Deshapathi Srinivas | పెద్ది సుదర్శన్ రెడ్డి.. ఆ పేరే ఒక ఉత్తేజం: ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
Deshapathi Srinivas | తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) మృతిపట్ల ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ (Deshapathi Srinivas) సంతాపం వ్యక్తం చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పేరే ఒక ఉత్తేజమని చెప్పారు.
Deshapathi Srinivas | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) మృతిపట్ల ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ (Deshapathi Srinivas) సంతాపం వ్యక్తం చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పేరే ఒక ఉత్తేజమని చెప్పారు. వరంగల్ గడ్డ మీద అనేక సవాళ్లను ఎదుర్కొంటూ, ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుంటూ తెలంగాణ ఉద్యమ జెండాను నింగికెత్తిన ధీశాలి, నిప్పుకణిక అన్నారు.
`పెద్ది జీవితమంతా పెను సంఘర్షణల మయమే. నవయువకుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టినప్పుడు నర్సంపేట రాజకీయాలు ప్రత్యక్ష భౌతిక దాడులతో ప్రమాదకరంగా ఉండేవి. మద్దికాయల ఓంకార్ వంటి బలమైన నాయకుడితో తలపడుతూ, ప్రాణాలకు తెగించి పోరాడి నిలదొక్కుకున్నడు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ అడుగులో అడుగు వేస్తూ నడిచిన తొలితరం యోధుడు పెద్ది.
పెట్టని కోటలా..
ఆర్ధిక బలం లేకపోయినా, కొండంత ఆత్మికబలంతో ఉద్యమాన్ని భుజానకెత్తుకున్నడు. అప్పులు చేసైనా సరే ఉద్యమ కార్యక్రమాలు జరిపించాలని తపించిన త్యాగశీలి. ముఖ్యంగా 2004లో వరంగల్ జిల్లా నుంచి గెలిచిన టీఆర్ఎస్ శాసన సభ్యులు ముగ్గురూ నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కనుసన్నల్లో పార్టీని, ఉద్యమాన్ని వీడి వెళ్లినప్పుడు.. ఆ కల్లోల సమయంలో వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా పెద్ది పెద్దదిక్కులా పెట్టని కోటలా నిలబడ్డాడు. ఉద్యమశక్తుల్ని కూడగట్టాడు.
మానుకోటలో విద్యార్థులకు పెద్దదిక్కుగా..
2009 ఎన్నికల ఓటమి తర్వాత ఆవహించిన నిశ్శబ్దాన్ని, నిస్పృహను చీల్చుకుంటూ నిప్పురవ్వలు రాజేసి, ఉద్యమజ్వాలలు రగిలించిన ధృఢచిత్తుడు పెద్ది. ఈ అన్ని సందర్భాల్లో నన్ను తనతోపాటు వరంగల్ తీస్కపోయి ఊరూరు తిప్పిండు. నేనన్నా, నా ఉపన్యాసమన్నా తనకు ప్రేమ, అభిమానం. ఈమధ్యన పాలకుర్తి, వర్ధన్నపేట, పరకాల సభలలో కలుసుకున్నప్పుడు.. నేను చేసిన ఉపన్యాసాలలో తన మనసులో నిలిచిపోయిన మాటలను ఎంతో ఉద్వేగంతో, మెరిసే కళ్లతో గుర్తుచేసుకున్నడు. మానుకోట ప్రతిఘటలో విద్యార్థులకు పెద్ది ఒక పెద్దదిక్కుగా, అండగా నిలబడ్డడు. 2014లో తెలంగాణ స్వప్నం నెరవేరి, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా.. నర్సంపేటలో పెద్దికి విజయం దక్కలేదు. ఆ ఓటమి తెచ్చిన ఆవేదనతో నాతో పదే పదే పంచుకున్నడు. అయితే ఆ దెబ్బకు కుంగిపోలేదు. మళ్లా శక్తిని కూడగట్టుకుని, 2018లో ఘనవిజయం సాధించిండు.
పెద్దికి ముందు, పెద్ది తర్వాత..
శాసన సభ్యుడిగా పెద్ది సుదర్శన్ ఐదేండ్ల స్వల్పకాలంలో నర్సంపేటను తీర్చిదిద్దిన తీరు అపూర్వం!. గోదావరి జలాలతో పాకాల చెరువును అనుసంధానించడం ఆ ప్రాంతానికి తాను చేసిన గొప్ప మేలు. మౌలిక వసతుల కల్పనలో గణనీయమైన మార్పు తెచ్చిండు. నర్సంపేటకు మెడికల్ కాలేజీ సాధించిండు. నర్సంపేట అభివృద్ధి.. పెద్దికి ముందు, పెద్ది తర్వాత అని చరిత్ర చెప్పుకునేంత గొప్ప అభివృద్ధిని తెచ్చిండు.
ఉద్యమ కాలంలో పోలీసు వాటర్ కేనన్ల దెబ్బకు ఒక కన్ను చూపు కోల్పోయిండు. ఒక వైపు మాత్రమే కనిపించేది. చూపు లేని వైపు నుంచి ఎవరైనా నమస్కరిస్తే ప్రతిస్పందించలేకపోయేది. దాన్ని నా అహంకారంగా అపార్థం చేసుకోవద్దు అని సభాముఖంగా ప్రజలకు విన్నవించుకున్నడు. `పెద్ది చేసే పనులను ఏమంటారు? 'పెద్దిర్కం' అంటారు` అని నేను పరాచికం ఆడితే.. పసివానిలా హాయిగా నవ్వే ఆ నవ్వు ఇగ కనిపించదంటే గుండె తరుక్కుపోతున్నది. ఎప్పడు కనిపించినా రెండు చేతులు నడుము చుట్టూ వేసి పొదివి పట్టుకొని ఎనలేని ఆప్యాయత ఉట్టిపడే కంఠంతో దేశపతి గారూ! బాగున్నారా! అనే ఆ ఆత్మీయమైన పిలుపు ఇక వినడదంటే హృదయం విశ్వసిస్తలేదు.
జీవితంలో ఎక్కువ భాగాన్ని తెలంగాణ కోసమే..
తన బ్రతికిన జీవితంలో ఎక్కువ భాగాన్ని తెలంగాణ విముక్తి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ధారపోసి పెద్ది సుదర్శన్ రెడ్డి ఉత్కృష్టమైన చరిత్రను సొంతం చేసుకున్నాడు. నర్సంపేట మట్టిలో, అక్కడ జరిగిన అద్భుతమైన ప్రగతిలో ఆయన ముద్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది. రామప్ప విగ్రహం వలె నల్లగా, పాకాల చెరువు వలె చల్లగా తెలంగాణ తనానికి నిలువెత్తు రూపమై నిలిచిన పెద్దికి కన్నీటి వీడ్కోలు. నర్సంపేట నీటి అలల గలగలల్లో పైరుపచ్చల మిలమిలల్లో మన పెద్ది చిరంతనంగా చిరునవ్వులు వెదజల్లుతూనే ఉంటాడు.` అని పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని దేశపతి శ్రీనివాస్ గుర్తుచేసుకున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Congress | కాంగ్రెస్‌కు కొత్త సమస్య.. అసెంబ్లీలో మాజీ సీఎంకు సీటు ఎక్కడ?
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు అలర్ట్..
- ●Qualcomm | స్టేజ్‌పైనే కుప్పకూలిన హ్యూమనాయిడ్ రోబో.. సోషల్ మీడియాలో మీమ్స్..
- ●Building Collapse | కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. ఎనిమిది మంది దుర్మరణం
- ●Stock Markets | ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు.. స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
- ●BPCL Recruitment | భారత్ పెట్రోలియం కార్పొరేషన్లో టెక్నీషియన్ ఉద్యోగాలు..

Congress | కాంగ్రెస్‌కు కొత్త సమస్య.. అసెంబ్లీలో మాజీ సీఎంకు సీటు ఎక్కడ?

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు అలర్ట్..

Qualcomm | స్టేజ్‌పైనే కుప్పకూలిన హ్యూమనాయిడ్ రోబో.. సోషల్ మీడియాలో మీమ్స్..

Building Collapse | కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. ఎనిమిది మంది దుర్మరణం






