త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | ర‌క్ష‌ణ రంగంలో భార‌త్‌ను అగ్ర‌గామి దేశంగా తీర్చిదిద్దుదాం: సీఎం రేవంత్‌

Revanth Reddy | రక్షణ రంగంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే శక్తివంతమైన అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు అంతా కలిసి పనిచేద్దామని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పిలుపునిచ్చారు.

G

Telangana | Published On Oct 25, 2026, 10.04 am IST

Revanth Reddy | ర‌క్ష‌ణ రంగంలో భార‌త్‌ను అగ్ర‌గామి దేశంగా తీర్చిదిద్దుదాం: సీఎం రేవంత్‌
Advertisement

Revanth Reddy | త్రినేత్ర న్యూస్‌: రక్షణ రంగంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే శక్తివంతమైన అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు అంతా కలిసి పనిచేద్దామని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పిలుపునిచ్చారు. తెలంగాణ రైజింగ్ 2047 దార్శనికతకు అనుగుణంగా త్వరలోనే `ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 2.0`ను విడుదల చేయ‌నున్నామ‌ని తెలిపారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా రక్షణ రంగ పారిశ్రామికవేత్తలతో నిర్వ‌హించిన సమావేశంలో `రక్షా ఎక్స్‌పో 2026 కర్టెన్ రైజర్‌`ను (Raksha Expo) ప్రారంభించి లోగోను ఆవిష్కరించారు. అనంత‌రం మాట్లాడుతూ.. `రక్షణ రంగంలో భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా చూడాలన్నది నా ఆకాంక్ష. యుద్ధానికి అవసరమైన సాంకేతికతను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి స్వావలంబన సాధించడమే కాకుండా రక్షణ సాంకేతిక ఎగుమతులు చేసే దేశంగా భారత్ ఎదగాలి.

తెలంగాణ కోసం నాకొక స్పష్టమైన లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని సాధించడంలో రాష్ట్రం గణనీయమైన పాత్ర పోషిస్తున్న‌ది. అయితే, ఇంకా ఎన్నో విజయాలు సాధించాల్సిన అవసరముంది. దేశ రక్షణ రంగ పరిశ్రమకు అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా తెలంగాణ ఎదగాలి. అందుకు మీ అందరి సహకారం కావాలి. తెలంగాణలో (Telangana)పెట్టుబడులు పెట్టాలని మీరు వేసుకున్న ప్రణాళికలను రెట్టింపు చేయండి. లక్ష్యాన్ని సాధించడానికి నా నుంచి మీకు ఎలాంటి సహకారం కావాలో చెప్పండి. సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది నా హామీ. భారతదేశ రక్షణ పరిశ్రమకు తెలంగాణ అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా ఎదగాలి. రక్షణ రంగంతో పాటు స్పేస్, ఏరోస్పేస్, సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేధస్సు, డ్రోన్ టెక్నాలజీ వంటి అనేక అనుబంధ రంగాల్లో ఈ సమావేశానికి హాజరైన మీరందరూ సహకరించి లక్ష్యాన్ని సాకారం చేయాలి. 2034 నాటికి తెలంగాణ‌ను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో గతేడాది తెలంగాణ రైజింగ్ 2047 (Telangana Rising) విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశాం.

పూర్తిగా భిన్నంగా యుద్ధ స్వరూపం

దేశ జనాభాలో ప్రస్తుతం తెలంగాణ వాటా 2.5 శాతానికి పైగా ఉంది. దేశ స్థూల జాతీయోత్పత్తి (GDP)లో తెలంగాణ 5 శాతం వాటాను అందిస్తున్న‌ది. 2047 నాటికి ఆ వాటాను 10 శాతానికి పెంచాలన్నది నా లక్ష్యం. ఈ దార్శనికతను సాకారం చేయడంలో రక్షణ ఉత్పత్తుల తయారీ, ఏరోస్పేస్, వాటి అనుబంధ రంగాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకు `రక్షా ఎక్స్‌పో` ఒక ప్రధాన వేదికగా మారుతుంది. ఈ రంగంలో పనిచేస్తున్న వారంతా వినూత్న ఆలోచనలను, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలని ఆశిస్తున్నా. అందుకు అవసరమైన సహకారాన్ని, అనువైన వాతావరణాన్ని కల్పిస్తాం.

భవిష్యత్తులో యుద్ధ స్వరూపం పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఈ రంగంలోని నిపుణులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డ్రోన్లు, రోబోట్లు, కృత్రిమ మేధస్సుతో పనిచేసే వ్యవస్థలు యుద్ధ రంగాన్ని ఎలా మార్చబోతున్నాయో ఊహించండి. మన ముందున్న మార్గం స్పష్టంగా ఉంది. అందుకు సాంకేతిక పరిజ్ఞానమే అత్యంత కీలకం. రక్షణ, స్పేస్, ఏరోస్పేస్, భద్రతా రంగాలకు చెందిన ప్రముఖులు, దిగ్గజ సంస్థలైన డీఆర్‌డీఓ (DRDO), హెచ్‌ఏఎల్ (HAL), బీడీఎల్ (BDL), మిధాని, టాటా సంస్థలు, ఎయిర్‌బస్, సాఫ్రాన్, స్కైరూట్, లాక్‌హీడ్ మార్టిన్, భారత్ ఫోర్జ్ వంటి ఎన్నో ప్రముఖ సంస్థల ప్రతినిధులు మనమధ్యనున్నారు. ఈ రంగానికి చెందిన భాగస్వాములందరినీ ఒక వేదికపై సమావేశమై చర్చించుకోవడానికి, పరస్పరం సహకరించుకోవడానికి రక్షా ఎక్స్‌పోను ఒక చైతన్యవంతమైన అంతర్జాతీయ వేదికగా తీర్చిదిద్దాలన్నది నా ఆలోచన.

వ్యూహాత్మక ప్రదేశం హైదరాబాద్

భారతదేశ రక్షణ వ్యవస్థలో ఒక వ్యూహాత్మకమైన ప్రదేశంగా హైదరాబాద్ (Hyderabad) కీలకమైన స్థానంలో ఉంది. హైదరాబాద్ అత్యంత సురక్షితమైన నగరం. అనేక ముఖ్యమైన పరిశోధనా సంస్థలకు నిలయం. భారత సైన్యం, భారత వైమానిక దళాలకు సంబంధించిన కీలకమైన స్ట్రాటజిక్ కేంద్రాలు ఇక్కడి నుంచి పనిచేస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో సముద్రతీరం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. అయినప్పటికీ, భారత నౌకాదళానికి రాష్ట్రం కీలకమైన సేవలు అందిస్తోంది. వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో అత్యంత తక్కువ పౌనఃపున్యాల (Very Low Frequency) నౌకాదళ రాడార్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు.` అని సీఎం రేవంత్ అన్నారు.

Advertisement
Advertisement