త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jawaharnagar dump yard | ప్ర‌పంచంలోనే.. మీథేన్ గ్యాస్ విడుద‌ల‌లో జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ డంప్ యార్డ్ నాలుగో స్థానం

Jawaharnagar dump yard | హైద‌రాబాద్ న‌గ‌రానికి కూత‌వేటు దూరంలో ఉన్న జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ డంప్ యార్డు( Jawaharnagar dump yard ).. మీథేన్ గ్యాస్( Methane Gas ) విడుద‌ల చేయ‌డంలో ప్రపంచ రికార్డు( చెత్త రికార్డు) సాధించింది. ప్ర‌పంచంలోనే నాలుగో స్థానంలో ఈ డంప్ యార్డు నిలిచింది.

S

Telangana | Published On Oct 21, 2026, 2.39 pm IST

Jawaharnagar dump yard | ప్ర‌పంచంలోనే.. మీథేన్ గ్యాస్ విడుద‌ల‌లో జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ డంప్ యార్డ్ నాలుగో స్థానం
Advertisement

23న జవహర్ నగర్ బాధితులతో సమావేశం
25న మేధావులు, పర్యావరణ వేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం.
27 నుండి డంప్ యార్డుకి వ్యతిరేకంగా బీజేపీ ఎంపీ ఈట‌ల‌ పాదయాత్ర

Jawaharnagar dump yard | త్రినేత్ర న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రానికి కూత‌వేటు దూరంలో ఉన్న జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ డంప్ యార్డు( Jawaharnagar dump yard ).. మీథేన్ గ్యాస్( Methane Gas ) విడుద‌ల చేయ‌డంలో ప్రపంచ రికార్డు( చెత్త రికార్డు) సాధించింది. ప్ర‌పంచంలోనే నాలుగో స్థానంలో ఈ డంప్ యార్డు నిలిచింది. ఈ క్ర‌మంలో సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ విద్యార్థులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ.. తాజా ప‌రిస్థితిని మ‌ల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్‌కు వివ‌రించారు. దీంతో జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ డంప్ యార్డు బాధితుల‌కు మ‌ద్ద‌తుగా త‌న కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించారు.

గ్లోబల్ వార్మింగ్‌కి, వాతావరణ మార్పులకు కారణమైన ముఖ్యమైన వాటిలో మీథేన్ గ్యాస్ కూడా ఒకటి. మీథేన్ గ్యాస్ కాలుష్యం తగ్గించడం ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్. ఉపగ్రహాల సహాయంతో ప్రపంచంలో మీథేన్ కాలుష్యం ఎక్కువ ఉన్న ప్రాంతాలను గుర్తించారు. 18 దేశాల్లో మొదటి 25 స్థానాల్లో ఉన్న ప్రాంతాలను UCLA law school ప్రకటించింది. ఈ రిపోర్ట్ ప్రకారం నాలుగవ స్థానంలో జవహర్ నగర్ డంప్ యార్డు ఉంది. అర్జెంటీనా దేశ రాజధాని బ్యూనస్ ఐరిష్ మొదటి స్థానం, ఇండోనేషియా దేశ రాజధాని జకార్తా రెండవ స్థానంలో, మలేషియా రాజధాని కౌలాలంపూర్ మూడవ స్థానంలో ఉండగా.. జవహర్ నగర్ డంప్ యార్డు నాలుగవ స్థానంలో నిలిచింది అని సెంట్రల్ యూనివర్సిటీ నుండి వచ్చిన విద్యార్థులు ఈటల రాజేందర్ కు వివరించారు.

విషపు గాలులతో ఊపిరితిత్తుల సమస్యలు :  ఎంపీ ఈట‌ల

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. జవహర్ నగర్ డంప్ యార్డు రెండు లక్షల జనాభా కోసం ఏర్పాటు చేయబడింది. కానీ ఇప్పుడు కోటి 60 లక్షల మందికి చెందిన చెత్త ఇక్కడికి వస్తుంది. చుట్టూ 25 కిలోమీటర్ల రేడియస్‌లో భూగర్భ జలాలు విషతుల్యం అయ్యాయి. 30 కిలోమీటర్ల రేడియస్‌లో ఉన్న ప్రజలకు విషపు గాలులతో ఊపిరితిత్తుల సమస్యలు, చర్మ సమస్యలు వస్తున్నాయి. కూరగాయలు అమ్ముకొని, ఇళ్ల‌ల్లో పని చేసుకుని కడు బీదరికంలో ఉన్నవారు సంపాదించుకునే ప్రతి పైసా ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టాల్సిన దుస్థితి వచ్చింది. జనావాసాలకు దూరంగా డంపింగ్ తరలించాలని అనేక సంవత్సరాలుగా ఉద్యమం నడుస్తుంది అని ఈట‌ల రాజేంద‌ర్ గుర్తు చేశారు.

జీరో పొల్యూషన్ దిశగా అడుగులు వేయాలి

ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా చెత్త వల్ల ఇన్ని సమస్యలు ఎదుర్కొనే దుర్మార్గమైన పరిస్థితికి చరమగీతం పాడాలి. ఐఐటి బాంబే వారు ఇలాంటి చెత్త డంపు యార్డుల నిర్వహణ కోసం టెక్నాలజీ కూడా అందించారు.. కానీ ఈ ప్రభుత్వం వాటిని అందిపుచ్చుకోవడం లేదు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ప్రగల్భాలు పక్కనపెట్టి ఈ సమస్య నుంచి ఇక్కడి ప్రజలకు శాశ్వత పరిష్కారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాను. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు తప్ప సమస్యకు పరిష్కారం దొరకలేదు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా దీని మీద రీసెర్చ్ చేశారు.. ఇది ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద డంపింగ్ యార్డ్ అని, ఎక్కువ విష పదార్థాలను విడుదల చేస్తున్న డంప్ యార్డ్ ఇది.. వెంటనే తగు చర్యలు తీసుకోకపోతే ఇక్కడ నివసించే ప్రజలకు ఎక్కువ సమస్యలు వస్తాయని చెప్తున్నారు. వీరి సూచనలు పాటించి జీరో పొల్యూషన్ దిశగా అడుగులు వేయాలి. నాలుగు దిక్కులా చెత్తను పంపించి ఇక్కడకు రాకుండా చూడాలి అని ఈట‌ల రాజేంద‌ర్ కోరారు.

27 నుండి పాద‌యాత్ర

డంప్ యార్డుకి వ్యతిరేకంగా ఈ నెల 23న జవహర్ నగర్ బాధితులతో జవహర్ నగ‌ర్‌లోనే స‌మావేశం నిర్వ‌హిస్తామ‌న్నారు. 25న మేధావులు, పర్యావరణ వేత్తలతో డంప్ యార్డు ఏరియాలోనే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వ‌హించి, 27 నుండి డంప్ యార్డుకి వ్యతిరేకంగా పాదయాత్ర చేప‌ట్ట‌నున్న‌ట్లు ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ తెలిపారు.

Advertisement
Advertisement