త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | ఆదిలాబాద్ రిమ్స్ అగ్నిప్ర‌మాదం.. సీఎం రేవంత్ విచారం

Revanth Reddy | ఆదిలాబాద్ రిమ్స్ (Adilabad RIMS) ద‌వాఖాన‌లో అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) విచారం వ్య‌క్తం చేశారు. సోమ‌వారం అర్ధ‌రాత్రి స‌మ‌యంలో హాస్పిట‌ల్‌లోని న‌వ‌జాత శిశువుల (SNCU) వార్డులో ఏసీ పేల‌డంతో మంట‌లు ఎగ‌సిప‌డ్డాయి.

G

Telangana | Published On Sep 22, 2026, 9.20 am IST

Revanth Reddy | ఆదిలాబాద్ రిమ్స్ అగ్నిప్ర‌మాదం.. సీఎం రేవంత్ విచారం
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ఆదిలాబాద్ రిమ్స్ (Adilabad RIMS) ద‌వాఖాన‌లో అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) విచారం వ్య‌క్తం చేశారు. సోమ‌వారం అర్ధ‌రాత్రి స‌మ‌యంలో హాస్పిట‌ల్‌లోని న‌వ‌జాత శిశువుల (SNCU) వార్డులో ఏసీ పేల‌డంతో మంట‌లు ఎగ‌సిప‌డ్డాయి. దీంతో వార్డులో భారీగా పొగ‌లు క‌మ్ముకోవ‌డంతో ఊపిరాడ‌క ఐదు రోజుల ప‌సికందు స‌హా ఇద్ద‌రు చిన్నారులు మృతిచెందారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమని సీఎం రేవంత్ అన్నారు. మృతుల‌ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారుల‌ను ఆదేశించారు. వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఘటనకు దారితీసిన కారణాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని స్ప‌ష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా అన్ని ద‌వాఖాన‌ల్లో భద్రతా చర్యలను పటిష్టం చేయాలని ఆదేశించారు.

సోమ‌వారం అర్ధ‌రాత్రి స‌మ‌యంలో ఎస్ఎన్‌సీయూ వార్డులో షార్ట్ స‌ర్క్యూట్ (Short Circuit) కార‌ణంగా ఏసీ పేలిపేయింది. దీంతో భారీగా మంట‌లు చెల‌రేగి వార్డంతా పొగలు కమ్ముకున్నాయి. భయాందోళనలకు గురైన తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొని బయటకు పరుగెత్తారు. అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది ఆ వార్డుకు విద్యుత్తు సరఫరా నిలిపి వేశారు. అందులోని పిల్లలను పక్క వార్డుకు తరలించారు. వార్డు నుంచి బ‌య‌ట‌కు వెళ్లేందుకు మార్గం ఇబ్బందిక‌రంగా మార‌డంతో అద్దాలు ప‌గుల‌గొట్టి బ‌య‌ట‌కు వ‌చ్చారు. అనంత‌రం చిన్నారుల‌ను ఒక్కొక్క‌రినీ సుర‌క్షితంగా బ‌ట‌య‌కు తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే ఊపిరాడ‌క ఓ న‌వ‌జాత శిశువు మ‌ర‌ణించ‌గా, చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం ఉద‌యం మ‌రో చిన్నారి కూడా చ‌నిపోయింది. మ‌రో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో వారికి అత్య‌వ‌స‌ర చికిత్స అందిస్తున్నారు. ప్ర‌మాద స‌మ‌యంలో వార్డులో 24 మంది పిల్లలు ఉన్నారు.

 

Advertisement
Advertisement