త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ఇది నేర‌పూరిత నిర్ల‌క్ష్యం.. ప్ర‌భుత్వానికి చీమకుట్టిన‌ట్టు కూడా లేదు

Harish Rao | బాన్సువాడ ఆసుపత్రిలో 10 మంది బాలింతలు ఇన్ఫెక్షన్ బారినపడి ప్రాణాపాయ స్థితిలో ఉంటే, 10 రోజులైనా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం నేరపూరిత నిర్లక్ష్యం అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. ఆపరేషన్ థియేటర్ నిర్వహణ సరిగా లేకపోవడం, కాలం చెల్లిన మందులు వాడటంతో పాటు డాక్టర్ల నిర్లక్ష్యానికి బాలింతలు బలయ్యారు అని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.

S

Telangana | Published On Jul 20, 2026, 1.15 pm IST

Harish Rao | ఇది నేర‌పూరిత నిర్ల‌క్ష్యం.. ప్ర‌భుత్వానికి చీమకుట్టిన‌ట్టు కూడా లేదు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : బాన్సువాడ ఆసుపత్రిలో 10 మంది బాలింతలు ఇన్ఫెక్షన్ బారినపడి ప్రాణాపాయ స్థితిలో ఉంటే, 10 రోజులైనా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం నేరపూరిత నిర్లక్ష్యం అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. ఆపరేషన్ థియేటర్ నిర్వహణ సరిగా లేకపోవడం, కాలం చెల్లిన మందులు వాడటంతో పాటు డాక్టర్ల నిర్లక్ష్యానికి బాలింతలు బలయ్యారు అని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.

బాన్సువాడ మాతా-శిశు ఆసుపత్రిలో శస్త్రచికిత్స అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింతలను, వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. బాలింతల ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్యంపై నిమ్స్ డాక్టర్లతో ఆరా తీశారు. అలాగే, ఖమ్మంలో జరిగిన దారుణ ఘటనలో తీవ్రంగా గాయపడి నిమ్స్ లోనే చికిత్స పొందుతున్న మైనర్ బాలికను కూడా ఆయన పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మాజీ మంత్రి హరీశ్ మీడియాతో మాట్లాడారు.

ఈ నెల 13వ తేదీన బాన్సువాడ ఆసుపత్రిలో డెలివరీకి వెళ్లిన 10 మంది మహిళలకు సిజేరియన్ ఆపరేషన్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్స్ సోకి పరిస్థితి విషమించింది. వారిని నిజామాబాద్ ఆసుపత్రికి, అక్కడి నుంచి నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిమ్స్ లో ఫాతిమా, రుక్సానా, జ్యోతి, లక్ష్మీప్రియ, సునీత అనే ఐదుగురు బాలింతలు చికిత్స పొందుతున్నారు. ఈ ఐదుగురిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. తెల్ల రక్త కణాలు తగ్గిపోవడం, ఊపిరితిత్తులు మరియు కిడ్నీలలో ఇన్ఫెక్షన్ కారణంగా వారు ఐసీయూలో డయాలసిస్ పైన ఉన్నారు. ఈ దారుణమైన సంఘటన జరిగి 10 రోజులు కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే లేదా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి వచ్చి బాధితులను పరామర్శించిన పాపాన పోలేదు. అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది? దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి? అని తెలుసుకునే కనీస ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదు. ఇప్పటివరకు పూర్తి స్థాయి విచారణకు కూడా ఆదేశించకపోవడం దారుణం అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

మళ్ళీ మరో నలుగురికి సిజేరియన్ ఎందుకు చేశారు..?

బాలింతలు పూర్తిగా కోలుకోకపోతే రేపు ఆ పసిపిల్లల్ని ఎలా చూసుకోవాలి. ఆ కుటుంబ పరిస్థితులు ఎంత దారుణంగా దెబ్బతింటాయో ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి. 10వ తేదీన ఆరుగురికి సిజేరియన్ చేసినప్పుడు వారికి ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిసిన తర్వాత కూడా.. అదే థియేటర్లో మళ్ళీ మరో నలుగురికి సిజేరియన్ ఎందుకు చేశారు.. ఆపరేషన్ జరిగిన వారికి రాత్రి నుంచే మోషన్స్, వాంతులు, చలిజ్వరంతో ఇబ్బంది పడుతున్నా.. అదే ఆపరేషన్ థియేటర్లో మరో నలుగురికి సిజేరియన్ చేయడం వల్ల వారు కూడా ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. ఆపరేషన్ థియేటర్లో మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్లే ఇన్ఫెక్షన్ సోకిందని, డాక్టర్ల నిర్లక్ష్యానికి తాము బలయ్యామని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. కాలం చెల్లిన మందులు వాడటం వల్లే తమకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఇంకొక పేషెంట్ బంధువులు ఆరోపిస్తున్నారని మాజీ మంత్రి తెలిపారు.

ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తోంది?

ఇంత తీవ్రమైన ఘటన జరిగితే ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తోంది? దీనిపై ఎందుకు విచారణకు ఆదేశించలేదు. ఈ ఘటనపై తక్షణమే పూర్తి స్థాయి విచారణ జరపాలి. నిర్లక్ష్యానికి కారణమైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒక పేషెంట్ నిజామాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే రెండు రోజుల్లోనే 3 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. ఒంటి మీదున్న బంగారం అమ్ముకుని, మూడు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి ఖర్చు పెట్టినా తన బిడ్డ ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదని ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

పూర్తిగా ప‌డ‌కేసిన వైద్యారోగ్య శాఖ‌

ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నేరపూరితమైన నిర్లక్ష్యం. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా పడకేసింది. 10 మంది మహిళల ప్రాణాలతో చెలగాటమాడినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. మీ ఇందిరమ్మ పాలనలో మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఇందిరమ్మ పాలన అనేది కేవలం మాటల్లోనే ఉంది. మొన్నటికి మొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆసుపత్రిలో జాయిన్ చేసుకోకపోవడం, బెడ్ ఇవ్వకపోవడం వల్ల నిలబడే బిడ్డకు జన్మనిచ్చిన హృదయ విధారకమైన సంఘటన ఈ రాష్ట్రంలో జరిగింది. తల్లులకు సోకిన ఇన్ఫెక్షన్ పాల రూపంలో పసిపిల్లలకు కూడా చేరి.. ఆ పిల్లలు జాండిస్ తో రకరకాల ఇబ్బందులు పడుతూ నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఏర్పడింది అని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ బంద్ చేశారు

ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను గాలికి వదిలేసింది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బిడ్డ కడుపులో పడగానే న్యూట్రిషన్ కిట్, పుట్టగానే కేసీఆర్ కిట్ ఇచ్చాం. ఆరోగ్య లక్ష్మి పథకం కింద పాలు, పౌష్టికాహారాన్ని అందించాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు కేవలం 30-35 శాతం ఉంటే, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దానిని 72 శాతానికి తీసుకువెళ్ళాం. కానీ ఈరోజు మళ్ళీ అది 50 శాతానికి పడిపోయింది. సి సెక్షన్ రేటు విపరీతంగా పెరిగిపోయింది. ఆసుపత్రులను మానిటర్ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. రేవంత్ రెడ్డి ఏమీ బంద్ చేయలేదు అంటారు, కానీ న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ బంద్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు సకాలంలో లేకపోవడం వల్ల నమ్మకం సన్నగిల్లి డెలివరీల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మదర్ మోర్టాలిటీ రేటును 92 శాతం నుంచి 43 కు తగ్గించి, దేశంలోనే మూడవ ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాం. కానీ మీ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులకు సుస్తీ పట్టిందని హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు.

మీరేమైనా ఎంక్వయిరీ ఆర్డర్ చేశారా?

ఈ సంఘటన మీద మీరేమైనా ఎంక్వయిరీ ఆర్డర్ చేశారా? చేస్తే ఆ ఎంక్వయిరీ రిపోర్ట్ బయట పెట్టండి. ఆ సిబ్బంది ఎవరు, డాక్టర్స్ ఎవరు అన్నది వెల్లడించి వారిపై యాక్షన్ తీసుకోవాలి. ఆ తల్లులకు కాళ్లు వాపులు వస్తున్నాయి, డయాలసిస్ జరుగుతోంది. భవిష్యత్తులో కూడా లైఫ్ లాంగ్ డయాలసిస్ తీసుకోవాల్సి వస్తే మా పుట్టిన పిల్లల పరిస్థితి ఏంటి అని ఆ తల్లులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయి వైద్యం అందించి, వారికి తగిన ఎక్స్ గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామ‌ని మాజీ మంత్రి తెలిపారు.

ఆ చిన్నారి భవిష్యత్తు నాశనమైంది

ఖమ్మంలో మైనర్ బాలికపై రేప్ జరిగినప్పుడు కూడా బీఆర్ఎస్ స్పందించేదాకా ప్రభుత్వం రాలేదు. మేము వచ్చిన తర్వాతే హడావిడిగా మంత్రులు సీతక్క, తుమ్మల వచ్చారు. ఆ మైనర్ బాలిక తన కాళ్ల మీద తాను నిలబడటం కష్టమే అని డాక్టర్లు చెబుతున్నారు. నడుము నుంచి కింది భాగం ఏదీ పనిచేయడం లేదని, భవిష్యత్తు మొత్తం వీల్ చైర్ కే పరిమితం కావాల్సి వస్తుందని అంటున్నారు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ చిన్నారి భవిష్యత్తు నాశనమైంది. ఆమె తన జీవితంలో నిలబడే విధంగా ఆ కుటుంబానికి కనీసం రూ. 25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామ‌ని హ‌రీశ్‌రావు తెలిపారు.

కనీసం మందులు కూడా నిల్వ లేవు

నేను గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆసుపత్రులపై రెగ్యులర్ సూపర్ విజన్ ఉండేది. నేడు ఆ సూపర్ విజన్ లోపించింది. రివ్యూలు లేవు, జవాబుదారితనం లేదు, కనీసం మందులు కూడా నిల్వ లేవు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి, విచారణకు ఆదేశించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని మాజీ మంత్రి సూచించారు.

Advertisement
Advertisement