త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల జీతాలు పెంచాల్సిందే: హరీశ్ రావు

Harish Rao | సిద్దిపేట (Siddipet) స్వచ్ఛత వెనుక పారిశుధ్య కార్మికుల రెక్కల కష్టం ఉంద‌ని బీఆర్ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) అన్నారు. సిద్దిపేటకు దేశంలోనే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు వచ్చాయంటే అది తన గొప్పతనం కాద‌ని.. చలిని, వానను లెక్కచేయకుండా చీపురు పట్టి శ్రమించిన మున్సిపల్ పారిశుధ్య కార్మికుల రెక్కల కష్టమేని చెప్పారు.

G

Telangana | Published On Oct 19, 2026, 1.36 pm IST

Harish Rao | పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల జీతాలు పెంచాల్సిందే: హరీశ్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర న్యూస్‌: సిద్దిపేట (Siddipet) స్వచ్ఛత వెనుక పారిశుధ్య కార్మికుల రెక్కల కష్టం ఉంద‌ని బీఆర్ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) అన్నారు. సిద్దిపేటకు దేశంలోనే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు వచ్చాయంటే అది తన గొప్పతనం కాద‌ని.. చలిని, వానను లెక్కచేయకుండా చీపురు పట్టి శ్రమించిన మున్సిపల్ పారిశుధ్య కార్మికుల రెక్కల కష్టమేని చెప్పారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల జీతాలు పెంచాల‌ని డిమాండ్ చేశారు. నాడు కాంగ్రెస్ హయాంలో రూ.8,300 ఉన్న జీతాన్ని బీఆర్ఎస్ (BRS) పాలనలో కేసీఆర్ రూ.16,600కు పెంచార‌ని వెల్ల‌డించారు. మధ్యవర్తులు, కాంట్రాక్టర్లను తొలగించి కార్మికులకే నేరుగా గ్రూపుల ద్వారా జీతాలు అందేలా చేశామ‌న్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేండ్ల‌యినా కార్మికులకు ఒక్క రూపాయి జీతం పెంచలేద‌ని విమ‌ర్శించారు. కానీ నిత్యావసరాల ధరలు, బస్సు చార్జీలు, కరెంట్ బిల్లులు మాత్రం విపరీతంగా పెంచేశార‌ని మండిప‌డ్డారు. సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో పట్టణ పారిశుధ్య కార్మికులతో కలిసి హరీశ్ రావు ఆత్మీయంగా ముచ్చటించారు. వారితో కలిసి టిఫిన్ చేసి, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం దసరా పండుగను పురస్కరించుకుని సొంత ఖర్చులతో కార్మికులను ఘనంగా సత్కరించి, మహిళా కార్మికులకు చీరలు, పురుష కార్మికులకు ప్యాంట్, షర్టును పండుగ కానుకగా అందజేశారు. అనంత‌రం మాట్లాడుతూ.. పెరిగిన ధరల నేపథ్యంలో పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచాలని, మిగతా విభాగాల వారికీ గ్రూప్ విధానం అమలు చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వంపై గట్టిగా పోరాడుతామ‌న్నారు.

`గతంలో కాంగ్రెస్ పాలనలో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు పారిశుధ్య కార్మికులకు (Municipal Workers) మూడు నెలలు, ఐదు నెలలు, ఆరు నెలలైనా జీతాలు రాకపోతుండే. జీతాల కోసం ఎర్రజెండాలు పట్టుకుని ఆర్డీవో ఆఫీస్ ముందు, కమిషనర్ ఆఫీస్ ముందు కార్మికులు నిత్యం ధర్నాలు చేసే దుస్థితి ఉండేది. నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ. 8,300 మాత్రమే ఔట్‌సోర్సింగ్ జీతం ఉండేది. అది కూడా కాంట్రాక్టర్ల చేతుల్లో పడి కార్మికులకు సకాలంలో అందేది కాదు.

పని భారం తగ్గింది..

సిద్దిపేటకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు (Swachh Sarvekshan Award), జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందంటే అది ఒక హరీశ్ రావు గొప్పతనం కాదు. ఉదయాన్నే లేచి, రాత్రంతా చలికి, వానకు ఇబ్బందులు పడినా పట్టించుకోకుండా చీపుర్లు పట్టి ఊడ్చే అక్కాచెల్లెళ్ల రెక్కల కష్టం వల్లే సిద్దిపేటకు అవార్డులు వచ్చాయి. ఊరందరికీ నిరంతరం సేవ చేస్తున్న కార్మికులకు ఒకరోజు స్వయంగా బట్టలు పెట్టి, కలిసి టిఫిన్ చేసి నా వంతుగా సేవ చేద్దామనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను. సిద్దిపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేసిన తర్వాత పారిశుధ్య కార్మికుల పని భారం చాలా తగ్గింది.

గతంలో మోరీల్లో దిగి చెత్తను ఎత్తి రోడ్డు పక్కన వేయాల్సి వచ్చేది, వారం రోజుల తర్వాత మళ్లీ దాన్ని ఎత్తే తీవ్రమైన శ్రమ ఉండేది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వల్ల ఆ మోరీలు తీసే గోస, ఎత్తే తిప్పలు తప్పాయి. గతంలో ఎంత కష్టపడి రోడ్లు శుభ్రం చేసినా, పందులు వచ్చి అంతా ఆగమాగం చేసేవి, దుర్వాసన వచ్చేది. కార్మికులు చేసిన కష్టాన్ని పబ్లిక్ చూసేలోపే పందులు పాడుచేసేవి. వాళ్లందరినీ ఒప్పించి, ఉపాధి చూపించి, పందులను పూర్తిగా తొలగించడంతో సిద్దిపేట నిజమైన స్వచ్ఛ సిద్దిపేటగా మారింది, కార్మికులకూ శ్రమ తగ్గింది. ఊర్లో ప్రతి మూలన చెత్తకుండీలు ఉండి, వాటి చుట్టూ పందులు, కుక్కలు చేరి కార్మికులు చెత్త ఎత్తాలంటే ఎంతో నరకయాతన ఉండేది. ఆ చెత్తకుండీలన్నింటినీ తొలగించి, తడి చెత్త, పొడి చెత్త కోసం ఆటోలు ఏర్పాటు చేశాం. కార్మికులకు ప్లాస్టిక్ వంటి రీసైక్లింగ్ ద్వారా అదనంగా రూ. 300 నుంచి రూ. 500 వరకు ఆదాయం వచ్చే వెసులుబాటు కూడా కల్పించాం.

సిద్దిపేట నెత్తిమీద కుండలా..

కార్మికుల శ్రమను తగ్గించేందుకు మూడు పెద్ద స్వీపింగ్ మిషన్లు కొనుగోలు చేసి మెయిన్ రోడ్లను వాటి ద్వారా శుభ్రం చేయిస్తూ కార్మికులకు ఉపశమనం కల్పించాం. నల్లా ఆపరేటర్ల గోస కూడా గతంలో తీవ్రంగా ఉండేది. ఎల్ఎండీ (LMD) పైప్‌లైన్ వేసినా గాలులు వచ్చినప్పుడు కరెంట్ పోవడం వల్ల సమయానికి నీళ్లు వచ్చేవి కావు. దాంతో రాత్రి 11 గంటలకో, 12 గంటలకో, తెల్లవారుజామున 5 గంటలకో నల్లాలు తిప్పాల్సి వచ్చేది. స‌మ‌యం లేకపోవడంతో ప్రజలు తిట్టేవారు, నల్లా ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram) ద్వారా సిద్దిపేట నెత్తిమీద కుండలా మల్లన్న సాగర్ నిర్మించుకున్నాం. మల్లన్న సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు రావడం వల్ల కరెంట్‌తో పనిలేకుండా గేటు ఎత్తగానే సిద్దిపేటకు పరుగులు పెడుతున్నాయి. ఇప్పుడు ఉదయం 7 గంటలకు, 9 గంటలకు ఖచ్చితమైన సమయానికి నల్లాలు వస్తున్నాయి. ప్రజలకూ ఇబ్బంది తగ్గింది. నల్లా ఆపరేటర్లకూ పగలూ రాత్రి తేడా లేకుండా తిరిగే తిప్పలు తప్పాయి.

పారిశుధ్య కార్మికురాలు నర్సమ్మ అడిగినట్లు ధరలు విపరీతంగా పెరిగిన మాట వాస్తవం. ఇళ్ల కిరాయిలు పెరిగాయి, కాబట్టి జీతం పెంచాలని కార్మికులు అడగడంలో ఎలాంటి తప్పు లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చి కేసీఆర్ (KCR) ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను మంత్రిగా ఉన్న సమయంలో కార్మికుల జీతాన్ని రూ.8,300 నుంచి రూ.12,000 కు, ఆ తర్వాత రూ.14,000 కు, కరోనా సమయంలో ఒక్కసారే రూ.1,000 తో పాటు మొత్తం రూ.16,600 వరకు పెంచుకుంటూ వచ్చాం. కాంట్రాక్టర్లు, దళారుల దోపిడీని పూర్తిగా రద్దు చేసి, ఏడేడుగురు కార్మికులను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి ప్రభుత్వమే నేరుగా మీ ఖాతాల్లో జీతాలు పడేలా విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ధర్నాలు చేయాల్సిన అవసరమే లేకుండా చేశాం.

 

ఒక్క రూపాయి కూడా పెంచలే

కానీ కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా కార్మికులకు ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదు. కేసీఆర్ పెంచిన రూ.16,600 మాత్రమే ఇప్పటికీ అందుతోంది. ప్రభుత్వం జీతాలు పెంచకపోగా మార్కెట్లో నిత్యావసరాల ధరలు మాత్రం చుక్కలనంటాయి. వంటనూనె ధర కిలో రూ.210 అయింది, కందిపప్పు రూ.140-150, పెసరపప్పు రూ.130, ఉల్లిగడ్డలు కోస్తే కాదు.. కొంటేనే కళ్లల్లో నీళ్లు వచ్చేలా రూ.50-60 కి పెరిగాయి. బియ్యం కిలో రూ.80కి చేరింది. కరోనా విపత్తు సమయంలో ప్రజలంతా భయపడి ఇళ్లలోనే ఉంటే, పారిశుధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి రోడ్లపైకి వచ్చి ఊరిని కాపాడారు.

నాడు నేను కూడా మంత్రిగా ఉండి మీ వెంటే తిరిగి ధైర్యం చెప్పాను. కిట్లు ఇచ్చాను, బహుమతులు ఇచ్చాను, చెత్త బండ్ల వెంట తిరిగి ప్రజలకు అవగాహన కల్పించాను. కాంగ్రెస్ వాళ్లు అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తామన్నారు, మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారు.. ఇప్పుడేమో ఎవరికీ ఏమీ ఇవ్వడం లేదు. కేసీఆర్ హయాంలో ప్రభుత్వ దవాఖానలో కాన్పు అయితే కేసీఆర్ కిట్ ఇచ్చి, రూ.12,000 అందించి, సర్కారు వాహనంలో ఇంటి వద్ద దింపేవారం.. ఇప్పుడు ఆసుపత్రుల్లో కనీసం మందులు కూడా సరిగ్గా దొరకని పరిస్థితి ఏర్పడింది.

 

డైరెక్ట్ జీతాలు ఇవ్వాలి..

సఫాయి కార్మికుల మాదిరిగానే నల్లా ఆపరేటర్లు, మొక్కలు నాటే కార్మికులను కూడా గ్రూపుల పరిధిలోకి తీసుకొచ్చి డైరెక్ట్ జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని తప్పకుండా అసెంబ్లీలో ప్రస్తావించి మిగిలిన వారికి కూడా గ్రూపు విధానం వర్తింపజేసేలా పోరాడుతాను. మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాల పీఎఫ్, ఈఎస్ఐ లేదా అకౌంట్ సమస్యలను వెంటనే మున్సిపల్ అధికారులు, చైర్మన్ కూర్చుని పరిష్కరించి వారికి న్యాయం చేయాలి.

గత పదేండ్ల‌ కిందటి సిద్దిపేటకు, ఇప్పటి సిద్దిపేటకు వచ్చిన మార్పును మీరే ప్రత్యక్ష సాక్షులుగా చూస్తున్నారు. నాడు చిన్న గల్లీలు, మోరీలు, నల్లా గుంతలు, పందులు ఉండేవి. నేడు సిద్దిపేటలో అద్దాల్లా మెరిసే సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అందమైన డివైడర్లు, చెట్లు, కోమటి చెరువుతో దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ అందమైన సిద్దిపేట నిర్మాణం వెనుక కార్మికుల రెక్కల కష్టమే అసలైన అలంకారం.

నిలువునా దోచుకుంటున్నారు..

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో (Free Bus) ఉచిత ప్రయాణం అని చెప్పి పురుషులకు టికెట్ చార్జీలను (Bus Ticket Fare) రెట్టింపు చేసింది. హైదరాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ నుంచి సిద్దిపేటకు గతంలో రూ.130 నుంచి రూ.150 ఉన్న బస్ టికెట్‌ను ఇప్పుడు ఏకంగా రూ.230కి పెంచి నిలువునా దోచుకుంటున్నారు. భార్యకు ఫ్రీ ఇచ్చి భర్త జేబులు గుల్ల చేస్తున్నారు. విపరీతంగా పెరిగిన ధరల వల్ల పారిశుధ్య కార్మికులు, పేదలు బతకడం కష్టంగా మారింది. కాబట్టి పారిశుధ్య కార్మికుల జీతాలను ప్రభుత్వం తక్షణమే పెంచాలని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కార్మికుల పక్షాన గట్టిగా నిలదీస్తాను. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి న్యాయం జరిగే వరకు పోరాడుతాను.

Advertisement
Advertisement