Revanth Reddy | సురక్షితమైన దక్షిణ భారతదేశాన్ని నిర్మిద్దాం: సీఎం రేవంత్
Revanth Reddy | సమాజానికి భద్రత, రక్షణ అనేవి పునాదుల వంటివని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. సమర్థవంతంగా, నైతిక విలువలతో, నిష్పక్షపాతంగా పనిచేసే పోలీసు వ్యవస్థను ప్రజలు కోరుకుంటారని చెప్పారు.
Revanth Reddy | త్రినేత్ర న్యూస్: సమాజానికి భద్రత, రక్షణ అనేవి పునాదుల వంటివని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. సమర్థవంతంగా, నైతిక విలువలతో, నిష్పక్షపాతంగా పనిచేసే పోలీసు వ్యవస్థను ప్రజలు కోరుకుంటారని చెప్పారు. మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా పోలీసింగ్ విధానాల్లో మార్పులు రావాలని, సంస్కరణలు నిరంతరం కొనసాగాలని తెలిపారు. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమన్వయ కమిటీ (SRPCC) సమావేశాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు రాష్ట్రాల పోలీసు విభాగాల మధ్య సమన్వయం మరింత పెరగాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సరిహద్దులు దాటి నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పటిష్టమైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దక్షిణ భారతదేశాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత పోలీసు ఉన్నతాధికారులపై ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్ఆర్‌పీసీసీ వంటి వేదికలు ఎంతో కీలకమని చెప్పారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రాల పోలీసు విభాగాలు, ప్రత్యేక విభాగాల మధ్య మెరుగైన సమన్వయం సాధించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈ సదస్సు మన రాష్ట్రంలో, మన హైదరాబాద్‌లో జరుగుతుండటం మనకు గర్వకారణమన్నారు.
సంస్కరణలను విశ్వసిస్తా..
`నేను సంస్కరణలను విశ్వసిస్తాను. పోలీసు వ్యవస్థకు మనం అందించే వనరులు ఖర్చు మాత్రమే కాదు. మెరుగైన సమాజ నిర్మాణానికి, పౌరుల భద్రతకు చేసే పెట్టుబడిగా భావిస్తున్నా. హైదరాబాద్ పోలీసు వ్యవస్థను మూడు కమిషనరేట్లుగా విభజించాం. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్లను ఏర్పాటు చేశాం. దీంతో ప్రతి పోలీసు కమిషనర్ పరిమిత ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి, మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం కలుగుతుంది.
వివిధ రకాల నేరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించేందుకు హైడ్రా (HYDRAA), ఈగల్ (EAGLE), టీ-సేఫ్ (T-Safe) వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ట్రాఫిక్ సమస్యలు అత్యంత కీలకంగా మారాయి. ప్రతి విభాగం, ప్రతి ప్రత్యేక విభాగం సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణపై దృష్టి సారించి అత్యుత్తమ ఫలితాలు సాధించాలి. మనం చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాల నివారణ, నక్సలిజం నిర్మూలన వంటి అన్ని రంగాల్లో తెలంగాణ పోలీసు శాఖ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, ప్రశంసలు పొందుతున్నది.
సైబర్ నేరాల నియంత్రణలో..
ప్రధానమంత్రి మోదీ నిర్వహించిన ప్రగతి (PRAGATI) సమీక్ష సందర్భంగా సైబర్ నేరాల (Cyber Crime) నియంత్రణలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణను పూర్తిగా నక్సల్స్ (Maoists) రహిత రాష్ట్రంగా మార్చడంలో కృషి చేసిన మన పోలీసు అధికారులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. మాదకద్రవ్యాల నియంత్రణలో ఈగల్ విభాగం కేంద్ర ప్రభుత్వం నుంచి 80 శాతానికి పైగా మార్కులు సాధించింది. బాధితులకు సైబర్ నేరాల ద్వారా పోగొట్టుకున్న డబ్బును తిరిగి ఇప్పించే విషయంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది.
అమెరికాలోని ఎఫ్‌డీఏ (FDA) తరహాలో ఆహార కల్తీని అరికట్టడం, ఔషధాల నియంత్రణ కోసం వివిధ విభాగాల ప్రయత్నాలను సమన్వయం చేసేందుకు TG-SAFE అనే కొత్త విభాగాన్ని ప్రారంభించాం. మన హైడ్రా చెరువులు, సరస్సులు, ఇతర జలవనరులను పరిరక్షించడం, పునరుద్ధరించడం, వాటికి పూర్వ వైభవం తీసుకురావడం ద్వారా ప్రజల మన్ననలు పొందుతున్నది. అలాగే ప్రభుత్వ ఆస్తులు, ప్రజా ఆస్తుల రక్షణకు కూడా హైడ్రా కృషి చేస్తున్నది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్‌జెండర్లను నియమించిన దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
పోలీసుల సంక్షేమమూ ముఖ్యమే..
పోలీసుల సంక్షేమం కూడా మనకు అత్యంత ముఖ్యమైన అంశం. పోలీసులు రాష్ట్రం కోసం పోరాడుతారు. ప్రజల భద్రత కోసం నిరంతరం పనిచేస్తారు. అవసరమైతే విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేస్తారు. వారి సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తు నా అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటి. పోలీసు సిబ్బంది తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతుంటారు. వారి పిల్లలకు దేశంలోని అత్యుత్తమ సైనిక్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య అందించేందుకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ఏర్పాటు చేశాం. హోంగార్డు నుంచి డీజీపీ వరకు పోలీసు సిబ్బంది పిల్లలు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించవచ్చు.
పోలీసులు ధైర్యసాహసాలతో విధులు నిర్వహిస్తూ, తమ ప్రాణాలను సైతం పణంగా పెడతారు. అయితే వారి కుటుంబాల భవిష్యత్తుకు కూడా మనం భరోసా కల్పించాలి. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బందికి, కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు, వారి హోదా, సర్వీసు ఆధారంగా కనీసం రూ.1 కోటి నుంచి గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాం. అలాంటి కుటుంబాలకు గృహ నిర్మాణ స్థలాలు కేటాయిస్తున్నాం. అర్హులైన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం.
సమన్వయం ఎంతో అవసరం..
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఒక్క రాష్ట్రం తన ప్రయత్నాలతో మాత్రమే నేరరహితంగా మారడం సాధ్యం కాదు. అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాల మధ్య సమన్వయం ఎంతో అవసరం. ఈ అంశాలపై సమావేశంలో చర్చిస్తారని నేను విశ్వసిస్తున్నాను. సమగ్ర చర్చల అనంతరం పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తారని ఆశిస్తున్నాను. దక్షిణ భారతదేశాన్ని సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీపై ఉంది. వివిధ రాష్ట్రాల పోలీసు ప్రధాన కార్యాలయాల మధ్య సరిహద్దులు దాటి సమన్వయాన్ని పెంపొందించే పటిష్టమైన వ్యవస్థలను ఏర్పాటు చేయండి. పొరుగు రాష్ట్రాలతో సాంకేతిక మౌలిక సదుపాయాలను, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) వ్యవస్థను పంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. మనమందరం కలిసి పనిచేస్తూ సురక్షితమైన దక్షిణ భారతదేశాన్ని నిర్మిద్దాం.` అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఈ సమావేశంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, కర్ణాటక డీజీపీ డాక్టర్ ఎంఏ. సలీమ్, తమిళనాడు డీజీపీ డాక్టర్ మహేష్ అగర్వాల్, పుదుచ్చేరి డీజీపీ షాలిని సింగ్, లక్షద్వీప్ ఏడీజీ బీ. శంకర్ జైస్వాల్, కేరళ ఐజీ అజీతా బేగం, ఆంధ్రప్రదేశ్ ఐజీపీ రవి కృష్ణ, ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) డైరెక్టర్ శిఖా గోయల్, తెలంగాణ పోలీస్ అకాడమీ (TGPA) డైరెక్టర్ అభిలాష బిస్త్, లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్ భగవత్, సీఐడీ డీజీ చారు సిన్హా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఆపరేషన్స్ విభాగం డీజీ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●India Files | అద్దంకి దయాకర్ హీరోగా `ఇండియా ఫైల్స్`.. అమెరికాలో ఘనంగా టీజర్ లాంచ్
- ●Annamalai | సీజేపీకి ఎప్పటికీ మద్దతు ఇవ్వబోం.. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతాం : అన్నామలై
- ●Journalist Shankar | జర్నలిస్ట్ శంకర్ అరెస్టు అప్రజాస్వామికం: టీయూడబ్ల్యూజే
- ●418 Movie Review | 418 రివ్యూ - ప్రశాంత్ నీల్ హారర్ మూవీ భయపెట్టిందా? లేదా?...
- ●Road Accident | దవాఖానకు వెళ్తుండగా అంబులెన్స్‌ను ఢీకొట్టిన లారీ.. రోగి, ఆమె తల్లి మృతి
- ●Heat Deaths Across Europe | భానుడి భగభగలు.. 50 వేల మంది మృత్యువాత.. వాతావరణ మార్పులే కారణమంటున్న పరిశోధకులు

India Files | అద్దంకి దయాకర్ హీరోగా `ఇండియా ఫైల్స్`.. అమెరికాలో ఘనంగా టీజర్ లాంచ్

Annamalai | సీజేపీకి ఎప్పటికీ మద్దతు ఇవ్వబోం.. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతాం : అన్నామలై

Journalist Shankar | జర్నలిస్ట్ శంకర్ అరెస్టు అప్రజాస్వామికం: టీయూడబ్ల్యూజే

418 Movie Review | 418 రివ్యూ - ప్రశాంత్ నీల్ హారర్ మూవీ భయపెట్టిందా? లేదా?...






