త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 | శ్రేయాస్‌ అయ్యర్‌ టీమిండియా టీ20 కెప్టెన్‌ అవుతాడా? జహీర్‌ ఖాన్‌ ఏమన్నాడంటే..?

IPL 2026 | ఐపీఎల్‌ 2026లో అద్భుత ఫామ్‌లో ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌పై టీమిండియాలోకి రీ-ఎంట్రీ, కెప్టెన్సీ చర్చలు జరుగుతున్న వేళ, ముందుగా జట్టులో స్థానం పటిష్టం చేసుకోవాలని జహీర్‌ ఖాన్‌ సూచించాడు. ఆటగాడిగా ప్రభావం చూపితేనే భవిష్యత్తు అవకాశాలు వస్తాయని స్పష్టం చేశాడు.

P

Sports | Published On Apr 22, 2026, 6.19 pm IST

IPL 2026 | శ్రేయాస్‌ అయ్యర్‌ టీమిండియా టీ20 కెప్టెన్‌ అవుతాడా? జహీర్‌ ఖాన్‌ ఏమన్నాడంటే..?
Advertisement

IPL 2026 | ఇండియన్‌ ప్రీమియర్‌ 2026 సీజన్‌లో పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అతని నాయకత్వంలో జట్టు స్థిరంగా రాణిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఓటమి లేకుండా దూసుకుపోతున్నది. గత సీజన్‌లో దాదాపు 11 ఏళ్ల తర్వాత జట్టును ఫైనల్‌ వరకు నడిపించాడు. ఈ క్రమంలో ప్రస్తుతం అయ్యర్‌కు జాతీయ జట్టులోకి తీసుకోవడంతో పాటు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ జహీర్‌ ఖాన్‌ సైతం కీలక సూచనలు చేశాడు. ఓ ఇంటర్వ్యూలో జహీర్‌ మాట్లాడుతూ తొలుత అయ్యర్‌ దృష్టిలో జట్టులో చోటు దక్కించుకోవడంపైనే ఉండాలన్నాడు. ప్రస్తుత సమయంలో కెప్టెన్సీ గురించి ఆలోచిస్తున్నాడో లేదో తనకు తెలియదని, భవిష్యత్‌లో మాత్రం కెప్టెన్సీకి అర్హుడు కావొచ్చన్నారు. ఫ్రాంచైజీ జట్లకు నాయకత్వం వహించిన అనుభవం ఉందని గుర్తు చేశాడు. టీమ్‌ ఇండియాలో స్థానం సంపాదించాలంటే ముందుగా ఆటగాడిగా ప్రభావం చూపాలని, ఆ తర్వాత మిగతా విషయాలు టీమ్‌ మేనేజ్‌మెంట్‌పైనే ఆధారపడి ఉంటాయని తెలిపాడు.

ఈ ఏడాది భారత్‌-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన భారత జట్టులో అయ్యర్‌కు చోటు దక్కలేదు. ప్రస్తుతం అతని దృష్టి మళ్లీ జాతీయ జట్టులో చోటు సంపాదించడమే. ఇటీవల లక్నో సూపర్‌ జెయింట్స్‌పై పంజాబ్‌ కింగ్స్‌ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఏడు వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసి.. ఈ సీజన్‌లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. ప్రియాంశ్‌ ఆర్యా, కూపర్‌ కానోలీ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి 182 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ గమనాన్ని పూర్తిగా మార్చేశారు. ఈ మ్యాచ్‌ అనంతరం అయ్యర్‌ జట్టు వ్యూహంపై మామాట్లాడుతూ ఆర్యా, కానోలి భాగస్వామ్యం గొప్పదని, ఇందులో ఆడిన కొన్ని షాట్లు అద్భుతంగా ఉన్నాయని తెలిపాడు. ఫాస్ట్‌ బౌలర్లపై బ్యాక్‌ఫుట్ నుంచి నేరుగా ఆడిన షాట్లు చూడాల్సిందేనని.. ఓవర్ల మధ్యలో ప్రదర్శించిన సమయస్ఫూర్తి కీలకమని పేర్కొన్నాడు. జట్టు వాతావరణం గురించి మాట్లాడుతూ కూపర్‌, ఆర్యాతో ఎవరెక్కువ సిక్సులు కొడతారో చూద్దామని.. బహుమతిగా తన బ్యాట్‌ ఇస్తానని తెలిపానని.. అది పెద్ద విషయం కాకపోయినా ఆటలో ఆనందం పెరుగుతుందని పేర్కొన్నారు. ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇస్తే మెరుగైన ప్రదర్శన చేస్తారని, అదే తమ మంత్రమని వివరించాడు.

Advertisement
Advertisement