త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CV Anand | డీజీపీగా బాధ్య‌త‌లు స్వీకరించిన సీవీ ఆనంద్‌

CV Anand | తెలంగాణ నూత‌న డీజీపీగా (DGP) సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ (CV Anand) బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

G

Telangana | Published On May 1, 2026, 11.08 am IST

CV Anand | డీజీపీగా బాధ్య‌త‌లు స్వీకరించిన సీవీ ఆనంద్‌
Advertisement

CV Anand | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ నూత‌న డీజీపీగా (DGP) సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ (CV Anand) బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా జరిగింది. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న సీవీ ఆనంద్‌కు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య, పండితుల ఆశీర్వచనాలతో ఆయన తన కుర్చీలో ఆసీనులయ్యారు. బాధ్యతలు స్వీకరించే ముందు పోలీసు విభాగం నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ సంద‌ర్భంగా సీనియ‌ర్ పోలీసులు అధికారులు ఆయ‌న‌ను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తానని పునరుద్ఘాటించారు.

1991 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్‌.. న‌క్స‌లైట్ ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌నిచేసిన అనుభం ఉన్న‌ది. హైద‌రాబాద్ సీపీగా, ట్రాఫిక్ క‌మిష‌న‌ర్‌గా, సైబ‌రాబాద్ క‌మిష‌న‌ర్‌గా, ఏసీబీ డైరెక్ట‌ర్‌గా, హోం శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా విస్తృత‌మైన సేవా అనుభ‌వం ఉంది. వ‌రంగ‌ల్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్ జిల్లాల్లో ఏఎస్పీగా, ఎస్పీ ప‌నిచేశారు. ఆయుధ స‌ర‌ఫ‌రా చైన్‌ను అడ్డుకోవ‌డంలో, యువ‌త‌ను న‌క్స‌లైట్ ప్ర‌భావం నుంచి దూరం చేయ‌డంలో కీల‌క‌పాత్ర పోషించారు.

ప‌క్కా హైదరాబాదీ

సీవీ ఆనంద్‌ పక్కా హైదరాబాదీ. ఆయన తండ్రి చామ దామోదర్ రెడ్డి, తల్లి యశోదాదేవి రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం కుంట్లూరు గ్రామానికి చెందినవారు. 1968, జూన్ 5న పాతబస్తీలోని జజ్జిఖానా మెటర్నిటీ ద‌వాఖాన‌లో ఆనంద్‌ జన్మించారు. దామోదర్‌రెడ్డి అటవీశాఖలో ఫారెస్టు రేంజర్‌గా పని చేస్తూ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టుగా పదవీ విరమణ పొందారు.

సీవీ ఆనంద్‌ విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే కొనసాగింది. విద్యారణ్య హైస్కూల్‌, హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదివారు. విద్య‌తోపాటు క్రీడల్లోనూ ఆయ‌న రాణించారు. హైదరాబాద్‌ అండర్‌ 19 క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆయ‌న 1986లో ఇంగ్లాండ్‌ పర్యటనలో పాల్గొన్నారు. నిజాం కాలేజీలో బీఏ, ఉస్మానియాలో ఎంఏ (ఎకనామిక్స్‌) పూర్తి చేశారు. రంజీ ట్రోఫీలో అవకాశం రాకపోవడంతో నిరాశ చెంద‌కుడా.. సివిల్‌ సర్వీసెస్‌పై దృష్టి పెట్టారు. త‌న‌ 22 ఏండ్ల‌ వయస్సులో తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్‌కు ఎంపికయ్యారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement