త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Juluru Gouri Shankar | తెలంగాణ దసరా సంప్రదాయాలపై పుస్తకం ఆవిష్కరణ

Juluru Gouri Shankar | తెలంగాణలో దసరా పండుగకు సంబంధించిన గిరిజన, గ్రామీణ, పట్టణ సంప్రదాయాలను పరిచయం చేస్తూ ప్రముఖ చరిత్ర పరిశోధకుడు డాక్ట‌ర్ సత్యనారాయణ ద్యావనపల్లి రచించిన తెలంగాణ ద‌స‌రా: ట్రైబ‌ల్‌, రూర‌ల్ అండ్ టౌన్ ట్రెడిష‌న్స్ పుస్తకాన్ని ప్రముఖ సాహితీవేత్త జూలూరు గౌరీశంకర్‌ సోమవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.

P

Telangana | Published On Oct 19, 2026, 8.32 pm IST

Juluru Gouri Shankar | తెలంగాణ దసరా సంప్రదాయాలపై పుస్తకం ఆవిష్కరణ
Advertisement

Juluru Gouri Shankar | తెలంగాణలో దసరా పండుగకు సంబంధించిన గిరిజన, గ్రామీణ, పట్టణ సంప్రదాయాలను పరిచయం చేస్తూ ప్రముఖ చరిత్ర పరిశోధకుడు డాక్ట‌ర్ సత్యనారాయణ ద్యావనపల్లి రచించిన తెలంగాణ ద‌స‌రా: ట్రైబ‌ల్‌, రూర‌ల్ అండ్ టౌన్ ట్రెడిష‌న్స్ పుస్తకాన్ని ప్రముఖ సాహితీవేత్త జూలూరు గౌరీశంకర్‌ సోమవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. దసరా పండుగను పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకతను వక్తలు వివరించారు. ఈ సందర్భంగా జూలూరు గౌరీశంకర్‌ మాట్లాడుతూ తెలంగాణ పండుగలు, వాటికి సంబంధించిన ఆచారాలు, సంప్రదాయాలు ఈ ప్రాంత ప్రజల చారిత్రక, సాంస్కృతిక జీవన విధానాలకు అద్దం పడతాయన్నారు. గిరిజన సమాజాల నుంచి గ్రామీణ, పట్టణ ప్రజల వరకు దసరాను విభిన్న పద్ధతుల్లో జరుపుకుంటారని పేర్కొన్నారు.

ఈ వైవిధ్యాన్ని చారిత్రక దృష్టితో పుస్తక రూపంలో నమోదు చేయడం అభినందనీయమన్నారు. మారుతున్న కాలంలో పూర్వతరాల ఆచారాలు, జానపద కథనాలు, స్థానిక సంప్రదాయాలు మరుగున పడకుండా భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో ఇలాంటి పరిశోధనాత్మక రచనలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. రచయిత డాక్ట‌ర్ సత్యనారాయణ ద్యావనపల్లి మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిశీలనలు, స్థానికుల జ్ఞాపకాలు, జానపద కథనాలు, చారిత్రక ఆధారాల సాయంతో తెలంగాణ దసరా సంప్రదాయాలను ఈ పుస్తకంలో నమోదు చేసినట్లు తెలిపారు. గోండులు, కోలాములు, అంధులు వంటి గిరిజన సమాజాల ఆచారాలతో పాటు బొండుగుల, చెగ్గాం, చౌళ్లపల్లి, వేములవాడ గ్రామీణ సంప్రదాయాలు, సికింద్రాబాద్‌ పట్టణ ఆచారాలను వివరించినట్లు చెప్పారు.

జమ్మి చెట్టు పూజ, జమ్మి ఆకులను బంగారానికి ప్రతీకగా ఇచ్చిపుచ్చుకోవడం, పూర్వీకులకు సంబంధించిన ఆచారాలు, పంటలతో ముడిపడిన సంప్రదాయాలు, పెద్దపులి వేడుకలు వంటి విశేషాలను ఇందులో పొందుపరిచినట్లు వెల్లడించారు. ఒకప్పుడు విద్యార్థులు ఇళ్లకు వెళ్లి గురుదక్షిణ సేకరించే ఆచారాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలిపారు. తెలంగాణ దసరా సంప్రదాయాల్లోని సామాజిక, సాంస్కృతిక, మతపరమైన అంశాలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు స్థానిక సమాజాల సామూహిక జ్ఞాపకాలను భద్రపరచడమే ఈ రచన ప్రధాన ఉద్దేశమని వివరించారు. కార్యక్రమంలో హిమాయత్‌నగర్‌ సురక్ష కమిటీ అధ్యక్షుడు రాంపాక మహేశ్‌ కుమార్‌, సభ్యులు విజయ్‌ తిబ్బల్‌, శివసాగర్‌, సతీశ్‌, భక్తులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement