త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఆంధ్రాలో జ‌ల పండుగ..! తెలంగాణ‌లో క్రాప్ హాలీడే..!

KTR | ఆంధ్రాలో 700 కిలోమీటర్ల కిందిదాకా నీళ్లు తీసుకుపోతే 70 కిలోమీటర్ల దూరమున్న మహబూబ్ నగర్‌కి కూడా నీళ్లు తీసుకోపోలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల ద్వారా ఈరోజు తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా నిలుస్తుండే.. కానీ కాంగ్రెస్ పాలన వల్ల కరువు దిశగా పోతున్నదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

S

Telangana | Published On Oct 16, 2026, 4.20 pm IST

KTR | ఆంధ్రాలో జ‌ల పండుగ..! తెలంగాణ‌లో క్రాప్ హాలీడే..!
Advertisement

ఇది కాలం తెచ్చిన క‌రువు కాదు..
కాంగ్రెస్ తెచ్చిన క‌రువు..
రైతులు క‌ష్టాల్లో ఉన్నారు..
రాష్ట్రం క‌ష్టంలో ఉంది..
రాజ‌కీయాలు ప‌క్క‌న‌పెట్టి
అన్న‌దాత‌ల‌ను ఆదుకోండి
న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గ స‌మావేశంలో కేటీఆర్

KTR | త్రినేత్ర న్యూస్ : ఆంధ్రాలో 700 కిలోమీటర్ల కిందిదాకా నీళ్లు తీసుకుపోతే 70 కిలోమీటర్ల దూరమున్న మహబూబ్ నగర్‌కి కూడా నీళ్లు తీసుకోపోలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల ద్వారా ఈరోజు తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా నిలుస్తుండే.. కానీ కాంగ్రెస్ పాలన వల్ల కరువు దిశగా పోతున్నదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని విమ‌ర్శించారు. ఆంధ్రాలో జల పండగ ఎట్ల‌యిత‌ది..? తెలంగాణలో కరువు ఎందుకుంటది..? అని ప్ర‌శ్నించారు. తెలంగాణ నుంచి పారే నీళ్లతో ఆంధ్రాలో ప్రాజెక్టులు నిండుతున్నాయి.. కానీ తెలంగాణలో క్రాప్ హాలిడే అని కాంగ్రెస్ చెబుతుంది అని మండిప‌డ్డారు. దండం పెట్టి ప్రభుత్వానికి చెబుతున్నా, రైతులు కష్టాల్లో ఉన్నారు, రాష్ట్రం కష్టంలో ఉంది.. రాజకీయాలు పక్కన పెట్టి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి వారిని ఆదుకోవాలి అని కేటీఆర్ కోరారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన నర్సంపేట నియోజకవర్గ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ముఖ్యమంత్రి విదేశీ బొగ్గు కావాలి అంటున్నాడు

సింగరేణి నిండా కుంభకోణాలు ఉన్నాయి అని నేను చెప్పిన. కాంగ్రెస్ చేసిన కుంభకోణాలని ప్రజల ముందు పెడితే రేవంత్ రెడ్డి నిన్న అడ్డగోలుగా మాట్లాడిండు. నువ్వు ఉత్తరం రాస్తే నేను విచారణకు ఆదేశిస్తా అన్నాడు. మీడియా ముందు మాట్లాడుడు కాదు, దమ్ముంటే సింగరేణి కుంభకోణంపైన ప్రతిపాదిత విదేశీ బొగ్గు కొనుగోళ్లపైన విచారణ సిట్టింగ్ జడ్జితో చేయించాలి. బొగ్గు అంశంలోనే కాదు, దమ్ముంటే నువ్వు చేసిన అక్రమాలపై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణకి ఆదేశించు. నీ బామ్మర్ది సింగరేణిలో కొల్లగొట్టిన రూ. 10 వేల కోట్ల కుంభకోణంపై విచారణ వేయ్. సింగరేణిలో నువ్వు చేసిన సోలార్ పవర్ కుంభకోణం బయటపెడతా. సింగరేణిని బొందపెట్టి ఇప్పుడు 70 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన సింగరేణిని కాదని విదేశీ బొగ్గు తేవడానికి కుట్ర చేస్తున్నాడు. గతంలో రాష్ట్రంలో 24 గంటల పాటు కరెంట్ పోకుండా అండగా నిలబడింది సింగరేణి. ఇప్పుడు అదే సింగరేణిని బాద్నామ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. సంక్షోభంలోకి నెట్టిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి బొగ్గు తేవాలి, కరెంట్ కొనాలి అని అంతా ఆగమైనంక చెబుతున్నాడు. సింగరేణి బొగ్గు వద్దు, భారతదేశంలో ఉండే బొగ్గు వద్దు అని అంటున్న ముఖ్యమంత్రి విదేశీ బొగ్గు కావాలి అంటున్నాడు. ఆస్ట్రేలియా నుంచి బొగ్గు కొంటే కమీషన్లు వస్తాయి. సింగరేణిలో 3,800కి టన్నుకి దొరికే బొగ్గు, విదేశాలలో అయితే 10, 12 వేలు వస్తాయి కాబట్టి అక్కడ కమీషన్లు కొట్టడం కోసమే ఈ కుట్ర చేస్తున్నాడు అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఈఎంఐ కట్టకుంటే ఈయన పదవి పోతుంది

రేవంత్ రెడ్డి ఈఎంఐ ముఖ్యమంత్రి.. ఈఎంఐ కట్టకుంటే ఈయన పదవి పోతుంది. కాబట్టే ఇప్పుడు బొగ్గు కుంభకోణంతోని స్కామ్ కుంభకోణం స్కామ్ చేసి ముడుపులు కట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. కాంగ్రెస్‌కు కట్టే ఈఎంఐల కోసమే ఇక్కడ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఉన్నాడు. రికవరీ ఏజెంట్ లాంటి ఈ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, రేవంత్ రెడ్డి కమీషన్లు కట్టకుంటే ఆయన పదవిని గుంజి పడేస్తాడు. రేవంత్ రెడ్డి పదవి రెన్యూవల్ కాదు. రేవంత్ రెడ్డి అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు అందరిని మోసం చేస్తున్నాడు అని వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మండిప‌డ్డారు.

సింగరేణి భుజం మీద తుపాకి

సింగరేణి భుజం మీద తుపాకి పెట్టి టెండర్లు, కమీషన్ల లెక్కలు వేసుకుంటున్నాడు. సింగరేణిలో ఉత్పత్తి తగ్గించిండు.. అందుకే ఈరోజు కరెంట్ ఉత్పత్తి కేంద్రాల దగ్గర బొగ్గు లేదు. సింగరేణికి రూ. 60 వేల కోట్ల పెండింగ్‌లో పెట్టి బొగ్గు ఇవ్వడం లేదని బాద్నామ్ చేస్తున్నాడు. కరెంట్ సరఫరా వ్యవస్థను పండబెట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కొందామంటే కరెంట్ లేదు అని అబద్ధాలు చెబుతున్నాడు. ఒకనాడు 24 గంటల కరెంట్ వచ్చిన తెలంగాణలో ఇప్పుడు కరెంట్ ఎందుకు లేదు? కరెంట్ కొనుగోలు కోసం ఛత్తీస్‌గ‌ఢ్‌తో ఒప్పందం చేసుకుంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని కుంభకోణం అన్నాడు. ఇప్పుడేమో కొందామంటే కరెంట్ లేదు అని చెబుతున్నాడు. 3 రూపాయల 90 పైసలకు అప్పుడు మేము కొంటే కుంభకోణం అయితే, ఇప్పుడు 15 రూపాయలు పెట్టి కొనాలని చూస్తున్న కాంగ్రెస్ తీరుని ఏమనాలి? కరెంట్ కొనుగోళ్లపైన కుంభకోణం అంటూ ఒక కమిషన్ వేసిండు. బద్నాం చేయ‌డానికి కుట్ర చేసిండు. రాష్ట్రంలో 30 లక్షల కరెంట్ పంపు సెట్లు ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టులకు కరెంట్ కావాలి, తెలంగాణ రైతులకు కరెంట్ ఇయ్యాలి. విద్యుత్‌పై ఆధారపడిన కుటీర పరిశ్రమలు, పరిశ్రమలకు విద్యుత్ ఇవ్వాలి. అందుకే ఆనాడు అన్ని ప్రయత్నాలు చేసి 24 గంటల కరెంట్ ఇచ్చాం. కానీ కాంగ్రెస్ రాగానే కరెంట్ కోతలు వచ్చాయి అని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

నీళ్లు ఎత్తమంటే రేవంత్ రెడ్డి ఎత్తలేదు

రేవంత్ రెడ్డి 1000 టీఎంసీల నీళ్లను సముద్రంలో వదిలిపెట్టిండు. ఇప్పటిదాకా సాగునీటిపైన, కరువు పరిస్థితులపైన స్పందించకుండా కాలం వెళ్ళిపోయినాక ఇప్పుడు నాటకాలు చేస్తున్నాడు. ఆరు నెలల ముందే కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయాలని మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేశాం. కాళేశ్వరం ప్రాజెక్టులో వృథాగా కిందికి పోతున్న నీళ్లను అక్కడిదాకా పర్యటించి ప్రభుత్వానికి ప్రజలకు చూపించాం. కానీ కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగిస్తే ఇన్ని సంవత్సరాలు తాను చేసిన దొంగమాటలు ప్రజలకు ముందు తేలిపోతుందని రేవంత్ రెడ్డి నీళ్లు ఎత్తిపోయలేదు. వృధాగా కిందికి పోయిన నీళ్లు ఎత్తిపోయకుండా ఇప్పుడు ఎల్-నీనో పేరుతో చేతులెత్తేసిండు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తమంటే రేవంత్ రెడ్డి ఎత్తలేదు. ఉన్న నీళ్లు కిందికి పోయాయి, రాష్ట్రంలో ఉన్న పంటలు ఎండిపోతున్నాయి, తాగునీటికి సాగునీటికి కొరత మొదలయ్యింది. ఇప్పుడు ఎల్‌నినో వచ్చింది నేనేం చేసానని రేవంత్ రెడ్డి చేతులెత్తేస్తున్నాడు. ఇదే ఎల్‌నినో దేశమంతా ఉంది, పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌లో కర్ణాటకలో కూడా ఉంది. కానీ ఆంధ్రాలో అక్కడ ముఖ్యమంత్రి జలపండగ చేస్తున్నాడు. 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం దాకా నీళ్లు తీసుకుపోయిండు. 400 టీఎంసీలను పట్టిసీమ పంపుతో ఎత్తిపోస్తున్నాడు. పోతిరెడ్డిపాడు నుంచి మొదలుకొని ఆంధ్రాకి అన్ని ప్రాజెక్టులో నీళ్లు నింపుకున్నారు. ఆంధ్రాలో 700 కిలోమీటర్ల కిందిదాకా నీళ్లు తీసుకుపోతే 70 కిలోమీటర్ల దూరమున్న మహబూబ్ నగర్‌కి కూడా నీళ్లు తీసుకోపోలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల ద్వారా ఈరోజు తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా నిలుస్తుండే. కానీ కాంగ్రెస్ పాలన వల్ల కరువు దిశగా పోతున్నది అని కేటీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

నర్సంపేట నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా..

నర్సంపేటలో గులాబీ జెండా ఎగరడం ఖాయం. నర్సంపేట నియోజకవర్గాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత దత్తత తీసుకుంటా, పెద్ది సుదర్శన్ రెడ్డి చేయాలనుకున్న అభివృద్ధిని దగ్గరుండి చేయిస్తాను. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పార్టీ కాపాడుకుంటుంది. నర్సంపేటలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి మేము అండగా ఉంటాం. నర్సంపేటలో పార్టీ శ్రేణులన్నీ ఐక్యంగా కలిసి కొట్లాడాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రయత్నం చేయాలి. ఒక పార్టీ నాయకుడు చనిపోతే ఆయన కుటుంబానికి అండగా ఉండడంతో పాటు వారిని గుండెల్లో పెట్టుకొని చూసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీనే. ఎక్కడ వెళ్లినా కేసీఆర్ తిరిగి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement