులు ఎప్పుడు తలెత్తినా ప్రజలు, రైతులు తట్టుకునేలా రాష్ట్రంలోని మూడు మండ‌లాల్లో 150 కోట్ల రూపాయిల‌తో శాశ్వత నివారణ చర్యలు చేప‌ట్ట‌నున్న‌ట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

S

Telangana | Published On Oct 24, 2026, 8.03 pm IST

Ponguleti Srinivas Reddy | రూ.150 కోట్ల‌తో మూడు మండ‌లాల్లో శాశ్వ‌త క‌రువు నివార‌ణ చ‌ర్య‌లు
Advertisement

మిడ్జిల్, ఉప్పునూతల, మక్తల్ మండలాల ఎంపిక
ప్రతి గ్రామంలో గ్రామసభ ద్వారా ప్రజల అభిప్రాయాల మేరకు ప్రణాళికలు రూపొందించాలి
స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రాజెక్టు అమలు
ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి సద్వినియోగం కావాలి
ప్రజలందరి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర న్యూస్ : కరువు పరిస్థితులు ఎప్పుడు తలెత్తినా ప్రజలు, రైతులు తట్టుకునేలా రాష్ట్రంలోని మూడు మండ‌లాల్లో 150 కోట్ల రూపాయిల‌తో శాశ్వత నివారణ చర్యలు చేప‌ట్ట‌నున్న‌ట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌ల మేర‌కు నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, రైతు కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా కేంద్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా చారిత్రకంగా కరువు ప్రభావానికి గురవుతున్న ప్రాంతాలు, వర్షాధార వ్యవసాయం అధికంగా ఉన్న జిల్లాలు, సామాజిక–ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలు, రైతు కుటుంబాల జీవనోపాధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రాంతాల‌ను ఎంపిక చేసిన‌ట్లు వెల్ల‌డించారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా మిడ్జిల్, నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా ఉప్పునూత‌ల‌, నారాయ‌ణ‌పేట్ జిల్లా మ‌క్త‌ల్ మండ‌లాల‌ను ఎంపిక చేసిన‌ట్లు తెలిపారు. జాతీయ విప‌త్తుల నిర్వ‌హ‌ణ నిధి (ఎన్‌డిఎఫ్‌) స‌హ‌కారంతో ఈ ప్రాజెక్ట్ చేప‌ట్టిన‌ట్లు చెప్పారు.

శనివారం రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, విపత్తు నిర్వహణ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో కరువు-నిరోధక వ్యవసాయ విధానం అమలు, కరువు పీడిత ప్రాంతాల్లో శాశ్వత పరిష్కార మార్గాల అన్వేషణ, ప్రతిపాదిత ప్రాజెక్టు కార్యాచరణ, నిధుల సమర్థ వినియోగం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ మొత్తం ప్రాజెక్ట్‌కు ప్ర‌కృతి విపత్తుల శాఖ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో వ్య‌వ‌సాయ శాఖ నోడ‌ల్ ఏజ‌న్సీగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ను ప‌క‌డ్బందీగా అమ‌లు చేయ‌డానికి ప్ర‌జాప్ర‌తినిధుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకొని గ్రామ మండ‌ల స్థాయిలో క‌మిటీల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు.

ఈ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాల‌ను మెరుగుపరచడంతోపాటు, వర్షాభావ పరిస్థితుల్లో ప్ర‌జ‌ల‌కు ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను తగ్గించేందుకు చర్యలు చేపడ‌తార‌ని తెలిపారు. కరువు నివారణ ప్రాజెక్టు అమలులో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసుకోవాలని, ఎంపిక చేసిన మండలాల్లోని ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలు, స్థానిక అవసరాలకు అనుగుణంగా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి లక్ష్యాన్ని చేరేలా, పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు క్షేత్రస్థాయిలో నెరవేరుతాయని తెలిపారు.

మహిళలు, యువత, రైతులు, కులవృత్తులపై ఆధారపడిన కుటుంబాలు సహా సమాజంలోని అన్ని వర్గాల అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. కరువు ప్రభావం ఒక్క వ్యవసాయ రంగానికే పరిమితం కాకుండా గ్రామీణ ఉపాధి, కుటుంబ ఆదాయాలు, సంప్రదాయ వృత్తులపై కూడా పడుతుందని పేర్కొన్నారు. అందువల్ల ప్రతి వర్గానికి ప్రయోజనం చేకూరేలా, స్థానిక పరిస్థితులకు తగిన శాశ్వత పరిష్కారాలతో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించే ప్రతి రూపాయి సద్వినియోగం కావాలని మంత్రి స్పష్టం చేశారు. నిధుల వినియోగం, పనుల ఎంపిక, అమలు విధానం, క్షేత్రస్థాయి ఫలితాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు. కేవలం నిధుల ఖర్చు, పనుల పూర్తితోనే ప్రాజెక్టు విజయాన్ని అంచనా వేయకుండా, ప్రజలకు ఎంత మేరకు ప్రయోజనం చేకూరింది, కరువు సమస్యను పరిష్కరించడంలో ఎంత పురోగతి సాధించామన్నది ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో విపత్తు నిర్వహణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, వ్యవసాయ శాఖ కమిషనర్ సురేంద్రమోహన్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎన్. గోపి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement